iDreamPost
android-app
ios-app

TNPL 2023: క్రికెట్ చరిత్రలో విచిత్రం.. ఒకే బాల్ కు రెండు సార్లు రివ్యూ! అశ్విన్ వినూత్న నిర్ణయం

  • Author Soma Sekhar Published - 12:24 PM, Thu - 15 June 23
  • Author Soma Sekhar Published - 12:24 PM, Thu - 15 June 23
TNPL 2023: క్రికెట్ చరిత్రలో విచిత్రం.. ఒకే బాల్ కు రెండు సార్లు రివ్యూ! అశ్విన్ వినూత్న నిర్ణయం

క్రికెట్ లో అప్పుడప్పుడు జరిగే సంఘటనలు చూస్తే మతిపోతుంటుంది. ఇలాంటి మతిపోయే సంఘటన ఒకటి తమిళనాడు ప్రీమియర్ లీగ్ (TNPL 2023)లో చోటుచేసుకుంది. తాజాగా ఈ లీగ్ తొలి మ్యాచ్ లోనే ఒకే ఒక్క బంతికి 18 పరుగులు సమర్పించుకున్నాడు ఓ బౌలర్. ఈ సంఘటన మర్చిపోకముందే.. మరో విచిత్రమైన సంఘటన లీగ్ లో చోటుచేసుంది. ఇక తమిళనాడు లీగ్ లో పాల్గొంటున్న టీమిండియా స్టార్ క్రికెటర్ ఈ అనూహ్య సంఘటనకు వేదికగా మారాడు. ఒకే బాల్ కు రెండు సార్లు రివ్యూ తీసుకోవడం ఈ మ్యాచ్ లో ఆశ్చర్యం కలిగించింది.

తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో భాగంగా తాజగా దుండిగల్ డ్రాగన్స్-బాల్సే త్రిచీ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇక ఈ సీజన్ లోనే తొలిసారి రివ్యూ (DRS)సిస్టం అమల్లోకి తీసుకొచ్చారు. ఇక దుండిగల్ టీమ్ తరపున బరిలోకి దిగాడు అశ్విన్. కాగా ఈ మ్యాచ్ లో ఓ అరుదైన, విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది.రివ్యూ పైనే రివ్యూ తీసుకున్నాడు రవిచంద్రన్ అశ్విన్. వివరాల్లోకి వెళితే..

త్రిచీ జట్టు బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో ఇన్నింగ్స్ 13వ ఓవర్ వేయడానికి వచ్చాడు అశ్విన్. ఈ ఓవర్ లో 5వ బంతిని భారీ షాట్ కు ప్రయత్నించాడు త్రిచీ బ్యాటర్ రాజ్ కుమార్. బంతి మిస్ అయ్యి కీపర్ చేతుల్లో పడింది. అయితే బంతి బ్యాట్ కు తాకిందని భావించిన అశ్విన్ అప్పీల్ చేశాడు. దాంతో వెంటనే ఫీల్డ్ అంపైర్ ఔట్ గా ప్రకటించాడు. ఇక ఈ నిర్ణయంపై రివ్యూకు వెళ్లాడు బ్యాటర్. రివ్యూను చూసిన థర్డ్ అంపైర్ నాటౌట్ గా ప్రకటించాడు. వెంటనే అశ్విన్ మరోసారి రివ్యూ కోరాడు. దాంతో రివ్యూ పైనే రివ్యూ కోరిన ఆటగాడిగా అశ్విన్ చరిత్రలోకి ఎక్కాడు. కాగా అశ్విన్ కోరిన రివ్యూలో సైతం బ్యాటర్ ను నాటౌట్ గా ప్రకటించాడు. దాంతో అశ్విన్ అసహనానికి గురైయ్యాడు. దీనికి సంబంధించిన వీడియోను ఫ్యాన్ కోడ్ తన ట్విట్టర్ లో షేర్ చేసింది.

ఇక తన నిర్ణయంపై అశ్విన్ స్పందిస్తూ..”బ్యాట్ ను బాల్ దాటేప్పుడు స్పైక్స్ కనిపించాయి. ఇక థర్డ్ అంపైర్ సరిగా చూడలేదేమో అని మరోసారి రివ్యూకు మోగ్గు చూపాను. పైగా ఈ టోర్నీకి డీఆర్ఎస్ కొత్తగా అమల్లోకి వచ్చింది” అంటూ మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు. ఇక ఈ మ్యాచ్ లో దుండిగల్ డ్రాగన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రత్యర్థి నిర్దేశించిన 121 పరుగులను 14.5 ఓవర్లలోనే ఛేదించింది.