iDreamPost

Virat Kohli: ఢిల్లీ గల్లీల నుంచి వరల్డ్ కప్ విజయం వరకు..! ఇది ఓ యోధుడి కథ!

  • Published Jun 30, 2024 | 3:25 PMUpdated Jun 30, 2024 | 3:25 PM

India vs South Africa: టీమిండియా వరల్డ్ కప్ ఒడిసిపట్టడంలో కీలక పాత్ర పోషించాడు టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. మెగాటోర్నీ మొత్తం ఫెయిలైన కింగ్.. ఫైనల్ ఫైట్​లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

India vs South Africa: టీమిండియా వరల్డ్ కప్ ఒడిసిపట్టడంలో కీలక పాత్ర పోషించాడు టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. మెగాటోర్నీ మొత్తం ఫెయిలైన కింగ్.. ఫైనల్ ఫైట్​లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

  • Published Jun 30, 2024 | 3:25 PMUpdated Jun 30, 2024 | 3:25 PM
Virat Kohli: ఢిల్లీ గల్లీల నుంచి వరల్డ్ కప్ విజయం వరకు..! ఇది ఓ యోధుడి కథ!

టీ20 వరల్డ్ కప్ మొదలవడానికి ముందు అతడిపై టీమిండియా అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. సాధారణ సిరీస్​ల్లోనే చెలరేగిపోయే అతడు.. ఐసీసీ టోర్నీల్లో తనలోని విధ్వంసకారుడ్ని బయటకు తీస్తాడు. వరల్డ్ కప్స్​లో పలుమార్లు బెస్ట్ స్కోరర్​గా నిలిచి రికార్డులు సృష్టించాడు. అలాంటోడు మళ్లీ వస్తున్నాడంటే ఎక్స్​పెక్టేషన్స్ ఏ రేంజ్​లో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. అతడే విరాట్ కోహ్లీ. అతడిపై పొట్టి కప్పు ఆరంభంలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఫస్ట్ మ్యాచ్ నుంచే అతడు నిరాశపరుస్తూ వచ్చాడు. టీమ్ అందర్నీ చిత్తు చేస్తూ ఫైనల్​కు చేరుకుంది. కానీ విరాట్ మాత్రం 75 పరుగులు మాత్రమే చేశాడు. టైటిల్​ ఫైట్​లో కూడా ఇలాగే ఆడితే కప్పు పోయినట్లేనని ఫ్యాన్స్ టెన్షన్ పడ్డారు. కానీ ఫైనల్​లో తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు కింగ్.

టీమిండియా వరల్డ్ కప్ ఒడిసిపట్టడంలో కీలక పాత్ర పోషించాడు కోహ్లీ. మెగాటోర్నీ మొత్తం ఫెయిలైన కింగ్.. ఫైనల్ ఫైట్​లో మాత్రం తన విలువ ఏంటో చూపించాడు. అప్పటిదాకా అన్ని మ్యాచుల్లో కలిపి 75 పరుగులు చేసిన కోహ్లీ.. ఫైనల్​లో 76 పరుగులు చేశాడు. రోహిత్ శర్మతో పాటు సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ వెంటవెంటనే ఔట్ అవడంతో ఇన్నింగ్స్​ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను తీసుకున్నాడు. దాదాపుగా ఆఖరి ఓవర్ వరకు అతడు క్రీజులో నిలబడ్డాడు. ఒకవైపు తాను స్ట్రైక్ రొటేట్ చేస్తూ.. మరోవైపు ఇతర బ్యాటర్లతో హిట్టింగ్ చేయించాడు. ఆఖర్లో అతడు కూడా భారీ షాట్లు బాది స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కింగ్ ఇన్నింగ్స్ లేకపోతే భారత్ అంత స్కోరు చేసేది కాదు. అతడి బ్యాటింగ్​కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అయితే ఈ వరల్డ్ కప్ హీరో లైఫ్​లో ఓ బాధాకరమైన ఘటన ఉందని చాలా మందికి తెలియదు. తండ్రి మరణం రోజే విరాట్ రంజీ మ్యాచ్ ఆడాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది.

కోహ్లీ కెరీర్ తొలిరోజులవి. అప్పుడప్పుడే రంజీల్లో మంచి బ్యాటర్​గా పేరు తెచ్చుకుంటున్నాడు. తండ్రి ప్రోత్సాహంతో టీమిండియా కోసం ఆడాలనే తపనతో విరాట్ చెమటోడ్చుతున్నాడు. ఈ తరుణంలో అతడి తండ్రి పక్షవాతం వల్ల మంచం పట్టాడు. అప్పుడు కోహ్లీ వయసు 17 ఏళ్లు. రంజీ ట్రోఫీలో ఢిల్లీకి ఆడుతున్న విరాట్.. కర్ణాటకతో మ్యాచ్ రెండో రోజు ముగిసేసరికి నాటౌట్​గా నిలిచాడు. అయితే అదే రోజు రాత్రి అతడి తండ్రి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ మృతి చెందాడు. తండ్రిని కోల్పోయి కోహ్లీ తీవ్ర దు:ఖంలో మునిగిపోయాడు. అయినా తల్లి, ఇతర కుటుంబ సభ్యుల అండతో ధైర్యం తెచ్చుకున్నాడు. తండ్రి మరణవార్తతో పాటు తాను ఇన్నింగ్స్​ను కొనసాగించాలనుంటున్నట్లు కోచ్​ చేతన్ శర్మకు కాల్ చేసి చెప్పాడు విరాట్. తండ్రి చనిపోయిన రోజే గ్రౌండ్​లోకి దిగి 90 పరుగులు చేశాడు కోహ్లీ. పుట్టెడు దు:ఖంలో ఉబికి వస్తున్న కన్నీళ్లను తమాయించుకొని బ్యాట్​తో సత్తా చాటాడు. ఆ కఠిన సమయంలో కూడా పట్టుదల, అంకితభావంతో విరాట్ ఆడిన తీరుకు అంతా షాకయ్యారు.

ఆ రోజు ఆట ముగిశాక తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్న కోహ్లీలో అక్కడి నుంచి భారీ మార్పులు వచ్చాయని ఓ ఇంటర్వ్యూలో అతడి తల్లి సరోజ్ చెప్పారు. అన్న వికాస్​తో కలసి ఇంటి బాధ్యతలు తీసుకున్నాడని.. కెరీర్​లో కూడా వెనుదిరిగి చూడలేదని ఆమె పేర్కొంది. ఇంటి రెంట్లు కట్టడం, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవడం, తండ్రి మరణం అతడిలో మరింత మెచ్యూరిటీని తీసుకొచ్చాయి. ఇది 2006లో జరిగింది. అక్కడి నుంచి ప్రపంచాన్ని ఏలే బ్యాటర్​గా మారాలని డిసైడ్ అయిన కోహ్లీ.. రాత్రింబవళ్లు శ్రమించాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి చేరుకున్నాడు. సింగిల్ హ్యాండ్​తో టీమ్​కు​ కప్ అందించిన ఈ యోధుడి కథ అందరికీ స్ఫూర్తిదాయకమనే చెప్పాలి. ఒకప్పుడు ఢిల్లీ గల్లీల్లో సరదాగా తిరిగే కుర్రాడు.. ఈ స్థాయికి చేరుకోవడం అంటే మాటలు కాదు. కోహ్లీని ఇన్​స్పిరేషన్​గా తీసుకొని మరింత మంది కోహ్లీలు తయారవ్వాలి. టీమిండియాకు ఇలాగే కప్పులు అందించాలని కోరుకుందాం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి