రిలయన్స్ జియో నుంచి మరో ఆసక్తికరమైన ప్రాడక్ట్ వచ్చేసింది. టెక్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జియో ఎయిర్‌ఫైబర్ ఈ రోజు విడుదలైంది. వినాయక చవితి సందర్భంగా ఈ ప్రాడక్ట్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు కంపెనీ ఆగస్టు 28న జరిగిన 46వ యానువల్ జనరల్ మీటింగ్ (ఏజీఎం)లో ప్రకటించింది. అప్పటి నుంచి టెక్ లవర్స్‌లో దీని మీద ఆసక్తి నెలకొంది. జియో ఎయిర్ ఫైబర్ అనేది 5జీ ఆధారిత వైర్లెస్ సర్వీస్. అత్యంత వేగంతో ఇది ఇంటర్నెట్ను అందిస్తుంది. ఇల్లు, వ్యాపార అవసరాలకు కావాల్సిన ఇంటర్నెట్ కోసం దీన్ని వినియోగించుకోవచ్చు.
ప్రస్తుతం ఎక్కడ చూసినా వైర్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ ప్రొవైడర్లు ఉన్నారు. ఇళ్లు, వ్యాపార సముదాయాల్లో ఫైబర్ ఆప్టికల్ కేబుల్ ద్వారా ఇంటర్నెట్ వాడుతున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగానే ఎయిర్ ఫైబర్‌ను జియో తీసుకొచ్చింది. ఇది కేబుల్స్, వైర్స్ అవసరం లేకుండానే పనిచేస్తుంది. ఈ డివైజ్‌ను ఆన్ చేయగానే ప్రత్యేక 5జీ రేడియో లింక్ ద్వారా సమీపంలోని టవర్ నుంచి సిగ్నల్స్ అందుకొని ఇంటర్నెట్ను అందిస్తుంది. అది కూడా బ్రాడ్‌బ్యాండ్ కంటే కూడా ఎక్కువ వేగంతో. దీన్ని వైర్లెస్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్‌గా చెప్పొచ్చు. ఇంట్లో ఎన్ని డివైజ్‌లను అయినా ఎయిర్ ఫైబర్‌ను కనెక్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి హైదరాబాద్‌తో పాటు అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, ఫుణె సిటీల్లో జియో ఎయిర్ ఫైబర్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. దశల వారీగా దేశంలోని ఇతర ప్రాంతాలకూ విస్తరించనున్నట్లు జియో తెలిపింది.
జియో ఎయిర్ ఫైబర్ ప్లాన్ల విషయానికొస్తే.. రూ.599 ప్లాన్ కింద 30 ఎంబీపీఎస్ స్పీడ్‌ను ఇస్తారు. అలాగే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జీ5, సోనీలివ్, జియో సినిమా, సన్ నెక్స్ట్ తదితర ఓటీటీ సబ్స్క్రిప్షన్లు ఉచితంగా లభిస్తాయి. రూ.899 ప్లాన్‌లో 100 ఎంబీపీఎస్ స్పీడ్‌ను ఇస్తారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌తో పాటు సోనీలివ్, జీ5, జియో సినిమా, సన్ నెక్స్ట్ తదితర ఓటీటీలను ఫ్రీగా ఇస్తారు. అదే రూ.1,199 ప్లాన్ కింద అయితే 100 ఎంబీపీఎస్ స్పీడ్‌నే ఇస్తారు. కానీ పైఓటీటీలతో పాటు అదనంగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.
జియో ఎయిర్ ఫైబర్‌లో మ్యాక్స్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. రూ.1,499 ప్లాన్ కింద 300 ఎంబీపీఎస్ స్పీడుతో ఇంటర్నెట్ను అందిస్తారు. అలాగే నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌తో పాటు సోనీలివ్, జీ5, జియో సినిమా, సన్ నెక్స్ట్ తదితర ఓటీటీలు లభిస్తాయి. అదే రూ.2,499 ప్లాన్‌కు అయితే 500 ఎంబీపీఎస్ వేగంతో డేటా వస్తుంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, సోనీలివ్, జీ5, జియో సినిమా ఓటీటీ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. మెగా ప్లాన్‌గా రూ.3,999ను అందుబాటులో ఉంచారు. దీని కింద 1 జీబీపీఎస్ స్పీడుతో డేటాను అందిస్తారు. అలాగే పైన చెప్పిన ఓటీటీ సబ్స్క్రిప్షన్లు ఉచితంగా లభిస్తాయి.
జియో ఎయిర్ ఫైబర్ ప్లాన్లు 6 నుంచి 12 నెలల సబ్‌స్క్రిప్షన్‌తో వస్తాయి. ప్లాన్ల ధరకు జీఎస్టీని అదనంగా కలుపుతారు. ఇన్స్టాలేషన్ ఛార్జీల కింద రూ.1,000 అదనంగా చెల్లించాలి. వార్షిక ప్లాన్ తీసుకున్న వారికి ఇన్స్టాలేషన్ ఛార్జీ నుంచి మినహాయింపు లభిస్తుంది. జియో ఎయిర్ ఫైబర్‌లో పలు అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. 1 జీబీపీఎస్ స్పీడుతో ఇంటర్నెట్ కనెక్టివిటీ, వైఫై 6 సపోర్ట్ సహా ఓటీటీ సబ్స్క్రిప్షన్లను జియో అందిస్తోంది. దీంట్లో సెక్యూరిటీ ఫైర్‌వాల్ కూడా ఉంది. ఈ డివైజ్‌ను జియో ఎయిర్ ఫైబర్ యాప్ సాయంతో యూజర్లు నియంత్రించొచ్చు.
ఇదీ చదవండి: పవన్‌కు పిచ్చి పరాకాష్టకు చేరింది: మంత్రి రోజా