iDreamPost
android-app
ios-app

కోట్లు పెట్టి కొన్న ఆటగాడు ముంచేసినా.. KKRను గెలిపించిన కుర్రాడు! ఎవరీ హర్షిత్‌ రానా?

  • Published Mar 24, 2024 | 11:25 AM Updated Updated Mar 24, 2024 | 11:26 AM

Harshit Rana, SRH vs KKR, IPL 2024: ఐపీఎల్‌ 2024లో భాగంగా సన్‌రైజర్స్‌ వర్సెస్‌ కోల్‌కత్తా మ్యాచ్లో ఓ కుర్రాడు సూపర్‌ బౌలింగ్‌తో స్టార్‌గా మారాడు. కోట్లు పెట్టి కొన్న ఆటగాడు విఫలమైనా.. అతను మాత్రం కేకేఆర్‌ను గెలిపించి హీరో అయ్యాడు. అతను ఎవరో ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Harshit Rana, SRH vs KKR, IPL 2024: ఐపీఎల్‌ 2024లో భాగంగా సన్‌రైజర్స్‌ వర్సెస్‌ కోల్‌కత్తా మ్యాచ్లో ఓ కుర్రాడు సూపర్‌ బౌలింగ్‌తో స్టార్‌గా మారాడు. కోట్లు పెట్టి కొన్న ఆటగాడు విఫలమైనా.. అతను మాత్రం కేకేఆర్‌ను గెలిపించి హీరో అయ్యాడు. అతను ఎవరో ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Mar 24, 2024 | 11:25 AMUpdated Mar 24, 2024 | 11:26 AM
కోట్లు పెట్టి కొన్న ఆటగాడు ముంచేసినా.. KKRను గెలిపించిన కుర్రాడు! ఎవరీ హర్షిత్‌ రానా?

ఆరంభమైన రెండో రోజే.. క్రికెట్‌ అభిమానులకు నరాలు తెగే ఉత్కంఠను ఇచ్చింది ఐపీఎల్‌ 17వ సీజన్‌. శనివారం రాత్రి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ చివరి బాల్‌ వరకు వెళ్లింది. చివరికి ఊహించని ట్విస్ట్‌తో విజయం కోల్‌కత్తా వశమైంది. ఈ మ్యాచ్‌లో కోల్‌కత్తా యువ బౌలర్‌ హర్షిత్‌ రానా ఒక్క ఓవర్‌తో ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిపోయాడు. అతని కంటే ముందు ఓవర్‌ వేసిన మిచెల్‌ స్టార్క్‌ ఏకంగా నాలుగు సిక్సులు సమర్పించుకుని.. 26 పరుగులు ఇచ్చాడు. చివరి ఓవర్‌లో డిఫెండ్‌ చేసుకోవడానికి కేకేఆర్‌ వద్ద కేవలం 13 పరుగులు మాత్రమే ఉన్నాయి. ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యారట్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ చిప్పులు చెరుగుతున్నాడు. కేవలం సిక్సులతోనే డీల్‌ చేస్తున్నాడు. అంతటి ఒత్తడిలో కేకేఆర్‌ విజయంపై ఎవరికీ ఎలాంటి ఆశలు లేవు. ఆ టైమ్‌లో చివరి ఓవర్‌ వేసేందుకు బాల్‌ అందుకున్న యువ బౌలర్‌ హర్షిత్‌ రానా అద్భుతం చేశాడు. తొలి బంతికే క్లాసెన్‌ సిక్స్‌ బాదినా.. ఆత్మవిశ్వాసం కోల్పోకుండా.. తర్వాత ఐదు బంతుల్లో కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చి.. ఓడిపోయాం అనుకున్న మ్యాచ్‌లో కోల్‌కోత్తాను గెలిపించాడు. దీంతో క్రికెట్‌ అభిమానులంతా.. ఎవరీ హర్షిత్‌ రానా అంటూ తెగ సెర్చ్‌ చేస్తున్నారు. అతని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

22 ఏళ్ల హర్షిత్‌ రానా ఢిల్లీకి చెందిన ఆటగాడు. 2001 డిసెంబర్‌ 22న జన్మించాడు. చిన్నతనం నుంచే క్రికెటర్‌ అవ్వాలని కలలు కని.. అందుకోసం ఎంతో శ్రమించాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ.. ఢిల్లీ స్టేట్‌ టీమ్‌కి సెలెక్ట్‌ అయ్యాడు. ఢిల్లీ తరపున సీనియర్ స్థాయిలో అరంగేట్రం చేయడానికి ముందు.. ఐపీఎల్‌ 2022 సీజన్‌లో కేకేఆర్‌ ఆటగాడు రసిఖ్ సలామ్‌ గాయపడటంతో అతనికి రీప్లేస్‌మెంట్‌గా కేకేఆర్‌ జట్టులో చేరాడు. ఆ సీజన్‌లో రానాకు ప్లేయింగ్‌ ఎలెవన్‌లో స్థానం దక్కలేదు. కానీ, 2023లో కొన్ని మ్యాచ్‌లు ఆడాడు. రానా తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌ను తన హోం టీమ్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌కు వ్యతిరేకంగా ఆడాడు. ఆ మ్యాచ్‌లో 24 పరుగులిచ్చి ఒక వికెట్‌ తీసుకున్నాడు. అంతకంటే ముందు 2022–23 విజయ్ హజారే ట్రోఫీ సమయంలో మేఘాలయాపై తన తొలి లిస్ట్‌ ఏ మ్యాచ్‌ ఆడాడు. 2022-23 రంజీ ట్రోఫీలో అస్సాంపై ఢిల్లీ తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు.

Starc vs harshit rana

ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన హర్షిత్‌ రానా 9 వికెట్లు పడగొట్టాడు. ఒక సారి 3 వికెట్ల హాల్‌ సాధించాడు. శనివారం ఎస్‌ఆర్‌హెచ్‌పై చేసిన ప్రదర్శనే అతని ఐపీఎల్‌ కెరీర్‌లో చేసిన అత్యుత్తమ ప్రదర్శన. అతని ఎకానమీ 8.88గా ఉంది. టీ20ల్లో ఈ ఎకానమీ పర్వాలేదు. అయితే.. ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్షిత్‌ రానా ఎందుకు హీరో అయ్యాడు అంటే.. సన్‌రైజర్స్‌ విజయానికి చివరి రెండు ఓవర్లలో 39 రన్స్‌ కావాలి. 12 బంతుల్లో 39 పరుగులు. ఈ టైమ్‌లో 19వ ఓవర్‌ వేసేందుకు ఆస్ట్రేలియా స్టార్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ బంతి అందుకున్నాడు. ఐపీఎల్‌ 2024 సీజన్‌ కోసం జరిగిన మినీ వేలంలో కేకేఆర్‌ అతన్ని ఏకంగా రూ.24.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఐపీఎల్‌ చరిత్రలోనే ఓ ఆటగాడికి దక్కిన అతి పెద్ద అమౌంట్‌ అది. దీంతో స్టార్క్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.

కానీ, ఆ ఓవర్‌లో స్టార్క్‌ పూర్తిగా తేలిపోయాడు. ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యారట్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ ఊచకోతతో 26 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ ఓవర్‌లో క్లాసెన్‌ మూడు సిక్సులతు, యువ క్రికెటర్‌ షాబాజ్‌ అహ్మద్‌ ఓ సిక్స్‌ బాదేశాడు. దాంతో ఎస్‌ఆర్‌హెచ్‌ విజయానికి చివరి ఆరు బంతుల్లో కేవలం 13 రన్స్‌ కావాలి. అప్పటికే కేవలం 12 బంతుల్లో 47 పరుగులు చేసిన ఆటగాళ్లు క్రీజ్‌లో ఉండటంతో.. ఎస్‌ఆర్‌హెచ్‌ విజయం ఖాయమని అంతా ఫిక్స్‌ అయ్యాడు. తీవ్ర ఒత్తిడిలో చివరి ఓవర్‌ వేసేందుకు వచ్చాడు హర్షిత్‌ రానా.. ఆ ఓవర్‌ తొలి బంతికే క్లాసెన్‌ భారీ సిక్స్‌ బాదేశాడు. ఇంకా 5 బాల్స్‌లో కేవలం 7 పరుగులు. ఈ టైమ్‌లో కేకేఆర్‌ గెలుస్తుందని.. కనీసం ఆ జట్టు సభ్యులు కూడా అనుకోని ఉండరు. కానీ, హర్షిత్‌ నమ్మకం కోల్పోలేదు. రెండో బంతికి సింగిల్‌ ఇచ్చాడు. మూడో బంతికి 4 బంతుల్లోనే 16 రన్స్‌ చేసిన షాబాజ్‌ అహ్మద్‌ను అవుట్‌ చేశాడు. నాలుగో బంతికి సింగిల్‌.

మళ్లీ క్లాసెన్‌ స్టైక్‌లోకి వచ్చాడు. రెండు బంతుల్లో 5 పరుగులు కావాలి. ఐదు బంతికి చాలా తెలివిగా స్లో బాల్‌ వేసి.. క్లాసెన్‌ను అవుట్‌ చేశాడు. అఫ్‌కోర్స్‌.. సుయాష్ శర్మ సూపర్‌ క్యాచ్‌ అందుకోవడంతో క్లాసెన్‌ వెనుదిరిగాడు. చివరి బాల్‌కి 5 పరుగులు కావాలి. సిక్స్‌ పోతే ఓటమి, ఫోర్‌ పోతే డ్రా.. ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ బ్యాటింగ్‌కి వచ్చాడు. అతను కూడా బాల్‌ను బౌండరీకి తరలించగల సమర్థుడే. అయినా కూడా హర్షిత్‌ రానా భయపడలేదు. ఏకంగా డాట్‌ బాల్ వేసి.. ఐపీఎల్‌ చరిత్రలో నిలిచిపోయే చివరి ఓవర్‌ వేశాడు. ఇంత అద్భుతం చేసిన ఈ ఆటగాడి ధరెంతో తెలుసా? కేవలం రూ.20 లక్షలు. బేస్‌ ప్రైజ్‌తోనే కేకేఆర్‌ అతన్ని దక్కించుకుంది. రూ.24.75 కోట్ల ఆటగాడు ఫెయిలైన చోటు.. ఓ 20 లక్షల ఆటగాడు కేకేఆర్‌కు విజయం అందించాడు. మరి ఇంతటి థ్రిల్లింగ్‌ విక్టరీని అందించిన హర్షిత్‌ రానాపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.