iDreamPost
android-app
ios-app

బ్యాటింగ్‌కు వెళ్లిన చాహల్‌ను వెనక్కి పిలిపించిన హార్దిక్‌ పాండ్యా! కానీ..

  • Published Aug 04, 2023 | 3:28 PM Updated Updated Aug 04, 2023 | 3:28 PM
  • Published Aug 04, 2023 | 3:28 PMUpdated Aug 04, 2023 | 3:28 PM
బ్యాటింగ్‌కు వెళ్లిన చాహల్‌ను వెనక్కి పిలిపించిన హార్దిక్‌ పాండ్యా! కానీ..

భారత్‌-వెస్టిండీస్‌ మధ్య తొలి టీ20లో టీమిండియా ఓటమి పాలైంది. వెస్టిండీస్‌ నిర్దేశించిన 150 పరుగుల టార్గెట్‌కు 5 పరుగుల దూరంలో నిలిచిపోయింది హార్దిక్‌ సేన. మిస్టర్‌ 360 సూర్యకుమార్‌ యాదవ్‌(21), తెలుగు కుర్రాడు తిలక్‌ వర్మ(39) పరుగులతో పర్వాలేదనిపించారు. వాళ్లిద్దరూ ఉన్నంత వరకు గెలుపు టీమిండియా వైపే ఉంది. కానీ, వారిద్దరూ వెంటవెంటనే అవుట్‌ అవ్వడంతో పాటు మిగతా బ్యాటర్లు విఫలం అవ్వడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా, సంజు శాంసన్‌, అక్షర్‌ పటేల్‌ విఫలం అయ్యారు. అయితే.. టీమిండియా ఇన్నింగ్స్‌ చివర్లో ఒక గందరగోళం చోటు చేసుకుంది. ఈ గొడవలో పాపం చాహల్‌ అటూ ఇటూ పరిగెడుతూ నలిగిపోయారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

టీమిండియా విజయానికి చివరి 5 బంతుల్లో 10 పరుగులు కావాల్సిన సమయంలో టీమిండియా 8వ వికెట్‌ రూపంలో కుల్దీప్‌ యాదవ్‌ అవుట్‌ అయ్యాడు. దీంతో తర్వాత బ్యాటింగ్‌ కోసం యుజ్వేంద్ర చాహల్‌ క్రీజ్‌లోకి వచ్చాడు. అతను అలా క్రీజ్‌ వద్దకు చేరుకున్నాడో లేదో.. డ్రెస్సింగ్‌ రూమ్‌ నుంచి చాహల్‌కు పిలుపు వచ్చింది. వెనక్కి వచ్చేయాలని.. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా, హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్‌.. పిలుపు మేరకు చాహల్‌ క్రీజ్‌ నుంచి బయటికి పరుగు తీశాడు.. అతను బౌండరీ లైన్‌ దాటాడో లేదో.. వెంటనే అంపైర్ల నుంచి చాహల్‌కు పిలుపొచ్చింది. బ్యాటింగ్‌ చేయాడానికి రావాలని.. మళ్లీ చాహల్‌ క్రీజ్‌లో పరుగు తీశాడు.

అయితే ఇదంతా ఎందుకు జరిగిందంటే.. చివరి ఓవర్‌లో ఐదు బంతుల్లో 10 పరుగులు కావాల్సిన దశలో చాహల్‌ బదులు 10వ స్థానంలో ముఖేష్‌ కుమార్‌ బ్యాటింగ్‌కు వెళ్తే.. అతను కాస్త హైట్‌ ఉంటాడు కాబట్టి విండీస్‌ బౌలర్లను ఎదుర్కొని ఒకటీ రెండు భారీ షాట్లు ఆడే అవకాశం ఉందని, డ్రెస్సింగ్‌ రూమ్‌లో కోచ్‌ ద్రావిడ్‌, కెప్టెన్‌ పాండ్యా చర్చించుకుంటున్నారు. ఇంతలో తన బ్యాటింగ్‌ స్థానంలో చాహల్‌ క్రీజ్‌లోకి వెళ్లిపోయాడు. దీంతో అలా వెళ్లిన చాహల్‌ను కెప్టెన్‌ పాండ్యా వెనక్కిపిలిపించాడు. కానీ, అంపైర్‌ మాత్రం అలా బయటికి వెళ్లడం కుదరదు అని, ఒక్కసారి బ్యాటింగ్‌ కోసం క్రీజ్‌లోకి వచ్చిన ఆటగాడు మళ్లీ వెళ్లొద్దని, రూల్స్‌ ఒప్పుకోవని మళ్లీ చాహల్‌ను బ్యాటింగ్‌ చేయడానికి పిలిపించారు. అయితే చాహల్‌ వెనక్కి వస్తున్న సయమంలో ముఖేష్‌ కుమార్‌ సైతం ప్యాడ్‌అప్‌ అయి రెడీగా ఉండటం గమనార్హం. ఈ సంఘటనతో గ్రౌండ్‌లో కొంత గందరగోళం నెలకొంది. కానీ, చివరి టీమిండియా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 145 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. మరి మ్యాచ్‌లో జరిగిన ఈ ఫన్నీ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వీడియో: అద్భుతమైన క్యాచ్ తో ఆకట్టుకున్న తిలక్ వర్మ!