క్రీడా రంగంలో రికార్డులకు ఆయుష్షు తక్కువ అన్న సామెత ఎవరు చెప్పారో కానీ.. అన్నట్లుగానే ఏ రికార్డులు ఎక్కువ రోజులు ఉండటం లేదు. ఇక కొన్ని రికార్డులు అయితే.. నెలకొల్పిన గంటల వ్యవధిలోనే బద్దలైపోతున్నాయి. టీ20 టోర్నీలు వచ్చినప్పటి నుంచి గంటకో రికార్డు.. బ్రేక్ అవుతూనే ఉంది. తాజాగా శ్రీలంక స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగా సంచలన రికార్డును క్రియేట్ చేశాడు. ప్రస్తుతం వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచ్ లు జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఈ ఫీట్ ను సాధించాడు హసరంగా.. ఈ రికార్డుతో పాక్ దిగ్గజ బౌలర్ వకార్ యూనిస్ రికార్డును సమం చేశాడు హసరంగా.
వనిందు హసరంగా.. ప్రస్తుత క్రికెట్లో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్నాడు ఈ ప్లేయర్. గత కొంత కాలంగా నిలకడైన బౌలింగ్ తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపెడుతన్నాడు. తాజాగా జరుగుతున్న వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచ్ ల్లో అద్భుతమైన బౌలింగ్ తో దుమ్మురేపుతున్నాడు. దాంతో ఆడిన మూడు మ్యాచ్ ల్లో కూడా శ్రీలంక విజయం సాధించింది. తాజాగా ఐర్లాండ్ తో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్ లో 133 పరుగుల భారీ తేడాతో లంక విజయం సాధించింది.
ఇక ఈ మ్యాచ్ లో ఓ అరుదైన రికార్డును సమం చేశాడు లంక స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగా. వరుసగా మూడు మ్యాచ్ ల్లో ఐదు వికెట్లు తీసిన తొలి స్పిన్నర్ గా.. రెండో బౌలర్ గా రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో పాక్ దిగ్గజ బౌలర్ వకార్ యూనిస్ అగ్ర స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు ఈ రికార్డుతో హసరంగా అతడి సరసన చేరాడు. హసరంగా వరసగా.. 6/24, 5/13, 5/79 ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన లంక 49.5 ఓవర్లో 325 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జట్టులో ఓపెనర్ కరుణరత్నే(103) సెంచరీతో చెలరేగగా.. సమరవిక్రమ (82) పరుగులతో రాణించాడు.
అనంతరం 325 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ లంక బౌలర్ల ధాటికి అల్లాడిపోయింది. లంక స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగా స్పిన్ మాయాజాలానికి 31 ఓవర్లలో 192 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఒక దశలో 86 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఐర్లాండ్ జట్టును టెక్టర్ (33), కాంఫెర్ (39) పరుగులు చేసి ఆదుకునే ప్రయత్నం చేసినప్పటికీ గెలిపించలేకపోయారు. ఇక క్వాలిఫయర్ లో ఆడిన మూడు మ్యాచ్ ల్లో ఓడిపోయిన ఐర్లాండ్ ఇంటి ముఖం పట్టింది. శ్రీలంక ఆడిన మూడింటిలో మూడు గెలిచి గ్రూప్ లో అగ్రస్థానంలో ఉంది.