Vinay Kola
Digital Arrest: ఈ రోజుల్లో చాలా మంది కూడా డిజిటల్ అరెస్ట్ బారిన పడుతున్నారు. చాలా దారుణంగా మోసపోతున్నారు.
Digital Arrest: ఈ రోజుల్లో చాలా మంది కూడా డిజిటల్ అరెస్ట్ బారిన పడుతున్నారు. చాలా దారుణంగా మోసపోతున్నారు.
Vinay Kola
డిజిటల్ అరెస్ట్…సామాన్యులను వణికిస్తున్న కొత్త భయం. ప్రస్తుతం దీని పేరు దేశవ్యాప్తంగా మారు మోగిపోతుంది. డిజిటల్ అరెస్ట్ కారణంగా కొంతకాలం క్రితం ఆగ్రాకి చెందిన ఒక మహిళా గుండె పోటుతో చనిపోయింది. తన కూతురు వ్యభిచారం చేస్తూ పట్టుబడిందని జైల్లో ఉందని తమకు కావాల్సిన డబ్బు పంపిస్తే వదిలేస్తామని పోలీస్ వేషంలో ఓ మోసగాడు ఆ మహిళకు వాట్స్ యాప్ వీడియో కాల్ చేశాడు. ఆమెను డిజిటల్ అరెస్ట్ చేశాడు. ఆ తరువాత ఆ మహిళా గుండె పోటుతో చనిపోయింది. అప్పటి నుంచి ఈ డిజిటల్ అరెస్ట్ సంచలనంగా మారింది. చాలా మంది సామాన్యులు ఈ డిజిటల్ అరెస్ట్ బారిన పడుతున్నారు. అయితే తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో డిజిటల్ అరెస్ట్ గురించి మాట్లాడారు. భారతీయ చట్టాల్లో డిజిటల్ అరెస్ట్ అనే ప్రస్తావనే లేదని… ఇదంతా మోసగాళ్ల పనేనని ఆయన తెలిపారు. ఏ ప్రభుత్వ సంస్థ కూడా ప్రజల వ్యక్తిగత వివరాలను ఫోన్ లేదా వీడియో కాల్ ద్వారా అడగటం భారతీయ చట్టాల్లో లేనే లేదని ఆయన స్పష్టం చేశారు. ఇక ఈ డిజిటల్ అరెస్ట్ స్కామ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. అసలు ఇంతకీ ఈ డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి… దీని ద్వారా ఎలాంటి నేరాలు జరుగుతున్నాయి? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అసలు డిజిటల్ అరెస్ట్ అంటే.. కొంతమంది మోసగాళ్లు పోలీస్, ఇన్కమ్ టాక్స్, సిబిఐ ఆఫీసర్స్ అంటూ కాల్ చేసి వ్యక్తిగత సమాచారాన్ని రాబడుతున్నారు. వీడియో కాల్స్ చేసి మీపై కేసులు పెట్టామంటూ బెదిరించి లక్షల రూపాయలు లాగేసుకుంటున్నారు. మీపై కేసు బుక్ చేశామ్.. ఇంట్లోనే ఒక దగ్గర కూర్చోండి.. ఎక్కడికి కదలొద్దు.. ఎవరికీ కాల్ చేయొద్దు అంటూ ఎలాంటి డౌట్ రాకుండా నిజమైన పోలీసుల లాగే మాట్లాడతారు. వారిలానే ఆదేశాలు జారీ చేస్తారు. కొన్ని సందర్భాల్లో పోలీస్ స్టేషన్ లేదా ఏదైనా దర్యాప్తు సంస్థ కార్యాలయం వంటివి బ్యాగ్రౌండ్ లో సెటప్ చేసుకొని… అవి వీడియో కాల్ లో కనిపించేలా మాట్లాడతారు. ఇలా మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. నిజమైన యూనిఫామ్స్ వేసుకొని నకిలీ ఐడి కార్డులు కూడా చూపిస్తున్నారు. దీంతో చాలా మంది చదువుకోని వారు, టెక్నాలజీ మీద అంత అవగాహన లేని వారు .. వీళ్ళు నిజమైన పోలీసులేమో అని నమ్మేస్తున్నారు. మీరు పంపిన పార్సిల్స్ లో డ్రగ్స్ ఉన్నాయని, ఫోన్ ద్వారా చట్ట వ్యతిరేక పనులు చేస్తున్నారని మోసగాళ్ళు బెదిరిస్తున్నారు. ఇక కొన్నిసార్లు డీప్ ఫేక్ వీడియోలు, నకిలీ అరెస్టు వారెంట్లను కూడా చూపించి బెంబేలెత్తిస్తున్నారు.ఇలాంటి కేసుల్లో ఈ మధ్యకాలంలో చాలామంది మోసపోయారు. ఇటీవల ఓ వ్యక్తి రూ. 20 లక్షలు నష్టపోయి బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు డ్రగ్స్ సీజ్ చేసినట్టు మోసగాళ్లు నమ్మించి, సెటిల్ చేసుకోకపోతే కఠిన చర్యలు ఖాయమని బెదిరించడంతో చేసేదేం లేక వారు అడిగిన రూ. 20 లక్షలు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా డిజిటల్ అరెస్ట్ బారిన పడిపోతున్నారు సామాన్యులు.
బాగా పెరిగిపోతున్న ఈ డిజిటెల్ అరెస్ట్ పై స్పందించిన ప్రధాని మోదీ.. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఈ మోసాల బారిన పడొద్దని సూచించారు. ఈ పరిస్థితి ఎదురైతే వెంటనే కొన్ని స్టెప్స్ పాటించాలని అన్నారు. కాల్ వచ్చినప్పుడు ముందుగా భయపడుతున్నట్లు కనపడకుండా ప్రశాంతంగా ఉండాలి. ఆ కాల్ ను స్క్రీన్ రికార్డ్ చేయాలి. భారతీయ చట్టాల్లో డిజిటల్ అరెస్ట్ అనే పదమే లేదని తెలుసుకోవాలి. ప్రభుత్వానికి చెందిన ఏ దర్యాప్తు సంస్థ కూడా ఆన్‌లైన్ ద్వారా కాంటాక్ట్ అవ్వదనే విషయాన్ని తెలుసుకోవాలి. ఇలాంటి వాటి బారిన పడ్డప్పుడు కచ్చితంగా నేషనల్ సైబర్‌క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు కాల్ చేయాలి. లేదా దగ్గరలో ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఇలా ఈ విషయాలు తెలుసుకొని నేరస్తులను పట్టించే ప్రయత్నం చేయాలని.. భయపడుతూ నేరస్థులకు లొంగకూడదని ప్రధాని తెలిపారు. ధైర్యంగా ఉంటూ ఇలాంటి సైబర్ నేరాలను ప్రతీ ఒక్కరూ ఎదురుకోవాలన్నారు ప్రధాని మోదీ. ఇదీ సంగతి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ సమాచారం గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.