iDreamPost
android-app
ios-app

పిచ్‌కు రక్తంతో అభిషేకం చేసిన క్రికెటర్‌! వచ్చే తరం ఉలిక్కిపడే ‘యువరాజ్‌’ కథ!

  • Published Sep 28, 2024 | 4:22 PM Updated Updated Sep 30, 2024 | 10:51 AM

Yuvraj Singh, Biography, Cricket News: ఇండియా క్రికెట్‌లో యువరాజ్‌ సింగ్‌ అనే ఓ క్రికెటర్‌ ఉండేవాడు.. అతని ఆట, అతని యూటిట్యూడ్‌, అతను గెలిపించిన మ్యాచ్‌లు, కప్పుల గురించి చెబితే.. వచ్చే తరం నమ్ముతుందో లేదో.. ఆ యువీ స్టోరీ మీ కోసం..

Yuvraj Singh, Biography, Cricket News: ఇండియా క్రికెట్‌లో యువరాజ్‌ సింగ్‌ అనే ఓ క్రికెటర్‌ ఉండేవాడు.. అతని ఆట, అతని యూటిట్యూడ్‌, అతను గెలిపించిన మ్యాచ్‌లు, కప్పుల గురించి చెబితే.. వచ్చే తరం నమ్ముతుందో లేదో.. ఆ యువీ స్టోరీ మీ కోసం..

  • Published Sep 28, 2024 | 4:22 PMUpdated Sep 30, 2024 | 10:51 AM
పిచ్‌కు రక్తంతో అభిషేకం చేసిన క్రికెటర్‌! వచ్చే తరం ఉలిక్కిపడే ‘యువరాజ్‌’ కథ!

యువరాజ్‌ సింగ్‌ ఫొటో పెట్టి.. ఇతను ఇండియాకు ఆడాడా? అని పిచ్చి ప్రశ్న వేస్తున్నారేంటి? అని అనుకుంటున్నారా? నిజమే.. యువరాజ్ సింగ్‌ ఆటని చూసిన వారెవరైనా.. చివరి శ్వాస వరకు అతన్ని మర్చిపోలేరు. కానీ.. ఓ 20, 30 ఏళ్ల తర్వాత వచ్చే కొత్త తరం క్రికెట్‌ ఫ్యాన్స్‌.. ఇలాంటి ఓ మనిషి క్రికెట్‌ ఆడుతూ.. ఈ భూమ్మీద తిరిగేవాడంటే.. నిజంగానే నమ్ముతారా? మహాత్మా సినిమాలోని ఓ పాటలో.. ‘ఇలాంటి  యువీ ఆట, అతను చేసిన పోరాటం, ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టిన తీరు, దేశం కోసం గ్రౌండ్‌లో చెమట కాదు.. ఏకంగా రక్తం చిందిస్తూ.. పిచ్‌కు రక్తాభిషేకం చేశాడంటే.. వావ్‌.. ఇలాంటి ఒక ప్లేయర్‌ ఒకప్పుడు టీమిండియా తరఫున ఆడాడా? అతను అసలు మనిషేనా? లేక సూపర్‌ మ్యానా? ఇజ్‌ హీ ఇండియన్‌ క్రికెటర్‌? అంటూ కళ్లు పెద్దవి చూసి ఆశ్చర్యపోవడం ఖాయం. ఎందుకంటే.. యువరాజ్‌ సింగ్‌ అనే ఓ కారణజన్ముడు సృష్టించిన విధ్వంసం అలాంటిది. ‘కొత్తగా క్రికెట్‌ ఆడటం మొదలుపెట్టిన ఆటగాళ్లు.. బాల్‌ని చూసి కలిగే భయం పోవాలంటే క్రికెట్‌ దేవుడు సచిన్‌ టెండూల్కర్‌ కథ వినాలా.. అసలు భయం అంటే ఏంటో తెలియాలంటే.. క్రికెట్‌ దేవర యువరాజ్‌ సింగ్‌ కథ వినాలా..’ సినిమాటిక్‌ డైలాగే అయినా.. యువీ గురించి చెప్పాలంటే ఆ మాత్రం హైప్‌ ఉండాలి..

1981 డిసెంబర్‌ 12.. పంజాబ్‌లోని చండీగర్‌లో ఓ కుర్రాడు జన్మించాడు. తండ్రి యోగ్‌రాజ్‌ అతనికి యువరాజ్‌ సింగ్‌గా పేరుపెట్టాడు. ఆ పేరు పెట్టిన టైమ్‌లో అతనికి తెలుసో లేదో.. ఆ కుర్రాడు ఇండియన్‌ క్రికెట్‌కు నిజంగానే యువరాజు అవుతాడని. చిన్నతనం నుంచే.. చదువుతో పాటు ఆటల్లోనూ ముందేవాడు యువరాజ్‌. ముఖ్యంగా స్కేటింగ్‌ అంటే యువీకి చాలా ఇష్టం. అందులో చాలా బహుమతులు కూడా గెల్చుకున్నాడు. కానీ, తండ్రి యోగ్‌రాజ్‌కు.. తన కొడుకుని క్రికెటర్‌గా చూడాలనుకున్నాడు. స్కేటింగ్‌లో వచ్చిన కప్పులను అన్నీ బయటపడేసి.. నువ్వు క్రికెట్‌ నేర్చుకోవాలని హుకూం జారీ చేశాడు. తండ్రి ఆజ్ఞతో.. క్రికెట్‌ వైపు అడుగులేశాడు యువీ. తక్కువ టైమ్‌లో మంచి ప్రతిభ కనబర్చి.. స్కూల్‌ లెవెల్‌, అండర్‌-16, దాటి.. పంజాబ్‌ తరఫున స్టేట్‌ టీమ్‌కు ఆడే స్థాయికి చూస్తుండగానే ఎదిగిపోయాడు.

2000వ ఏడాదిలో మొహమ్మద్‌ కైఫ్‌ కెప్టెన్సీలో భారత అండర్‌-19 జట్టుతో యువీ చోటు సంపాదించాడు. ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీగా నిలిచి.. ఆ వరల్డ్‌ కప్‌ ఇండియా గెలవడంలో యువీ కీలకపాత్ర పోషించాడు. ఆ ప్రదర్శనతోనే అదే ఏడాది.. టీమిండియాలోకి యువరాజు ఆగమనం జరిగింది. 2000 అక్టోబర్‌ 3.. కెన్యాతో జరిగిన వన్డే మ్యాచ్‌తో యువరాజ్‌ సింగ్‌ తన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడాడు. ఆ మ్యాచ్‌లో యువీకి బ్యాటింగ్‌ చేసే అవకాశం రాలేదు. బౌలింగ్‌లో 4 ఓవర్లు వేసి కేవలం 16 రన్స్‌ మాత్రమే ఇచ్చాడు.. అందులో ఒక మెయిడెన్‌ ఓవర్‌ ఉండటం విశేషం. బ్యాటింగ్‌ రాకపోయినా.. తొలి మ్యాచ్‌లో పాయింట్‌లో గాల్లోకి ఎగురుతూ.. యువీ అందుకున్న క్యాచ్‌.. ఆ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. అదే టోర్నీలో ఆసీస్‌తో జరిగిన తర్వాత మ్యాచ్‌లో.. యువీకి బ్యాటింగ్‌ చేసే అవకాశ వచ్చింది.. తొలి సారి బ్యాట్‌ పట్టుకొని.. అలా గ్రౌండ్‌లోకి వచ్చాడు. ఎదురుగా నిప్పులు చిమ్ముతున్న ఆస్ట్రేలియా బౌలర్లు.. అయితేనేం.. 12 నంబర్‌ జెర్సీ ధరించి.. 12 ఫోర్లు కొట్టి.. 80 బంతుల్లో 84 పరుగులు చేసి.. ఇండియా క్రికెట్‌లోకి తన ఎంట్రీని ఘనంగా చాటాడు. ఇక అక్కడి నుంచి యువీ వెనక్కి తిరిగి చూసుకోలేదు.

కపిల్‌ దేవ్‌ లాంటి ఓ నిఖార్సైన ఆల్‌రౌండర్‌ జట్టులో లేడే అని బాధపడుతున్న అప్పటి కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీకి.. యువీ రూపంలో రెండు వైపులా పదునైన కత్తి దొరికింది. కెప్టెన్‌ దాదా ఎంకరేజ్‌మెంట్‌తో యువీ మరింత రాటుదేలి.. ప్రపంచ క్రికెట్‌పై దండయాత్ర మొదలుపెట్టేశాడు. మొహమ్మద్‌ కైఫ్‌తో కలిసి.. బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ కొత్త స్టాండర్ట్స్‌ను సెట్‌ చేశాడు. అప్పటి వరకు ఇండియన్‌ టీమ్‌లో అలాంటి ఫీల్డింగ్‌ను ఎవరూ చూడలేదు. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌తో.. యువీ అనే కుర్రాడు టీమ్‌లో ఉంటే ఓ ముగ్గురు ప్లేయర్లు ఉన్నట్లే అనే ఫీలింగ్‌ కలిగేది. 2002లో క్రికెట్‌ మక్కా లార్డ్స్‌ బాల్కనీలో అప్పటి టీమిండియా కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ.. టీషర్ట్‌ విప్పి చేసిన సింహ గర్జన గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. కానీ, దాదాకు అలా చేసే అవకాశం కల్పించింది యువీ-కైఫ్‌ జోడి. ఆ మ్యాచ్‌లో కష్టాల్లో పడిన టీమిండియాను ఈ ఇద్దరు యువ క్రికెటర్లు హాఫ్‌ సెంచరీలో చెలరేగి గెలిపించారు. అలా అలా టీమిండియాలో యువరాజ్‌ సింగ్‌ ఓ స్టార్‌ ప్లేయర్‌గా ఎదిగిపోయాడు.

2007 వన్డే వరల్డ్‌ కప్‌లో రాహుల్‌ ద్రవిడ్‌ కెప్టెన్సీలో టీమిండియా ఘోరమైన ప్రదర్శన కనబర్చింది. బంగ్లాదేశ్‌, శ్రీలంక జట్లపై ఓడి.. గ్రూప్‌ స్టేజ్‌లోనే ఇంటి బాటపట్టింది. దాంతో.. ద్రవిడ్‌ తన కెప్టెన్సీ పదవికి రాజీనామా చేశాడు. అంతలోనే సౌతాఫ్రికా వేదికగా మొట్టమొదటి టీ20 వరల్డ్‌ కప్‌ టోర్నీ ముంచుకొచ్చింది. సీనియర్లు సచిన్‌, గంగూలీ, ద్రవిడ్‌.. పొట్టి ఫార్మాట్‌కు దూరంగా ఉన్నారు. టీ20 వరల్డ్‌ కప్‌కు వెళ్లే టీమ్‌కు కొత్త కెప్టెన్‌ కావాలి. అంతా కుర్రాళ్లే.. సెహ్వాగ్‌, యువీలే సీనియర్లు. కెప్టెన్‌ పోస్ట్‌కు మోస్ట్‌ ఎలిజిబుల్‌గా కనిపిస్తున్న ఒక ఒక్క క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌. కానీ, సచిన్‌ టెండూల్కర్‌ సూచన్‌ మేరకు.. యువరాజ్‌ సింగ్‌కు దక్కాల్సిన కెప్టెన్సీ పోస్ట్‌ను.. మహేంద్ర సింగ్‌ ధోనికి కట్టబెట్టింది బీసీసీఐ. తాను దేవుడిలా భావించే సచిన్‌ అంతటోడే.. ధోనికి కెప్టెన్సీ ఇస్తే బాగుంటుందని సూచించడంతో యువీ సైతం కామ్‌ అయిపోయాడు.

తనకు రావాల్సిన కెప్టెన్సీ.. వేరే వాళ్లకు దక్కిందనే కోపం, అసూయ యువీలో ఇసుమంతైనా కనిపించలేదు. ఒక వీరుడిలో ఉండే గొప్ప లక్షణం అదే. కెప్టెన్సీ లేకపోతేనేం.. టీమిండియాలో అతనో యువరాజు. ఆటతో జట్టు ముందుండి నడిపించే యోధుడు. ఎంఎస్‌ ధోని సినిమాలో ఓ సీన్ ఉంటుంది.. యువీ స్టైల్‌గా హెడ్‌ఫోన్స్‌ పెట్టుకొని వస్తుంటే.. ధోని, అతని ఫ్రెండ్స్‌ అలానే చూస్తూ ఉంటారు. యువరాజ్‌ క్యారెక్టర్‌ను హైప్‌ చేస్తూ తీసిన సీన్‌ అది. అది కేవలం ఏదో సినిమాటిక్‌ సీన్‌ మాత్రమే కాదు.. రియల్‌ లైఫ్‌లోనూ యువీకి ఆ రేంజ్‌ హైప్‌ ఉంది. ఆ స్టైల్‌, ఆ య్యాటిట్యూడ్‌.. మరే క్రికెటర్‌కు లేవు, రావు. ఎంతైనా.. అతనో యువరాజు. అలానే ఉంటాడు.

చూస్తుండగానే.. టీ20 వరల్డ్‌ కప్‌ కూడా ప్రారంభమైపోయింది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో యువీ బ్యాటింగ్‌ చేస్తున్న టైమ్‌లో.. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్‌ ఆండ్రూ ఫ్లింటాఫ్‌.. కావాలని యువీతో గొడవపడతాడు. పేరుకి స్టైలిష్‌ బాయ్‌ కానీ.. గెలికితే మాత్రం ఊర మాస్‌. ఎవర్ని అయితే గెలకొద్దో ఫ్టింటాఫ్‌ అతన్నే గెలికాడు. ఇంకేముందు.. యువీ కోపానికి అప్పటి వరకు క్రికెట్‌ ప్రపంచ కలలో కూడా ఊహించని ఓ రికార్డు నమోదైంది. నెక్ట్స్‌ ఓవర్‌లో వరుసగా ఆరు సిక్సర్లు.. యువీ అలా మోకాలిపై కూర్చోని సిక్స్‌ కొడుతుంటే.. ఆహా.. స్టేడియం మొత్తం ఊగిపోయింది. యువీ సిక్సులకు రవిశాస్త్రి కామెంట్రీ వింటుంటే.. ఇప్పటికీ రొమాలు నిక్కబోడుచుకుంటాయి. యువీని గెలికింది ఫ్లింటాఫ్‌ అయితే.. పాపం బలైంది మాత్రం స్టువర్ట్‌ బ్రాడ్‌. అప్పట్లో కుర్ర బౌలర్‌ అయిన బ్రాడ్‌.. యువీ ఆరు సిక్సుల దెబ్బకు బిత్తరపోయాడు. యువీ విధ్వంసంతో పాటు మిగతా టీమ్‌ సూపర్‌ పర్ఫార్మెన్స్‌తో తొలి టీ20 వరల్డ్ కప్‌ 2007లో ఇండియా ఛాంపియన్‌గా నిలిచింది. యువరాజ్‌ సింగ్‌.. ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీగా నిలిచాడు.

చూస్తుండగానే.. 2011 వన్డే వరల్డ్‌ కప్‌ టోర్నీ వచ్చేసింది. అప్పుడెప్పుడో 1983లో కపిల్‌ దేవ్‌ కెప్టెన్సీలోని టీమిండియా వన్డే వరల్డ్‌ కప్‌ గెలిచింది. మళ్లీ ఆ కప్పును ముద్దాడలేదు. 28 ఏళ్ల తర్వాత వన్డే వరల్డ్‌ కప్‌ను టీమిండియా కైవసం చేసుకొని.. రెండో సారి వన్డే ఛాంపియన్‌గా నిలిచింది. ఈ టోర్నీలోనూ ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీగా నిలిచింది యువరాజ్‌ సింగే. తన బ్యాటింగ్‌, బౌలింగ్‌తో ఇండియాను ఛాంపియన్‌ చేసి.. సచిన్‌ కోసం వరల్డ్‌ కప్‌ గెలుస్తామని.. టోర్నీకి ముందు చెప్పిన మాటను నిలబెట్టుకున్నాడు. ఆ టోర్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో యువరాజ్‌ సింగ్‌ ఆడిన ఇన్నింగ్స్‌ చిరస్మరణీయంగా నిలిచిపోయింది. ఏ వరల్డ్‌ కప్‌ టోర్నీలో అయినా.. ఆస్ట్రేలియాను నాకౌట్‌ మ్యాచ్‌ల్లో ఓడించే మొగోడు ఎవడైనా ఉన్నాడా అంటే ఒక్క యువరాజ్‌ సింగ్‌ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే.. ఇదే టోర్నీలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

వన్డే వరల్డ్‌ కప్‌ 2011లో భాగంగా గ్రూప్‌ స్టేజ్‌లో వెస్టిండీస్‌తో చెన్నైలో టీమిండియా మ్యాచ్‌ ఆడింది. నటీమిండియా 52 పరుగులకే ఓపెనర్లు ఇద్దరిని కోల్పోయింది. టీమిండియా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యత యువ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీతో పాటు సీనియర్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌పై పడింది. జట్టు పరిస్థితులకు తగ్గట్లు ఇద్దరూ ఆడుతూ.. 100 పరుగుల భాగస్వామ్య నమోదు చేశారు. ఇంతలోనే కొండలాంటి మనిషి యువీ కూలిపోయినట్లు కూర్చున్నాడు. నోట్లో నుంచి రక్తం.. అంతే ఒక్కసారిగా అంతా షాక్‌. డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లి ఫస్ట్‌ఎయిడ్‌ తీసుకోవాల్సిందిగా ఫీల్డ్‌ అంపైర్‌ యువీని కోరతాడు. కానీ.. యువీ మాత్రం అంపైర్‌ సూచనను లెక్కచేయలేదు. ఎందుకంటే.. ఆ సమయంలో అతనికి రక్తం కనిపించడం లేదు. తన లక్ష్యం ఒక్కటే ఇండియాకు వరల్డ్‌ కప్‌ అందించాలి, సచిన్‌కు అంకితం ఇవ్వాలి. ఇది మాత్రమే యువీకి కనిపిస్తుంది. పిచ్‌పై రక్కం కక్కుకుంటూనే సెంచరీతో టీమిండియాను గెలిపించాడు. పిచ్‌కు రక్కాభిషేకం చేసి.. చెలరేగాడు. నోట్లో రక్కంతో ఆ రోజు యువరాజ్‌ మహాకాళిలా కనిపించాడు.

ఆ మ్యాచ్‌ తర్వాత ప్రపంచానికి తెలిసిందేంటంటే.. యువీ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడని. తనకు క్యాన్సర్‌ ఉందనే విషయం యువీ ముందే తెలుసూ.. అయినా కూడా దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టి ఆడాడు. అనుకున్నది సాధించాడు. ఆ తర్వాత క్యాన్సర్‌కు చికిత్స తీసుకొని.. ఆ మహమ్మారిని జయించి.. తిరిగి ఫీల్డ్‌లోకి దిగాడు. ఒకసారి ఓ ప్రైవట్‌ ఈవెంట్‌లో యువీ మాట్లాడుతూ.. ‘దేశం కోసం జవాన్లు ప్రాణాలిస్తుంటే.. ఒక ఆటగాడిగా నేను ప్రాణం పెట్టి ఆడకపోతే ఎలా.. నోట్లే నుంచి రక్తమే కదా వచ్చేది.. ప్రాణం పోయినా ఆడాల్సిందే అని అప్పుడు నిర్ణయించుకున్నాను’ అని అన్నాడు. ఇలా ఒక సినిమాకి మించిన హైతో సాగిన యువరాజ్‌ క్రికెట్‌ లైఫ్‌.. ఎంతో మంది యువ క్రికెటర్లకు ఇన్సిపిరేషన్‌. కానీ, కెప్టెన్సీ దక్కకపోవడం, తన కెరీర్‌కు ఒక సరైన ముగింపు దక్కలేదనే ఆవేదన మాత్రం యువీ అభిమానుల్లో ఉంది. ఇండియన్‌ క్రికెట్‌లో ఒక లెజెండ్‌ లాంటి యువీ జెర్సీ నంబర్‌ను రిటైర్‌ చేయకపోవడం, రిటైర్మెంట్‌ సమయంలో సరైన ఫేవరెల్ ఇవ్వలేదనే విమర్శలు ఉన్నాయి. ఏది ఏమైనా.. రాబోయే తరం యువ క్రికెటర్లు యువీ లాంటి ఓ ఆటగాడు.. నమ్మడం కొంచెం కష్టమే. అది యువీ చరిత్ర.. ఇండియాను ఛాంపియన్‌గా నిలిపిన చరిత్ర.