ఇండియా-ఆసీస్ మ్యాచ్ ఫ్యాన్స్ కు అసలైన క్రికెట్ మజాను చూపింది. బౌలర్లకు అనుకూలిస్తున్న పిచ్ పై టీమిండియా బ్యాటర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టారు. వరల్డ్ కప్ లో ఆడిన తొలి మ్యాచ్ లోనే టీమిండియా బౌలర్లు సత్తా చాటారు. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కు పేరుగాంచిన ఆసీస్ ను కేవలం 199 పరుగులకే ఆలౌట్ చేసి ఔరా అనిపించారు. కానీ 200 పరుగుల ఛేజింగ్ అంత ఈజీకాదని తెలియడానికి టీమిండియాకు ఎంతో టైమ్ పట్టలేదు. కేవలం 12 బంతుల్లోనే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది భారత జట్టు. అప్పుడొచ్చాడు క్రీజ్ లోకి రన్ మెషిన్, ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ. ఈ మ్యాచ్ లో 85 పరుగులు చేసి, కేఎల్ రాహుల్ తో కలిసి టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. అయితే కోహ్లీ ఇలా కష్టాల్లో ఉన్న జట్టును గెలిపించడం ఇదే తొలిసారి కాదు. చాలానే ఉన్నాయి. ఆ మ్యాచ్ లు ఏవో ఇప్పుడు చూద్దాం.
విరాట్ కోహ్లీ.. టీమిండియా రన్ మెషిన్, ఛేజ్ మాస్టర్, రికార్డుల రారాజు.. అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. అందుకు తగ్గట్లుగానే బ్యాటింగ్ లో చిచ్చరపిడుగులా చెలరేగడం విరాట్ కు వెన్నతో పెట్టిన విద్య. ఇక ఆసీస్ తో జరిగిన మ్యాచ్ లో అయితే విరాట్ తన శైలికి విరుద్దంగా.. పరిస్థితులను బట్టి ఈ మ్యాచ్ లో ఆడాడు. 116 బంతులు ఎదుర్కొన్న విరాట్ 6 ఫోర్లతో 85 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. 2/3 స్థితిలో ఉన్న టీమిండియా విజయం సాధించిందటే దానికి కారణం కోహ్లీ-రాహుల్ లే. అయితే ఇలాంటి మ్యాచ్ లు విరాట్ గెలిపించడం ఇదే మెుదటిసారి కాదు. గతంలో ఇలాంటి క్లిష్టమైన మ్యాచ్ లను విరాట్ ఒంటిచేత్తో గెలిపించాడు. మరి ఆ బెస్ట్ 6 మ్యాచ్ లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
అది 2012 ఆసియా కప్.. దాయాది దేశమైన పాకిస్థాన్ తో మ్యాచ్. ఈ మ్యాచ్ లో పాక్ 329 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గౌతమ్ గంభీర్(0) రెండో బంతికే అవుట్ అయ్యాడు. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన విరాట్ 148 బంతుల్లో 22 ఫోర్లు, ఓ సిక్స్ తో 183 పరుగులు చేసి జట్టుకు మరచిపోలేని విజయాన్ని అందించాడు. ఆ తర్వాత 2014 టీ20 వరల్డ్ కప్ లో సౌతాఫ్రికా పై 72 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. ఇక ఆసియా కప్ 2016లో పాక్ పై చేసింది 49 పరుగులే అయినా ఈ ఇన్నింగ్స్ కోహ్లీ ఆడిన బెస్ట్ ఇన్నింగ్స్ లో ఒకటని చెప్పాలి. కేవలం 8 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న టీమ్ కు విజయాన్ని అందించాడు కోహ్లీ.
ఇక ఇదే సంవత్సరం టీ20 వరల్డ్ కప్ లో ఆసీస్ పై 82 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 50 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజ్ లోకి వచ్చి చెలరేగాడు విరాట్. ఇక విరాట్ ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్ లలో పాక్ పై చేసిన 82* పరుగుల ఇన్నింగ్స్ హైలెట్ అని చెప్పాలి. 2022 టీ20 వరల్డ్ కప్ లో 45 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి టీమిండియా పరాజయానికి దగ్గరగా వెళ్తోంది. ఈ సమయంలో అనూహ్యంగా చెలరేగిన విరాట్ పాక్ బౌలర్లను ఊచకోతకోస్తూ.. 82 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు మరచిపోలేని విజయాన్ని అందించాడు. తాజాగా ఆసీస్ తో మ్యాచ్ లో కూడా విలువైన పరుగులు చేసి వరల్డ్ కప్ లో జట్టుకు తొలి విజయాన్ని కట్టబెట్టాడు. మరి విరాట్ కోహ్లీ బెస్ట్ ఇన్నింగ్స్ లో మీకేది ఇష్టమో కామెంట్స్ లో తెలియజేయండి.