ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌కు గొప్ప ముగింపు లభించింది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఈ సిరీస్ మరోమారి అభిమానులను ఫుల్‌గా ఎంటర్టైన్ చేసింది. ఈ సిరీస్‌లో కొన్ని సందర్భాల్లో అయితే ప్రేక్షకులు మునివేళ్లపై నిల్చొని మ్యాచ్‌ను చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గెలుపు కోసం ఇరు జట్ల ఆటగాళ్లు ఢీ అంటే ఢీ అనడంతో టీ20 క్రికెట్‌ను మించిన ఉత్కంఠతో సిరీస్ సాగింది. ఆఖరిదైన ఐదో టెస్టులో ఆసీస్‌పై 49 రన్స్ తేడాతో నెగ్గింది ఇంగ్లండ్. దీంతో ఇరు టీమ్స్ సిరీస్‌ను 2-2తో సమంగా పంచుకున్నాయి. ఐదో టెస్టు ఆఖరి రోజు గెలుపు కోసం రెండు జట్లు భీకర పోరాటాన్ని సాగించాయి. అయితే చివరికి విజయం ఇంగ్లీష్ టీమ్ సొంతమైంది.
యాషెస్ చివరి టెస్టు తర్వాత ఇద్దరు ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించారు. అందులో ఒకరు దిగ్గజ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ కాగా.. మరొకరు స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ. ఇకపోతే, యాషెస్ చివరి టెస్టులో ఎన్నో పాత రికార్డులు బద్దలయ్యాయి. ఈ టెస్టులో ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా కూడా ఓ అరుదైన ఘనతను సాధించాడు. యాషెస్‌లో అద్భుతంగా రాణించిన ఈ బ్యాటర్.. ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలతో కలుపుకొని ఓవరాల్‌గా 496 రన్స్‌తో మెరిశాడు. ఈ క్రమంలో యాషెస్ హిస్టరీలో అరుదైన ఘనత సాధించిన ఓపెనర్ల జాబితాలో ఖవాజా చేరిపోయాడు.
యాషెస్ చరిత్రలో అత్యధిక రన్స్ చేసిన ఆస్ట్రేలియా ఓపెనర్ల లిస్టులో రెండో స్థానంలో నిలిచాడు 36 ఏళ్ల ఖవాజా. అతడి కంటే ముందు 1997లో కంగారూ మాజీ ఓపెనర్ మాథ్యూ ఇలియట్ యాషెస్ సిరీస్‌లో మొత్తంగా 556 రన్స్ చేశాడు. అతడి కెరీర్లో సాధించిన మొత్తం రన్స్‌లో సగానికి పైగా యాషెస్‌లోనే స్కోర్ చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో దాదాపు 26 ఏళ్ల తర్వాత ఉస్మాన్ ఖవాజా 496 రన్స్ చేసి మాథ్యూ తర్వాతి ప్లేస్‌ను ఆక్రమించాడు. 1997 అనంతరం యాషెస్‌లో అత్యధిక రన్స్ చేసిన ఆసీస్ ఓపెనర్‌గా నిలిచాడు. మొత్తానికి తన అద్భుతమైన బ్యాటింగ్‌తో కంగారూ టీమ్ ఫ్యాన్స్‌తో పాటు క్రికెట్ అభిమానుల మనసులను దోచుకున్నాడు ఖవాజా.