iDreamPost
android-app
ios-app

శాంసన్‌ను కాదని సూర్యను ఎలా సెలెక్ట్‌ చేస్తారు? కళ్లు కాకులెత్తుకెళ్లాయా?

  • Published Aug 22, 2023 | 3:30 PM Updated Updated Aug 22, 2023 | 3:30 PM
  • Published Aug 22, 2023 | 3:30 PMUpdated Aug 22, 2023 | 3:30 PM
శాంసన్‌ను కాదని సూర్యను ఎలా సెలెక్ట్‌ చేస్తారు? కళ్లు కాకులెత్తుకెళ్లాయా?

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆసియా కప్‌ 2023 కోసం ఎంపిక చేసిన భారత జట్టుపైనే నడుస్తోంది. జట్టు ఎంపికలో ఉన్న లోటుపాట్లు, సెలెక్టర్లు చేసిన తప్పులు ఇవేనంటూ సోషల్‌ మీడియా వేదికగా క్రికెట్‌ అభిమానులు తీవ్ర స్థాయిలో చర్చించుకుంటున్నారు. కొంతమంది ఆటగాళ్లకు సెలెక్టర్లు అన్యాయం చేశారంటూ పేర్కొంటున్నారు. యుజ్వేంద్ర చాహల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌తో పాటు సంజు శాంసన్‌కు తీవ్ర అన్యాయం జరిగిందని మండిపడుతున్నారు. సంజును స్టాండ్‌బై ప్లేయర్‌గా ఎంపిక చేసినప్పటికీ.. మెయిన్‌ స్క్వౌడ్‌లోకి తీసుకోకపోవడం.. ఏదో విమర్శలు రాకుండా స్టాండ్‌బై అంటూ పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా సంజు శాంసన్‌ను.. సూర్యకుమార్‌ యాదవ్‌తో పోలుస్తూ చర్చకు దారితీస్తున్నారు. సెలెక్టర్లు ఏం చూసి సూర్యను ఎంపిక చేసి, సంజును పక్కనపెట్టారో అర్థం కావడం లేదంటూ.. వారి వన్డే రికార్డులను తెరపైకి తెస్తున్నారు. ఒకసారి సంజు శాంసన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ వన్డే రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తే.. సూర్యకుమార్‌ యాదవ్‌ 2021 జులై 18న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ వన్డే ఫార్మాట్‌లోకి అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు సూర్య ఏకంగా 26 వన్డేలు ఆడాడు. అందులో 24 ఇన్నింగ్స్‌ల్లో సూర్య చేసిన పరుగులు కేవలం 511. అతని యావరేజ్‌ 24.33. అత్యధిక స్కోర్‌ 64. కేవలం రెండే హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. స్ట్రైక్‌రేజ్‌ కూడా 101.38 మాత్రమే.
అదే 2021 జులై 23న శ్రీలంకతోనే జరిగిన మ్యాచ్‌తో వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంజు శాంసన్‌.. ఇప్పటి వరకు 13 వన్డేలు మాత్రమే ఆడినా.. 55.71 యావరేజ్‌తో 390 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోర్‌ 86(నాటౌట్‌). మూడు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అలాగే 104 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్‌ చేశాడు. సూర్యకుమార్‌ యాదవ్‌తో పోల్చుకుంటే.. సంజు బ్యాటింగ్‌ యావరేజ్‌ వన్డేల్లో అద్భుతంగా ఉంది. ఇద్దరూ దాదాపు ఒకే సారి వన్డేల్లోకి వచ్చినా సూర్యకు ఇచ్చినన్ని అవకాశాలు సంజుకు ఇవ్వలేదు. అయినా కూడా సంజు తనకు వన్డేల్లో ఛాన్స్‌ వచ్చిన ప్రతిసారీ జట్టు కోసమే ఆడాడు. చాలా మ్యాచ్‌ల్లో సంజు క్లిష్టపరిస్థితిల్లోనే బ్యాటింగ్‌ చేశాడు. అయినా కూడా వన్డేల్లో సక్సెస్‌ అయ్యాడు. ఇంత చేసినా కూడా సెలెక్టర్లు సంజును కాదని సూర్యకుమార్‌ యాదవ్‌ను ఎంపిక చేశారు. కేవలం టీ20ల్లో బాగా ఆడుతున్నాడనే కారణంతో బలవంతంగా వన్డే టీమ్‌లో ఆడించాలని చూస్తున్నారు. కానీ, అతను వన్డేల్లో చేస్తున్న చెత్త ప్రదర్శనను మాత్రం చూడటం లేదని క్రికెట్‌ అభిమానులు భావిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: విరాట్‌ కోహ్లీ బౌలింగ్‌ వేస్తుంటే మేమంతా భయపడిపోయేవాళ్లం: భువనేశ్వర్ కుమార్