iDreamPost
android-app
ios-app

అక్తర్ కన్నా వేగంగా బౌలింగ్ చేసే.. డేవిడ్ జాన్సన్‌ని తొక్కేసింది ఎవరంటే?

  • Published Jul 22, 2024 | 2:19 PM Updated Updated Jul 23, 2024 | 2:52 PM

David Johnson, Karnataka, Team India: అతను బాల్‌ వేస్తే.. చాలా మంది బ్యాటర్లకు కనిపించేంది కాదు. గన్‌ నుంచి బుల్లెట్‌ దూసుకొచ్చినట్లు.. అతని చేతి నుంచి బంతి దూసుకొచ్చేది. కానీ, అలాంటి బౌలర్.. చివరికి ఒక అనామకుడిలా ఆత్మహత్య చేసుకున్నాడు. అతని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

David Johnson, Karnataka, Team India: అతను బాల్‌ వేస్తే.. చాలా మంది బ్యాటర్లకు కనిపించేంది కాదు. గన్‌ నుంచి బుల్లెట్‌ దూసుకొచ్చినట్లు.. అతని చేతి నుంచి బంతి దూసుకొచ్చేది. కానీ, అలాంటి బౌలర్.. చివరికి ఒక అనామకుడిలా ఆత్మహత్య చేసుకున్నాడు. అతని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

  • Published Jul 22, 2024 | 2:19 PMUpdated Jul 23, 2024 | 2:52 PM
అక్తర్ కన్నా వేగంగా బౌలింగ్ చేసే.. డేవిడ్ జాన్సన్‌ని తొక్కేసింది ఎవరంటే?

ఇప్పుడంటే అంతర్జాతీయ క్రికెట్‌లో గొప్ప గొప్ప పేస్‌ బౌలర్ల లిస్ట్‌లో భారత ఆటగాళ్ల పేర్లు వినిపిస్తున్నాయి కానీ.. ఒకప్పుడు పేస్‌ బౌలింగ్‌ అంటే వెస్టిండీస్‌, పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా క్రికెటర్ల పేరు మాత్రమే వినిపించేవి, కనిపించేవి. 90వ దశకంలో టీమిండియాలోనూ స్పీడ్‌ బౌలర్లు ​ఉన్నా.. వాళ్ల పేస్‌ ప్రత్యర్థులను భయపెట్టేంత ఉండేది కాదు. మీడియం పేస్‌ బౌలర్లు ఉండేవాళ్లు భారత జట్టులో. బ్యాటింగ్‌, స్పిన్‌ విభాగంలో టీమిండియా ఎంతో బలంగా ఉండి పేస్‌ బౌలింగ్‌లో వీక్‌గా ఉన్న సమయంలో.. ఓ కర్ణాటక కుర్రాడు నిప్పులు చిమ్మేవేగంతో బంతులేస్తూ.. దేశవాళి క్రికెట్‌లో దుమ్ములేపుతున్నాడు. గంట​కు 157.8 కిలో మీటర్ల వేగం.. అప్పటి వరకు ఇండియన్‌ క్రికెట్‌లో ఎవరు కనీవినీ ఎరుగని స్పీడ్‌ అది. అంతటి స్పీడ్‌తో బౌలింగ్‌ వేస్తున్న కుర్రాడిని టీమిండియాలోకి తీసుకొని.. సరైన అవకాశాలు ఇచ్చి ఉంటే.. ఇప్పుడు ప్రపంచంలోనే గొప్ప గొప్ప బౌలర్ల జాబితాలో అతని పేరు ముందు వరుసలో ఉండేది. కానీ, బీసీసీఐ చేసిన తప్పు.. ఇండియాకు ఒక గొప్ప బౌలర్‌ను దూరం చేసింది. అక్తర్‌, బ్రెట్‌ లీని మించిపోవాల్సిన అతన్ని ఒక అనాథలా ఆత్మహత్య చేసుకునేలా చేసింది. ఆ బౌలర్‌ ఎవరో కాదు.. భారత దేశవాళి క్రికెట్‌లో బుల్లెట్‌ లాంటి బంతులేసి.. వికెట్లను గాల్లోకి లేపిన డేవిడ్‌ జాన్సన్‌. అవకాశాలు దక్కని ఈ హీరో లైఫ్‌ స్టోరీ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

డేవిడ్ జాన్సన్.. 1971 అక్టోబర్ 16న కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లా అర్సికెరెలో జన్మించాడు. క్రికెట్‌పై ఉన్న పిచ్చి ఇష్టంతో.. గొప్ప ఫాస్ట్‌ బౌలర్‌ కావాలని కలగంటూ క్రికెట్‌ నేర్చుకున్నాడు. అద్భుతమైన స్పీడ్‌బౌలింగ్‌తో అంతే వేగంగా దేశవాళి క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. కర్ణాటక స్టేట్‌ టీమ్‌ తరఫున 1992లో దేశవాళి క్రికెట్‌లో అడుగుపెట్టాడు. తన డొమెస్టిక్‌ కెరీర్‌లో మొత్తం 39 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన జాన్సన్‌ ఏకంగా 125 వికెట్లు పడగొట్టాడు. 28.63 యావరేజ్‌, 3.61 ఎకానమీతో అప్పట్లో దేశవాళి క్రికెట్‌లో ఒక సంచలనం సృష్టించాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 8 సార్లు ఐదు వికెట్ల హాల్‌, ఒకసారి పది వికెట్ల హాల్‌ కూడా సాధించాడు. అలాగే 33 లిస్ట్‌-ఏ మ్యాచ్‌లు ఆడి 41 వికెట్లు పడగొట్టాడు. దేశవాళి క్రికెట్‌లో ఆడటం ప్రారంభించిన నాలుగేళ్లకే అంటే 1996లోనే అతనికి టీమిండియా నుంచి పిలుపొచ్చింది.

ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరిగే ప్రతిష్టాత్మక బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ ప్రారంభ ఏడాది 1996 అక్టోబర్‌ 10న ఢిల్లీలోని అప్పటి ఫిరోజ్‌ షా కోట్లా మైదానం వేదికగా ఆసీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌తో డేవిడ్‌ జాన్సన్‌ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. సచిన్‌ టెండూల్కర్‌ కెప్టెన్సీలో ఆడింది టీమిండియా. ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ సందర్భంగా డేవిడ్‌ జాన్సన్‌కు కేవలం నాలుగంటే నాలుగు ఓవర్లు మాత్రమే బౌలింగ్‌ ఇచ్చారు. 4 ఓవర్లలో అతను 12 పరుగులు మాత్రమే ఇచ్చాడు. రెండో ఇన్నింగ్స్‌లో 12 ఓవర్లు వేసి ఒక వికెట్‌ తీశాడు. ఆ మ్యాచ్‌లో టీమిండియానే విజయం సాధించింది. అయితే.. స్పీడ్‌ బౌలింగ్‌ను ఆడటం బాగా అలవాటు ఉన్న ఆసీస్‌ బ్యాటర్లు డేవిడ్‌ బౌలింగ్‌ను సమర్థవంతంగానే ఎదుర్కొన్నారు. పైగా తొలి మ్యాచ్‌లో 16 ఓవర్లలు వేసి 52 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్‌ తీసుకున్నాడంటే మెచ్చుకోవాల్సిన విషయమే.

David jhonson indian bowler life story

ఆ తర్వాత డేవిడ్‌ జాన్సన్‌ను సౌతాఫ్రికా పర్యటన కోసం ఎంపిక చేశారు. 1996 డిసెంబర్‌ 26న డర్బన్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లు వేసి 52 పరుగుల మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో వికెట్లు ఏమీ దక్కలేదు. మొత్తంగా 2 టెస్టుల తర్వాత.. డేవిడ్‌ 3 వికెట్లు పడగొట్టాడు. అంతే.. అక్కడితో అతనికి కెరీర్‌కు పుల్‌స్టాప్‌ పెట్టేసింది బీసీసీఐ. అంతర్జాతీయ క్రికెట్‌లో నంబర్‌ వన్‌ టీమ్‌గా ఎదగాలంటే పేస్‌ బౌలింగ్‌పై దృష్టి పెట్టాల్సిన విషయాన్ని మర్చిపోయి.. జట్టు పేస్‌ బౌలింగ్‌లో చాలా వీక్‌గా ఉన్న సమయంలో.. గంటకు 158 కిలో మీటర్ల వేగంతో బంతులేసే బ్రహ్మాస్త్రంలాంటి పేసర్‌ కేవలం రెండంటే రెండే మ్యాచ్‌ల అవకాశం ఇచ్చింది బీసీసీఐ. భీకరమైన పేస్‌ ఉన్న బౌలర్‌ కాస్త లైన్‌ అండ్‌ లెంత్‌ను పట్టుకోవడానికి కాస్త టైమ్‌ పడుతుంది. అందుకోసం అతనికి కనీసం.. 10, 15 టెస్టులన్న అవకాశం ఇవ్వాల్సింది, కనీసం వన్డేలు మ్యాచ్‌లు అయినా ఆడించాల్సింది. అది కూడా చేయకుండా కేవలం 2 టెస్టుల తర్వాత.. డేవిడ్‌ జాన్సన్‌ను పక్కనపెట్టేసింది. కేవలం నాలుగు నెలల్లోనే ఓ అద్భుతమైన బౌలర్‌ అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలికింది.

గొప్ప క్రికెటర్లుగా పేరు తెచ్చుకున్న మహేంద్ర సింగ్‌ ధోని, యువరాజ్‌ సింగ్‌, వీరేందర్‌ సెహ్వాగ్‌, రోహిత్‌ శర్మ లాంటి ఆటగాళ్లు కూడా కెరీర్‌ ఆరంభంలో ఇబ్బంది పడిన వారే. కానీ, వారిలోని టాలెంట్‌ను గుర్తించి.. ధోని, యువీ, సెహ్వాగ్‌ లాంటి వాళ్లకు అప్పటి కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ అవకాశాలు ఇవ్వడంతోనే ఈ రోజు టీమిండియాకు అంత మంది ప్లేయర్లు దక్కారు. లేదంటే.. వాళ్లు కూడా డేవిడ్‌ జాన్సన్‌లా మరుగునపడిపోయేవారే. అప్పుడు టీమిండియా మరో జింబాబ్వే, శ్రీలంక అయిపోయేది. ధోని తన తొలి మ్యాచ్‌లో డకౌట్‌ అయ్యాడు.. తర్వాతి మ్యాచ్‌లో కూడా పెద్దగా రాణించలేదు. అయినా కూడా దాదా అతనిపై నమ్మకం పెట్టి అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత అతను దేశానికి మూడు ఐసీసీ ట్రోఫీలు అందించే కెప్టెన్‌గా ఎదిగాడు. టాలెంట్‌ను గుర్తించడం కూడా దేశానికి ఒకరకంగా సేవచేయడమే అవుతుంది. ధోనికి గంగూలీ అండగా నిలబడినట్లు.. డేవిడ్‌ జాన్సన్‌ కోసం ఎవరైనా నిలబడి ఉంటే.. కథ ఇంకోలా ఉండేది.

అయితే అప్పట్లే భారత క్రికెట్‌ జట్టు సెలక్షన్‌ విషయంలో కూడా రాజకీయాలు చాలా జరిగేవని ఆరోపణలు ఉన్నాయి. ఒక్క స్టేట్‌ నుంచి ఇంత మందిని మాత్రమే తీసుకోవాలి.. అప్పటికే పేరొందిన స్టేట్‌ క్రికెట్‌ బోర్డులు అయినా ముంబై, కర్ణాటక, కోల్‌కత్తా, బరోడా, తమిళనాడు, ఢిల్లీ నుంచి కచ్చితం ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనే అర్థం లేని సమీకరణాలు ఉండేవి. డేవిడ్‌ జాన్సన్‌ దురదృష్టం కొద్ది.. అప్పటికే రాహుల్‌ ద్రవిడ్‌, అనిల్‌ కుంబ్లే, జవగళ్‌ శ్రీనాథ్‌, వెంకటేశ్‌ ప్రసాద్‌ లాంటి క్రికెటర్లు టీమిండియాలో పాతుకుపోయి ఉన్నారు. ఇలా ఒక్క కర్ణాటక నుంచే ఐదుగురు ప్లేయర్లు ఉంటే.. వేరే స్టేట్‌ క్రికెట్‌ బోర్డ్స్‌ నుంచి విమర్శలు వస్తాయని భారత క్రికెట్‌ బోర్డు డేవిడ్‌ జాన్సన్‌ను పట్టించుకోలేదు. ఆ తర్వాత.. దేశవాళి క్రికెట్‌లో 2001 వరకు ఆడిన జాన్సన్‌.. 2024 జూన్‌ 20న బెంగళూరులోని ఓ అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు ఏమిటో ఇంకా తెలియలేదు. అయితే.. డిప్రెషన్‌ కారణంగానే ఆయన సూసైడ్‌ చేసుకొని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒక్కటి మాత్రం నిజం.. సరైన అవకాశాలు ఇవ్వకపోవడంతో.. దేశం ఒక గొప్ప బౌలర్‌ను కోల్పోయింది.