గాడిద పాల వ్యాపారంతో మోసం.. లీటర్ కు రూ. 1600 అని నమ్మించి 100 కోట్లతో జంప్

Donkey Milk scam: గాడిద పాల వ్యాపారంతో భారీ కుంభకోణానికి తెరలేపారు తమిళనాడుకు చెందిన ఓ ముఠా. ఏకంగా వందల కోట్లతో జంపయ్యారు. మోసపోయిన రైతులు తమకు న్యాయం చేయాలంటూ లబోదిబోమంటున్నారు.

Donkey Milk scam: గాడిద పాల వ్యాపారంతో భారీ కుంభకోణానికి తెరలేపారు తమిళనాడుకు చెందిన ఓ ముఠా. ఏకంగా వందల కోట్లతో జంపయ్యారు. మోసపోయిన రైతులు తమకు న్యాయం చేయాలంటూ లబోదిబోమంటున్నారు.

ఇటీవలి కాలంలో బర్రె పాలు, ఆవు పాల కంటే గాడిద పాలే మంచివని ప్రచారం సాగుతోంది. గాడిద పాలతో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని ప్రచారం చేస్తున్నారు. గాడిద పాలలో పోషక విలువలకు కొదవ లేదని జోరుగ ప్రచారం చేస్తున్నారు. మామూలుగా బర్రెపాలు లీటర్ కు 70 రూపాయల వరకు ఉండే అవకాశం ఉంటుంది. కానీ, గాడిద పాలు లీటర్ ఏకంగా రూ. 1600 అంటూ తమిళనాడుకు చెందిన ముఠా ప్రచారానికి తెరలేపింది. దీంతో పలువురు గాడిదలను పెంచేందుకు కూడా సిద్ధమయ్యారు. గాడిద పాల వ్యాపారానికి మొగ్గు చూపారు. గాడిద పాలతో లక్షాధికారులం అయిపోవచ్చని ఆశపడ్డారు జనాలు. వారి అత్యాశే వారి కొంపముంచింది. గాడిద పాలపై అధిక లాభాలను ఆశజూపి వంద కోట్ల మోసానికి తెరలేపింది ముఠా.

గాడిద పాల స్కామ్ తో వంద కోట్లతో ఉడాయించింది. ఈ ఘటన ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. మార్కెట్ లో గాడిద పాలకు వస్తున్న డిమాండ్, వ్యాపారానికి మొగ్గు చూపుతున్న అమాయకులను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడింది తమిళనాడుకు చెందిన ముఠా. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడుకు చెందిన బాబు ఉలగనాథం, గిరి సుందర్‌, సోనికా రెడ్డి, బాలాజీ, డాక్టర్‌ రమేష్‌ కుమార్‌ అనే ఐదుగురు 2022లో ముఠాగా ఏర్పడి డాంకీ ప్యాలెస్‌ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశారు. అంతేకాదు ఫ్రాంచైజీలు కూడా ఇచ్చారు. గాడిద పాలు లీటర్ కు రూ. 1600 అని నమ్మించారు. గాడిద పాల వ్యాపారంతో లక్షల్లోనే ఆదాయం వస్తుందని ఆశ కల్పించారు.

తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో పలువురికి గాడిదలను అంటగట్టారు. ఒక్కో పాడి గాడిదను రూ.80 వేల నుంచి 1.50 లక్షల రూపాయల చొప్పున రైతులకు అమ్మారు. అంతే కాదు.. సెక్యూరిటీ డిపాజిట్ కింద ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షలు వసూలు చేశారు. పాలను కూడా తామే సేకరిస్తామని లీటర్ కు రూ. 1600 చెల్లిస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. తర్వాత 3 నెలల పాటు నమ్మకం కలిగించేలా డబ్బులు చెల్లించారు. ఆ తర్వాత ముఖం చాటేశారు. దీంతో గాడిదలను తీసుకున్న రైతులు ముఠా సభ్యులను ప్రశ్నించారు. దీంతో ముఠా సభ్యులు వారికి రూ.15 లక్షల నుంచి రూ.70 లక్షల చొప్పున బ్యాంకు చెక్కులు రాసిచ్చి చేతులు దులుపుకున్నారు. అసలు మోసం ఇక్కడే బయటపడింది.

ఆ చెక్కులు తీసుకున్న రైతులు బ్యాంకుకు వెల్లగా అవి చెక్ బౌన్స్ అయ్యాయి. అప్పుడు రైతులు తాము మోసపోయామని గ్రహించారు. ఏకంగా 400 మంది రైతులు మోసపోయినట్లుగా తెలుస్తోంది. ఒక్కో రైతు 30 నుంచి 50 గాడిదలను కొనుగోలు చేశారు. అంటే సుమారుగా రూ.30 లక్షల నుంచి 50 లక్షల దాకా పెట్టుబడి పెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల దోపిడీ జరిగినట్లు తెలుస్తోంది. అన్ని రాష్ట్రాల్లో కలిపి వందల కోట్లో మోసం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. మోసపోయిన రైతులు చెన్నైలో డాంకీ ప్యాలెస్ ఫ్రాంచైజీ గ్రూపు సభ్యులు తమను నమ్మించి నిలువునా మోసం చేశారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో చేసిన ప్రచారం నమ్మి ముఠా సభ్యులను సంప్రదించామని బాధితులు చెప్తున్నారు. పోలీసులకు కంప్లైంట్ చేసినా పట్టించుకోవడం లేదని చెప్తున్నారు. తమకు న్యాయం చేయాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరుతున్నారు. ఈ వ్యవహారంతో దురాశ దుఖానికి చేటు అన్న వాఖ్యలు మరోసారి రుజువయ్యాయి. మరి గాడిద పాల స్కాంతో వందల కోట్ల మోసానికి పాల్పడిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments