వరల్డ్ కప్‌లో సచిన్ సెట్ చేసిన ఆ ఒక్క రికార్డు కొట్టే మగాడు ఎవడు?

మరికొన్ని రోజుల్లో వరల్డ్‌ కప్‌ టోర్నీ ప్రారంభం కానుంది. అక్టోబర్‌ 5 నుంచి ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి టాస్‌ పడనుంది. ఇప్పటికే వామప్‌ మ్యాచ్‌లు సైతం జరుగుతున్నాయి. ప్రధాన జట్లన్నీ.. వరల్డ్‌ కప్‌ కోసం సంసిద్ధమయ్యాయి. ఈ వరల్డ్‌ కప్‌ను ఎలాగైన కొట్టాలనే పట్టుదలతో ఉన్నాయి. అయితే.. వరల్డ్‌ కప్‌ టోర్నీ అనగానే కేవలం కప్పు ఒక్కటే కాకుండా పలు రికార్డుల వేట కూడా ఉంటుంది. గతంలో నెలకొల్పిన రికార్డులు బ్రేక్‌ చేసేందుకు కూడా ఆటగాళ్లు ఉత్సాహంగా ఉంటారు. అయితే.. కొన్ని అరుదైన రికార్డులు మాత్రం చాలా కాలంగా చెక్కుచెదరకుండా ఉన్నాయి. వరల్డ్‌ కప్‌ టోర్నీ జరిగిన ప్రతిసారి.. ఆ అలాంటి రికార్డులను ఎవరు బ్రేక్‌ చేస్తారని క్రికెట్‌ అభిమానులు సైతం ఎదురుచూస్తుంటారు.

అలాంటి రికార్డుల్లో మోస్ట్‌ క్రేజీ రికార్డు క్రికెట్‌ దేవుడు సచిన్‌ టెండూల్కర్‌ సృష్టించిన రికార్డ్‌ ఒకటుంది. ఒక వన్డే వరల్డ్‌ కప్‌ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌ సచిన్‌ రికార్డు 20 ఏళ్లు చెక్కుచెదరకుండా ఉంది. సౌతాఫ్రికా వేదికగా జరిగిన 2003 వన్డే వరల్డ్‌ కప్‌లో సచిన్‌ విశ్వరూపం చూపించాడు. ఆ వరల్డ్‌ కప్‌లో గంగూలీ కెప్టెన్సీలోని టీమిండియా ఫైనల్‌ వరకు దూసుకెళ్లింది. ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైన రన్నరప్‌గా నిలిచినప్పటికీ.. ఆ టోర్నీలో సచిన్‌ నెలకొల్పిన రికార్డు మాత్రం అలాగే నిలిచిపోయింది. ఆ టోర్నీలో సచిన్‌ ఏకంగా 673 పరుగులు చేశాడు. 11 మ్యాచ్‌ల్లో 61.18 యావరేజ్‌తో ఒక సెంచరీ, 6 హాఫ్‌ సెంచరీలతో 673 రన్స్‌ చేసి టోర్నీలోనే టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు జరిగి వన్డే వరల్డ్ కప్‌ టోర్నీల్లో ఇదే అత్యధిక స్కోర్‌.

అంతకు ముందు ఈ రికార్డు టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్‌, ప్రస్తుత టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ పేరిట ఉండేది. 1999 వన్డే వరల్డ్‌ కప్‌లో ద్రవిడ్‌ 461 పరుగులు చేసి.. వన్డే వరల్డ్‌ కప్‌ టోర్నీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ద్రవిడ్‌ రికార్డును సచిన్‌.. ఆ తర్వాత జరిగిన 2003 వరల్డ్ కప్‌ బ్రేక్‌ చేశాడు. కానీ, సచిన్‌ రికార్డును ఇప్పటి వరకు ఎవరూ బ్రేక్‌ చేయలేదు. 2007 వరల్డ్‌ కప్‌లో ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌ మ్యాథ్యూ హేడెన్‌ చాలా దగ్గరికి వచ్చాడు కానీ, సచిన్‌ స్కోర్‌ను అందుకోలేకపోయాడు. ఆ వరల్డ్‌ కప్‌ హేడెన్‌ 3 సెంచరీలు, ఒక హాఫ్‌ సెంచరీతో 659 రన్స్‌ చేసి.. సచిన్‌ రికార్డు బ్రేక్‌ చేయడానికి కేవలం 5 పరుగుల దూరంలో ఆగిపోయాడు. ఆ తర్వాత 2019లో ప్రస్తుత టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సంచలన బ్యాటింగ్‌తో దుమ్మురేపిన విషయం తెలిసిందే.

2019 వరల్డ్‌ కప్‌లో రోహిత్‌ శర్మ ఏకంగా 5 సెంచరీలు సాధించాడు. కానీ.. టీమిండియా సెమీస్‌లోనే ఓడిపోవడం, మొత్తం 9 మ్యాచ్‌లు ఆడటంతో రోహిత్‌ శర్మ కూడా సచిన్‌ రికార్డును కొట్టలేకపోయాడు. 9 మ్యాచ్‌ల్లో 81 యావరేజ్‌తో 648 పరుగులు చేసి.. సచిన్‌ రికార్డు బ్రేక్‌ చేయడానికి 25 రన్స్‌ దూరంలో ఆగిపోయాడు. 2019 వరల్డ్‌ కప్‌లో టీమిండియా ఫైనల్‌ చేరి ఉంటే.. రోహిత్‌ శర్మ సచిన్‌ రికార్డును బ్రేక్‌ చేసే వాడని ఇప్పటికీ చాలా మంది క్రికెట్‌ అభిమానులు భావిస్తుంటారు. అయితే.. ఇప్పుడు వరల్డ్‌ కప్‌ 2023 టోర్నీ ప్రారంభం కానున్న నేపథ్యంలో సచిన్‌ అత్యధిక పరుగుల రికార్డును బ్రేక్‌ చేసే క్రికెటర్‌ ఎవరా? అనే ప్రశ్న క్రికెట్‌ అభిమానుల మనసులో మొదలైంది. 2019లో చాలా దగ్గరగా వచ్చి.. మిస్‌ అయిన రోహిత్‌ శర్మ బ్రేక్ చేస్తాడని చాలా మంది భావిస్తున్నారు. మరి సచిన్‌ రికార్డును కొట్టే ఆటగాడు ఎవరని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ధోనిని కొట్టేవాడే లేడు! గంభీర్‌ నుంచి బిగ్‌ స్టేట్‌మెంట్‌

Show comments