iDreamPost
android-app
ios-app

సెహ్వాగ్‌ను దాటేసిన కోహ్లీ! డేంజర్‌లో లక్ష్మణ్‌ రికార్డు

  • Published Jul 14, 2023 | 9:51 AM Updated Updated Jul 14, 2023 | 9:51 AM
  • Published Jul 14, 2023 | 9:51 AMUpdated Jul 14, 2023 | 9:51 AM
సెహ్వాగ్‌ను దాటేసిన కోహ్లీ! డేంజర్‌లో లక్ష్మణ్‌ రికార్డు

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ మంచి టచ్‌లో కనిపిస్తున్నాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో 36 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. టీమిండియా ఓపెనర్లు రోహిత్‌ శర్మ, యశస్వి జైస్వాల్‌ సెంచరీలతో చెలరేగడంతో భారత్‌ భారీ స్కోర్‌ దిశగా దూసుకెళ్తోంది. రోహిత్‌ 103 పరుగులు, గిల్‌ 6 పరుగులు చేసిన అవుటైనా.. ప్రస్తుతం క్రీజ్‌లో జైస్వాల్‌ 143 రన్స్‌తో, విరాట్‌ కోహ్లీ 36 పరుగులతో మూడో రోజు ఆట కొనసాగించేందుకు సిద్ధంగా ఉండటంతో టీమిండియా భారీ స్కోర్‌ సాధించడం ఖయంగా కనిపిస్తోంది. ఇప్పటికే వెస్టిండీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియ బౌలర్లు 150 పరుగులకే చుట్టేసిన విషయం తెలిసిందే. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 162 పరుగుల లీడ్‌లో ఉంది. మొత్తం మీద రెండు వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది.

ఈ మ్యాచ్‌లో కోహ్లీ 36 పరుగులు మాత్రమే చేసినా.. ఓ భారీ రికార్డును బద్దలుకొట్టాడు. టెస్ట్‌ క్రికెట్‌లో టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన జాబితాలో 5వ స్థానాన్ని ఆక్రమించాడు. ఆ స్థానంలో నిన్నటి వరకు దర్జాగా ఉన్నా వీరేంద్ర సెహ్వాగ్‌ 6వ స్థానానికి వెళ్లాల్సి వచ్చింది. 103 టెస్టుల్లో 8503 పరుగులతో వీవీఎస్‌ లక్ష్మణ్‌ తర్వాత 5వ స్థానంలో సెహ్వాగ్‌ ఉండగా.. వెస్టిండీస్‌పై 36 పరుగుల ఇన్నింగ్స్‌తో కోహ్లీ సెహ్వాగ్‌ను వెనక్కినెట్టేశాడు. ప్రస్తుతం 110వ టెస్ట్‌ ఆడుతున్న కోహ్లీ.. 8515 పరుగులతో ఉన్నాడు. సెహ్వాగ్‌ 23 సెంచరీలు చేస్తే, కోహ్లీ 28 సాధించాడు. కోహ్లీ 55.23 స్ట్రైక్‌ రేట్‌తో ఆడితే.. సెహ్వాగ్‌ అసాధ్యమైన 82.18 స్ట్రైక్‌ రేట్‌ కలిగి ఉన్నాడు. స్ట్రైక్‌ రేట్‌లో సెహ్వాగ్‌ను కోహ్లీ కొట్టేలేకపోయినా.. పరుగుల విషయంలో దాటేశాడు.

అయితే.. టెస్టుల్లో 7212 పరుగులు చేసి భారత్‌ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆరో ఆటగాడిగా కొనసాగిన టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీని కొన్ని నెలల క్రితం అదిగమించిన కోహ్లీ.. తాజాగా సెహ్వాగ్‌ను దాటేశాడు. నెక్ట్స్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ రికార్డు డేంజర్‌లో పడింది. లక్ష్మణ్‌ తన 20 ఏళ్ల టెస్ట్‌ కెరీర్‌లో 134 టెస్టులు ఆడి 8781 పరుగులు చేసి.. టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగుల చేసిన నాలుగో భారత బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. అతని నాలుగో స్థానాన్ని విరాట్‌ కోహ్లీ త్వరలోనే వీలైతే.. ఈ టెస్ట్‌ సిరీస్‌లోనే ఆక్రమించే అవకాశం ఉంది. లక్ష్మణ్‌కు కోహ్లీకి కేవలం 266 పరుగుల తేడా మాత్రమే ఉంది. ప్రస్తుతం విండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో 36 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు.

మూడో రోజు ఆటలో భారీ ఇన్నింగ్స్‌ ఆడితే.. లక్ష్మణ్‌కు కోహ్లీకి ఉన్న పరుగుల తేడా మరింత తగ్గిపోతుంది. ఈ మ్యాచ్‌లో బహుషా టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ ఆడకపోవచ్చు. కానీ, రెండో టెస్టు ఉంది. దాంతో ఈ సిరీస్‌లోనే కోహ్లీనే లక్ష్మణ్‌ను సైతం దాటేసే ఛాన్స్‌ స్పష్టంగా కనిపిస్తోంది. అయితే.. టీమిండియా తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌(15921 రన్స్‌) అగ్రస్థానంలో ఉన్నాడు. 13265 పరుగులతో రాహుల్‌ ద్రావిడ్‌ రెండో స్థానంలో, 10122 రన్స్‌తో లిటిల్‌ మాస్టర్‌ సునీల్‌ గవాస్కర్‌ మూడో స్థానంలో ఉన్నాడు. నాలుగో స్థానంలో 8781 రన్స్‌తో లక్ష్మణ్‌, ఐదో స్థానంలో ప్రస్తుతం కోహ్లీ ఉన్నాడు. మరి సీనియర్లను దాటుకుంటూ వెళ్తున్న కోహ్లీ.. ఆటకు వీడ్కోలు పలికే సమయానికి ఏ స్థానంలో ఉంటాడో మీ అభిప్రాయాలను, అంచనాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: సెంచరీలో కదం తొక్కిన భారత ఓపెనర్లు! రికార్డులు నమోదు చేసిన జైస్వాల్‌