iDreamPost

IND vs AFG: పసికూనపై గెలిచాము! కానీ.. ఆ విషయంలో అట్టర్ ఫ్లాప్ అయ్యాము!

  • Author Soma Sekhar Updated - 04:58 PM, Thu - 12 October 23
  • Author Soma Sekhar Updated - 04:58 PM, Thu - 12 October 23
IND vs AFG: పసికూనపై గెలిచాము! కానీ.. ఆ విషయంలో అట్టర్ ఫ్లాప్ అయ్యాము!

వరల్డ్ కప్ ను ముద్దాడాలనేది క్రికెట్ ఆడే ప్రతీ దేశం కల. మరి అలాంటి కలను నెరవేర్చుకోవడానికి ఎంత కష్టపడాలి, ఎన్ని ప్రణాళికలు వెయ్యాలో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇలాంటి మెగాటోర్నీల్లో ఏ జట్టును కూడా తక్కువగా అంచనా వేయకూడదు. ‘హీనంగా చూడకు ఘోరంగా దెబ్బతింటావ్’ అన్న డైలాగ్ ఇలాంటి మేజర్ టోర్నీల్లో బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడిదంతా ఎందుకు చెబుతున్నారు అని మీకు అనుమానం రావొచ్చు.. పైగా ఆఫ్గాన్ పై టీమిండియా 8 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. మరెందుకీ ఉపోద్ఘాతం అని మీరు అనుకోవచ్చు. పసికూనపై భారత జట్టు విజయం సాధించింది.. కానీ ఆ విషయంలో మాత్రం టీమిండియా అట్టర్ ప్లాప్ అయ్యింది. వరల్డ్ కప్ లాంటి టోర్నీల్లో ఇలాంటి పొరపాటు చేస్తే.. రానున్న మ్యాచ్ ల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని టీమిండియా ఫ్యాన్స్ అంటున్నారు.

వరల్డ్ కప్ 2023లో టీమిండియా అదరగొడుతోంది. తొలి మ్యాచ్ లో ఆసీస్ ను కంగుతినిపించిన భారత్.. రెండో మ్యాచ్ లో ఆఫ్గాన్ ను మట్టికరిపించింది. ఈ మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో టీమిండియా భారీ విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్గాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగుల భారీ స్కోర్ చేసింది. జట్టులో కెప్టెన్ హష్మతుల్లా షాహిది(80), అజ్మతుల్లా(62) పరుగులతో ఆకట్టుకున్నారు. వీరిద్దరు టీమిండియా బౌలర్లను సునాయసంగా ఎదుర్కొంటూ.. నాలుగో వికెట్ కు అభేద్యమైన 121 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు తీసి ఆఫ్గాన్ పతనాన్ని శాసించాడు.

అనంతరం 273 పరుగులు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ఓపెనర్లు రోహిత్, ఇషాన్ కిషన్ లు అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. మరీ ముఖ్యంగా రోహిత్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రోహిత్ రికార్డు సెంచరీ(131)తో, విరాట్ కోహ్లీ(55*), ఇషాన్ కిషన్(47) పరుగులతో రాణించడంతో.. కేవలం 35 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇంత వరకు వినడానికి సంతోషంగా ఉన్నా.. ఓ విషయంలో మాత్రం టీమిండియా అట్టర్ ప్లాప్ అయ్యిందనే చెప్పాలి. అదేంటంటే? ఆఫ్గాన్ లాంటి పసికూన జట్టును 63 పరుగులకే 3 వికెట్లు తీసి కష్టాల్లోకి నెట్టిన భారత బౌలర్లు.. ఆ తర్వాత వికెట్ తీయడానికి నానా కష్టాలు పడ్డారు.

ఆఫ్గాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది-అజ్మతుల్లా ఒమర్ జైల జోడీని విడగొట్టడానికి టీమిండియా బౌలర్లు చెమటోడ్చాల్సి వచ్చింది. ఈ జోడీ భారత బౌలర్లును ఈజీగా ఎదుర్కొంటు.. నాలుగో వికెట్ కు అమూల్యమైన 121 పరుగులు జోడించిందంటే.. భారత బౌలింగ్ ఎంత వీక్ గా ఉందో అర్ధమవుతోంది. 13వ ఓవర్ నుంచి 34వ ఓవర్ దాకా ఈ జోడీని విడగొట్టలేకపోయారు టీమిండియా బౌలర్లు. ఆసీస్ తో మ్యాచ్ లో సత్తా చాటిన బౌలర్లు ఈ మ్యాచ్ లో తేలిపోయారనే చెప్పాలి. లేకపోతే.. ఆఫ్గాన్ లాంటి పసికూన జట్టు టీమిండియా లాంటి బలమైన బౌలింగ్ లైనప్ పై 272 పరుగులు చేయడం ఏంటని ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాగా.. వరల్డ్ కప్ లాంటి మెగాటోర్నీల్లో పసికూన జట్లపైనే పరిస్థితి ఇలా ఉంటే.. పటిష్టమైన జట్లపై ఎం చేస్తారన్నదే ఆందోళన కలిగిస్తోంది. వరల్డ్ క్లాస్ బౌలింగ్ లైనప్ ఉన్న టీమిండియా ఆఫ్గాన్ జట్టును 50 ఓవర్లు ఆడించిందంటే ఎక్కడో.. ఏదో పొరపాటు జరుగుతోందని టీమ్ గ్రహించక తప్పదు. లేకపోతే.. వరల్డ్ కప్ లో మున్ముందు ఆడే మ్యాచ్ ల్లో టీమిండియాకు ఎదురుదెబ్బలు తప్పవంటున్నారు క్రీడా నిపుణులు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి