iDreamPost
android-app
ios-app

టీమిండియాపై సిరీస్‌ విజయం తర్వాత ఎమోషనలైన విండీస్‌ కెప్టెన్‌!

  • Published Aug 14, 2023 | 12:53 PM Updated Updated Aug 14, 2023 | 12:53 PM
  • Published Aug 14, 2023 | 12:53 PMUpdated Aug 14, 2023 | 12:53 PM
టీమిండియాపై సిరీస్‌ విజయం తర్వాత ఎమోషనలైన విండీస్‌ కెప్టెన్‌!

గతేడాది జరిగిన టీ20 వరల్డ్‌ కప్‌ 2022కు వెస్టిండీస్‌ కనీసం క్వాలిఫై కాలేదు. టీ20 ఫార్మాట్‌లో రెండు సార్లు వరల్డ్‌ ఛాంపియన్‌ అయిన విండీస్‌.. టోర్నీకి క్వాలిఫై కాకపోవడం సంచలంగా మారింది. ఆ ఘోర అవమానం నుంచి బయటపడకముందే.. ఈ ఏడాది అక్టోబర్‌లో భారత్‌ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌ కప్‌ 2023కు కూడా వెస్టిండీస్‌ క్వాలిఫై కాలేదు. వన్డే ఫార్మాట్‌లోనూ విండీస్‌ రెండు స్లారు వరుసగా విశ్వవిజేతగా నిలిచింది. అసలు ప్రపంచ క్రికెట్‌లో వన్డే వరల్డ్‌ కప్‌ ప్రవేశపెట్టిన తర్వాత వరసగా తొలి రెండు కప్పులు కొట్టింది కరేబియన్లే. అప్పట్లో క్రికెట్‌ ప్రపంచాన్ని వెస్టిండీస్‌ శాసించింది. వారితో మ్యాచ్‌ అంటే ఎంత తేడాతో ఓడతామో అని మిగతా జట్లు భావించేవి. వారి డామినేష్‌ ఆ రేంజ్‌లో ఉండేది. కానీ.. కాల క్రమంలో వెస్టిండీస్‌ ప్రతిష్టత మసకబారుతూ వచ్చింది. ఆటలో పసతగ్గి.. ఇప్పుడు ఓ పసికూన జట్టుగా మారుతోంది.

ఈ క్రమంలో టీమిండియా లాంటి బలమైన జట్టుపై ఐదు టీ20ల సిరీస్‌ నెగ్గడం.. ఆ జట్టుకు ఎంతో ఊరటనిచ్చే అంశం. పైగా టెస్ట్‌, వన్డే సిరీస్‌లో కోల్పోయిన తర్వాత.. టీ20 సిరీస్‌ గెలవడం వెస్టిండీస్‌కు చాలా గొప్ప విజయం. అందుకే ఈ సిరీస్‌ విక్టరీ తర్వాత ఆ జట్టు కెప్టెన్‌ రోవ్‌మన్‌ పావెల్‌ కాస్త ఎమోషనల్‌ అయ్యాడు. పోస్టు మ్యాచ్‌ సెర్మనీలో మాట్లాడుతూ.. ‘ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. మాకిది చాలా పెద్ద సిరీస్. ప్రస్తుతం మేమున్న పరిస్థితుల్లో ఇండియాను మా సొంత గడ్డపై ఓడించడం మాకు చాలా గొప్ప విషయం’ అని చెప్పాడు పావెల్‌. ‘అలాగే లాస్ట్ మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన తర్వాత టీమ్‌ అంతా కూర్చొని మాట్లాడుకున్నాం. కరేబియన్‌ ప్రజలు మనం గెలవాలని కోరుకుంటున్నారనే విషయాన్ని జట్టు సభ్యులకు వివరించే ప్రయత్నం చేశా.

ఇక తమ విజయంలో కోచింగ్ సిబ్బంది, చైర్మన్‌కు ఎక్కువ క్రెడిట్ దక్కుతుంది. రెండు వరుస ఓటముల తర్వాత చాలా నిరాశచెందాం.. కానీ వాళ్లు నన్ను కూర్చోపెట్టి చక్కగా మాట్లాడారు. ఇక మా టీమ్‌కు పూరన్‌ హీరో. అతను గొప్ప ఆటగాడు. ఐదు మ్యాచుల్లో మూడింట్లో బాగా ఆడాలని అతన్ని అడిగాం. అలాగే మా బౌలింగ్ యూనిట్‌ను కూడా మెచ్చుకోవాలి. బలమైన బ్యాటింగ్ ఉన్న టీమిండియాను వాళ్లు కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించారు. వీటన్నింటికీ మించి మా అభిమానుల నుంచి లభించిన మద్దతును కూడా మర్చిపోలేనిది. ఓడిపోయేలా ఉన్నా కూడా వాళ్లు మాపై నమ్మకం ఉంచి సపోర్ట్‌ చేశారు. సోషల్ మీడియాలో కూడా అండగా నిలబడ్డారు. ఇదంతా చూస్తుంటే క్రికెట్ ఎంత ప్రభావం చూపుతుందో అర్థమవుతోంది. అంటే మేం ఈ ఆటతో కరీబియన్ ప్రజలను సంతోషపెట్టొచ్చు అన్నమాట’ అని పావెల్ సిరీస్‌ గెలిచిన సంతోషాన్ని పంచుకున్నాడు. మరి పావెల్‌ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: సొంత జట్టు బ్యాట్స్​మన్ దెబ్బకు గాయాలపాలైన స్టార్ క్రికెటర్!