సౌతాఫ్రికాపై ఫైనల్‌లో టీమిండియా గెలిచిందంటే.. ఆ నలుగురి వల్లే! ప్రాణం పెట్టి ఆడారు..

T20 World Cup 2024, Final, IND vs SA: టీ20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో టీమిండియా గెలిచిందంటే ఓ నలుగురు ఆటగాళ్ల వల్లే. మరి ఆ నలుగురు ఎవరు? వాళ్లు ఏం చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం..

T20 World Cup 2024, Final, IND vs SA: టీ20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో టీమిండియా గెలిచిందంటే ఓ నలుగురు ఆటగాళ్ల వల్లే. మరి ఆ నలుగురు ఎవరు? వాళ్లు ఏం చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం..

వంద కోట్ల మందికి పైగా భారత క్రికెట్‌ అభిమానుల కల నిజమైంది. రోహిత్‌ శర్మ వరల్డ్‌ కప్‌ను ఎత్తాడు. శనివారం బార్బోడోస్‌ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన టీ20 వరల్డ్‌ కప్‌ 2024 ఫైనల్‌ మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. చివరి 5 ఓవర్లు మిగిలిన ఉన్న సమయంలో నిజానికి మ్యాచ్‌ టీమిండియా చేతుల్లో లేదు. సౌతాఫ్రికాకు విజయం లాంఛనే అనే రీతిలో ఉంది. ఎందుకంటే 30 బంతుల్లో 30 పరుగులు చేయాలి.. చేతిలో కావాల్సినన్ని వికెట్లు ఉన్నాయి. అయినా కూడా టీమిండియా ఎంతో అద్భుతంగా పోరాటి.. ప్రత్యర్థి కోరల్లో చిక్కుకున్న మ్యాచ్‌ను దవడలు చీల్చి మరీ వెనక్కి లాక్కుంది. అయితే.. ఈ ఫైనల్‌లో విజయం జట్టు సమిష్టి కృషి అయినా.. ఓ నలుగురు ఆటగాళ్లుకు కాస్త ఎక్కువ క్రెడిట్‌ ఇవ్వాలిందే.. ఈ విజయానికి వాళ్లే హీరోలు.

విరాట్‌ కోహ్లీ..
టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. పిచ్‌ బ్యాటింగ్‌ను అనుకూలంగా ఉండటంతో తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుని కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మంచి నిర్ణయమే తీసుకున్నాడని అంతా అనుకున్నారు. అనుకున్నట్లుగా కోహ్లీ తొలి ఓవర్‌లోనే ఏకంగా మూడు ఫోర్లు బాదాడు. తర్వాతి ఓవర్‌లో రోహిత్‌ వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. కానీ, తర్వాత బంతికి అవుట్‌ అయ్యాడు. ఆ వెంటనే రిషభ్‌ పంత్‌(0), సూర్యకుమార్‌ యాదవ్‌(3) పెవిలియన్‌ చేరారు. 34 పరుగులకే టీమిండియా 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇలాంటి కష్టసమయంలో కోహ్లీ వింటేజ్‌ విరాట్‌ను బయటికి తీశాడు. అక్షర్‌ పటేల్‌, శివమ్‌ దూబేలతో కలిసి కీలక భాగస్వామ్యాలు నిర్మించాడు. ఆ భాగస్వామ్యాలే టీమిండియాను మ్యాచ్‌లో నిలబెట్టాయి. మొత్తం 59 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 76 పరుగులు టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. టీమిండియా విజయంలో కోహ్లీ మొదటి హీరో.

అక్షర్‌ పటేల్‌..
34 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి జట్టు తీవ్ర కష్టాల్లో ఉన్న సమయంలో అక్షర్‌ పటేల్‌ బ్యాటింగ్‌కు వచ్చాడు. మరో ఎండ్‌లో కోహ్లీ ఇన్నింగ్స్‌ను నిలబెట్టడానికి స్ట్రేక్‌రోటేట్‌ చేస్తూ యాంకర్‌ రోల్‌ పోషిస్తూంటే.. అక్షర్‌ వేగంగా ఆడుతూ.. రన్‌రేట్‌ పడిపోకుండా చూసుకున్నాడు. సిక్సులతో ప్రత్యర్థి బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. 31 బంతుల్లో ఒక ఫోర్‌, 4 సిక్సులతో 47 పరుగులు చేసిన తర్వాత దురదృష్టవశాత్తు రనౌట్‌ అయ్యాడు కానీ లేదంటే ఇంకా పెద్ద ఇన్నింగ్స్‌ ఆడేవాడు. టీమ్‌ కష్టాల్లో ఉన్న సమయంలో బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందు వచ్చి జట్టును సూపర్‌ బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు. అందుకే ఈ మ్యాచ్‌ విజయంలో అక్షర్‌ పటేల్‌ సెకండ్‌ హీరో.

జస్ప్రీత్‌ బుమ్రా..
ఈ టోర్నీలో ఫస్ట్‌ నుంచి టీమిండియా ఓ ఆటగాడి అండతోనే మ్యాచ్‌లు గెలుస్తూ వస్తోంది.. అతనే స్పీడ్‌స్టర్‌, బూమ్‌ బూమ్‌ బుమ్రా. అద్భుతమైన బౌలింగ్‌తో ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు పరిగెట్టించిన ఈ బౌలర్‌.. ఫైనల్‌లో కూడా సత్తా చాటాడు. బుమ్రా వేసిని ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌ మ్యాచ్‌కు టర్నింగ్‌ పాయింట్‌గా చెప్పవచ్చు. ఎందుకంటే అక్షర్‌ పటేల్‌ వేసిన ఇన్నింగ్స్‌ 15వ ఓవర్‌లో క్లాసెన్‌ దెబ్బకు ఏకంగా 24 పరుగులు వచ్చాయి. ఇంకా సౌతాఫ్రికాకు 30 బంతుల్లో 30 రన్స్‌ మాత్రమే కావాలి. ఇలాంటి టైమ్‌లో బాల్‌ అందుకున్న బుమ్రా.. టీమిండియాను తిరిగి మ్యాచ్‌లోకి తీసుకొచ్చాడు. 16వ ఓవర్‌లో కేవలం 4 రన్స్‌ మాత్రమే ఇచ్చాడు. దాంతో సౌతాఫ్రికా ఒత్తిడిలోకి వెళ్లింది. తిరిగి 18వ ఓవర్‌ వేసిన బుమ్రా ఈ సారి కేవలం 2 రన్స్‌ మాత్రమే ఇచ్చి కేశవ్‌ మహరాజ్‌ను అవుట్‌ చేశాడు. మొత్తంగా 4 ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అందుకే బుమ్రా ఈ మ్యాచ్‌కు మూడో హీరో.

హార్దిక్‌ పాండ్యా..
టీ20 వరల్డ్‌ కప్‌ కంటే ముందు దారుణమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొన్న హార్ధిక్‌ పాండ్యా.. ఆ బాధనంతా కసిగా మార్చి మ్యాచ్‌లో చూపించాడు. చివర్లో జస్ప్రీత్‌ బుమ్రాకు తోడుగా అద్బుతమైన బౌలింగ్‌తో టీమిండియాను గెలిపించాడు. ఇన్నింగ్స్‌ 17 ఓవర్‌ వేసిన పాండ్యా కేవలం 4 పరుగులే ఇచ్చాడు. ఆ ఓవర్‌ తొలి బంతికే డేంజర్‌గా ఆడుతూ.. టీమిండియా నుంచి మ్యాచ్‌ లాగేసుకుంటున్న క్లాసెన్‌ను అవుట్‌ చేశాడు. నిజానికి ఈ ఒక్క వికెట్‌ భారత్‌కు కప్పు అందించింది. అలాగే చివరి ఓవర్‌లో సౌతాఫ్రికా విజయానికి 16 అవసరమైన సమయంలో మరోసారి బంతి అందుకున్న పాండ్యా తొలి బంతికే డేంజరస్‌ డేవిడ్‌ మిల్లర్‌ను అవుట్‌ చేశాడు. మిల్లర్‌ అవుట్‌లో ఫీల్డర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌కు కూడా క్రెడిట్‌ ఇవ్వాలి. బౌండరీ లైన్‌ వద్ద ఆల్‌మోస్ట్‌ సిక్స్‌ వెళ్లే బంతిని క్యాచ్‌గా మార్చాడు. అయితే.. పాండ్యా చివరి ఓవర్‌లో కేవలం 8 రన్స్‌ ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ గెలిపించాడు. మొత్తంగా 3 ఓవర్లు వేసి 20 రన్స్‌ ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అందుకే పాండ్యా ఈ మ్యాచ్‌లో టీమిండియాకు అతి ముఖ్యమైన నాలుగో హీరో. మరి ఈ నలుగురు హీరోల ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments