Krishna Kowshik
ఎన్ని చదువులు చదివినా.. ఉద్యోగాలు రావడం లేదు.. అందుకే బర్రెలు కాస్తున్న ఫ్రెండ్స్ అంటూ పాపులర్ అయిన ఈ సోషల్ మీడియా స్టార్.. ఆ తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి.. రాజకీయ నేతల్నే ఆశ్చర్యపరిచేలా చేసింది. ఇప్పుడు మరోసారి పోటీకి సిద్ధం అయ్యింది.
ఎన్ని చదువులు చదివినా.. ఉద్యోగాలు రావడం లేదు.. అందుకే బర్రెలు కాస్తున్న ఫ్రెండ్స్ అంటూ పాపులర్ అయిన ఈ సోషల్ మీడియా స్టార్.. ఆ తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి.. రాజకీయ నేతల్నే ఆశ్చర్యపరిచేలా చేసింది. ఇప్పుడు మరోసారి పోటీకి సిద్ధం అయ్యింది.
Krishna Kowshik
సోషల్ మీడియా స్టార్ కాస్త పొలిటికల్ స్టార్‌గా మారింది శిరీష అలియాస్ బర్రెలక్క. ‘బర్రెలు కాస్తున్న ఫ్రెండ్స్’ అనే వీడియోతో హల్ చల్ చేసిన శిరీష.. ఎవ్వరూ ఊహించని విధంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి పాపులర్ అయ్యింది. గత ప్రభుత్వంపై నిరసనగా నిరుద్యోగుల తరుఫున గళమెత్తింది. అవమానాలు, దాడులు కూడా ఎదుర్కొని నిలబడి నాగర్ కర్నూల్ జిల్లా కొల్హాపూర్ నియోజక వర్గం నుండి స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీకి దిగింది. ఉద్దంత రాజకీయ పండితులు సైతం ఈ మగువ తెగువ చూసి ఆశ్చర్యపోయారు. ఓడిపోయినా.. ఆగిపోలేదు శిరీష. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రతిన పూనింది. అంతలో ఆమె పెళ్లి హడావుడిలో మునిగిపోయింది. గత నెలలో వెంకటేశ్ అనే వ్యక్తిని మనువాడింది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో హల్ చల్ చేసిన సంగతి విదితమే.
అయితే పెళ్లైంది కదా.. ఇక పాలిటిక్స్‌కు మంగళం పాడేస్తుందని అనుకున్నారంతా. అంతలో ఎన్నికల నగారా మోగింది. ఎలాంటి పొలిటికల్ ప్రకటన లేకపోవడం అలాగే.. పెళ్లి వీడియోలతో సోషల్ మీడియాను అలర్ట్ చేస్తుండటంతో పోటీ చేయదు అని భావించారు. కానీ అనూహ్యంగా తాను ఎంపీ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. అందుకు తగ్గట్టుగానే ముందుకు సాగుతోంది. నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా పోటీకి దిగుతోంది బర్రెలక్క. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసింది. ఈ మేరకు అందరూ ఆశీర్వదించాలని పేర్కొంటూ వీడియోను పోస్టు చేసింది. పెద్ద మనసుతో మీరు నన్ను దీవించి, ఆశీర్వదించండి అంటూ కోరింది.
ఇప్పటికే ఆమె ప్రచారం కూడా మొదలు పెట్టేసింది. దానికి సంబంధించిన వీడియోను కూడా నెట్టింట్లో పోస్టు చేసింది శిరీష. ఎంపీకి యుద్ధం మొదలు అయ్యింది అంటూ ప్రచారంలో పాల్గొన్న వీడియోను సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అలాగే తన లాంటి ఆశావాహులకు కూడా సలహాలు ఇస్తుంది. కొత్తగా నామినేషన్ దాఖలు చేయాలనుకున్న వారికి.. నామినేషన్ పత్రాలు ఎక్కడ లభిస్తాయి.. ఎలా వేయాలన్న సూచనలు కూడా చేసింది. మరి కొద్ది మంది యువతకు ప్రేరణగా నిలుస్తోంది ఈ యువ కెరటం. మొత్తానికి ఓడిపోయినా వెనక్కు తగ్గేది లే అంటోంది ఈ కొత్త పెళ్లి కూతురు. గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్హాపూర్ నుండి పోటీ చేసిన ఆమెకు 5,754 ఓట్లు వచ్చిన సంగతి విదితమే.