Tirupathi Rao
The Shooting Star Of India Manu Bhaker Biography- Medals And Details: మను భాకర్ పారిస్ ఒలింపిక్స్ లో చరిత్ర సృష్టించింది. ఒకే ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించిన తొలి అథ్లెట్ గా తన పేరును సువర్ణాక్షరాలతో రాసుకుంది. ఈ సందర్భంగా మను భాకర్ జర్నీ, ఆమె మెడల్స్ హిస్టరీ, ఆమె లైఫ్ స్టోరీ ఒకసారి చూద్దాం.
The Shooting Star Of India Manu Bhaker Biography- Medals And Details: మను భాకర్ పారిస్ ఒలింపిక్స్ లో చరిత్ర సృష్టించింది. ఒకే ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించిన తొలి అథ్లెట్ గా తన పేరును సువర్ణాక్షరాలతో రాసుకుంది. ఈ సందర్భంగా మను భాకర్ జర్నీ, ఆమె మెడల్స్ హిస్టరీ, ఆమె లైఫ్ స్టోరీ ఒకసారి చూద్దాం.
Tirupathi Rao
మను భాకర్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ పేరు సంచలనంగా మారింది. పారిస్ లో జరుగుతున్న ఒలింపిక్స్ లో భారత్ తరఫున ఎయిర్ పిస్టల్ ఈవెంట్స్ లో మను భాకర్ ప్రాతినిధ్యం వహిస్తోంది. కేవలం ప్రాతినిధ్యం వహించడమే కాదు.. ఏకంగా ఒకే ఒలింపిక్స్ లో రెండు బ్రాంజ్ మెడల్స్ సాధించి చరిత్ర సృష్టించింది. స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ ఘనత సాధించిన తొలి అథ్లెట్ గా మను భాకర్ నిలవడం విశేషం. అయితే స్వతంత్రానికి ముందు 1900వ సంవత్సరంలో ఇదే పారిస్ లో జరిగిన ఒలింపిక్స్ లో భాయ్ ఆఫ్ కలకత్తాగా పేరు గాంచిన నార్మన్ ప్రిచార్డ్ రెండు పతకాలు సాధించాడు. ఇప్పుడు మను భాకర్ ఆ రికార్డును సమం చేసింది. ఈ సందర్భంగా అందరూ అసలు మను భాకర్ ఎవరు అంటూ వెతుకులాట స్టార్ట్ చేశారు.
మను భాకర్ ఫిబ్రవరి 18, 2002న హర్యానా రాష్ట్రంలోని ఝజ్జార్ లో జన్మించింది. ఆ ప్రాంతం ఎక్కువగా రెజర్లు, బాక్సర్లకు ప్రసిద్ధి. అయితే మను భాకర్ మాత్రం అనూహ్యంగా షూటింగ్ వైపునకు మళ్లింది. అయితే ఆమె మొదట షూటర్ అవ్వాలి అనుకోలేదు. తొలుత టెన్నింస్, బాక్సింగ్, స్కేటింగ్ వంటి ఆటలపై ఎక్కువ ఆసక్తి చూపింది. ‘థాంగ్ టా’ అనే మార్షల్ ఆర్ట్స్ లో జాతీయ స్థాయిలో మెడల్స్ కూడా సొంతం చేసుకుంది. అయితే ఆమెకు 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఎందుకో షూటింగ్ వైపు అడుగులు వేయాలి అనుకుంది. అనుకన్నదే తడవుగా తన తండ్రి రామ్ కిషన్ భాకర్ ను తనకు ఒక షూటింగ్ ప్రాక్టీస్ పిస్టల్ కావాలి అని అడిగింది. కూతురు అడిగిందో లేదో.. ఆయన ఒక పిస్టల్ కొనిచ్చారు. అప్పుడు ఆయన కూడా ఇవాళ మను భాకర్ ఈ స్థాయికి వెళ్తుంది అని ఊహించి ఉండరు. ఆ రోజుల్లో ఆయన పిస్టల్ ఎందుకు అనుంటే ఇప్పుడు ఒలింపిక్స్ లో ఇలా మను భాకర్ చరిత్ర సృష్టించేది కాదేమో? కానీ, కుతూరిపై ఆ తండ్రికి ఉన్న నమ్మకం ఇప్పుడు ఇక్కడి వరకు తీసుకొచ్చింది.
మను భాకర్ పేరు ఇప్పుడు మాత్రమే వార్తల్లో నిలిచింది అనుకుంటే పొరపాటే.. ఆమె పేరు ఏడేళ్ల క్రితమే వార్తల్లో నిలిచింది. దేశవ్యాప్తంగా సంచలనంగా కూడా మారింది. 2017 నేషనల్ షూటింగ్ ఛాంపియన్ షిప్ సమయంలో ఏకంగా ఒలంపియన్- ఫార్మర్ వరల్డ్ నంబర్ 1గా ఉన్న హీనా సిద్దుకు షాకిచ్చింది. ఆ టోర్నమెంట్ లో మను భాకర్ 10 మీటర్ ఎయిర్ పిస్టల్ లో ఏకంగా 242.3 పాయింట్లు స్కోర్ చేసింది. ఆ తర్వాత 2017లో జరిగిన ఆసియా జూనియర్ ఛాంపియన్ షిప్ లో సిల్వర్ మెడల్ తో కదం తొక్కింది. అది కేవలం ట్రైలర్ మాత్రమే. ఆ తర్వాత సంవత్సరమే మెక్సికోలో జరిగిన ISSF వరల్డ్ కప్ లో అడుగు పెట్టింది. ఫైనల్ అలా ఇలా అడుగు పెట్టలేదు.
ISSF వరల్డ్ కప్ లో అప్పటి వరకు ఉన్న జూనియర్ వరల్డ్ రికార్డులను బద్దలు కొట్టి 10 మీటర్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్ ఫైనల్ కు దూసుకెళ్లింది. డెబ్యూ ఈవెంట్ లోనే దద్దరిల్లిపోయే ప్రదర్శన చేసింది. ఒలింపిక్ ఛాంపియన్ అన్నా కొరకాకి, మూడుసార్లు ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ మెడల్ సాధించిన సెలీన్ గోబెర్ విల్, మెక్సికో ఫేవరెట్ అలెజాండ్రా జవాలాలను ఫైనల్ లో చిత్తుగా ఓడించి.. బంగారు పతకాన్ని సాధించింది. ఈ టోర్నీలో మను భాకర్ ఏకంగా 237.5 పాయింట్లు స్కోర్ చేసింది. కేవలం 16 ఏళ్ల వయసులోనే ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ లో బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించింది. అదే టోర్నీలో మిక్స్డ్ టీమ్ ఈవెంట్ లో ఓం ప్రకాశ్ తో కలిసి మరో బంగారు పతకం సాధించింది.
మను భాకర్ 2018లో ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ లో జరిగిన కామన్ వెల్త్ గేమ్స్ లో అడుగుపెట్టింది. 10 మీటర్స్ ఉమెన్స్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో సీడబ్ల్యూజీ రికార్డులు బద్దులు కొడుతూ.. బంగారు పతకాన్ని సాధించింది. తర్వాత ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్ లో బ్రాంజ్ మెడల్ దక్కించుకుంది. అయితే 2018లో జరిగిన ఏషియన్ గేమ్స్ లో మాత్రం మను భాకర్ తన సత్తా చాటలేకపోయింది. కానీ, ఆ ఏడాదిని కూడా తన జర్నీలో ఒక మరుపురాని ఏడాదిగా మార్చుకుంది. ఆ ఏడాది అర్జెంటీనాలో జరిగిన యూత్ ఒలింపిక్స్ లో 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ లో బంగారు పతకం గెలిచింది. యూత్ ఒలింపిక్స్ లో తొలిసారి బంగారు పతకం సాధించిన ఇండియన్ షూటర్ మాత్రమే కాకుండా.. తొలి మహిళా అథ్లెట్ గా చరిత్ర సృష్టించింది. 2019లో ఐఎస్ఎస్ఎఫ్ వర్డ్ కప్స్ లో వ్యక్తిగత, మిక్స్డ్ ఈవెంట్ లో బంగారు పతకం సాధించింది. 2020లో భారత ప్రభుత్వం మను భాకర్ ను ప్రతిష్టాత్మక అర్జున అవార్డుతో సత్కరించింది.
2020 టోక్యో ఒలింపిక్స్ లో మను భాకర్ ను అంతా మెడల్ ఫేవరెట్ అనుకున్నారు. కానీ, క్వాలిఫికేషన్ లో ఆమె పిస్టల్ మొరాయించింది. పక్కకు వెళ్లి దానిని సరి చేసుకుని రామని సూచించారు. ఆమె అలాగే తన పిస్టల్ ను సరిచేసుకుని వచ్చింది. కానీ, అప్పటికే చాలా సమయం అయిపోయింది. తీవ్ర ఒత్తిడిలో కూడా ఆమె చాలా బాగా పర్ఫామ్ చేసింది. కానీ, ఫైనల్ కు మాత్రం అర్హత సాధించలేకపోయింది. 25 మీటర్ పిస్టల్ ఈవెంట్ లో కూడా ఆమె ఫైనల్ చేరలేకపోయింది. ఇప్పుడు మను భాకర్ పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించడమే కాకుండా.. ఏకంగా రెండు బ్రాంజ్ మెడల్స్ ను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. అయితే మను భాకర్ ఒలింపిక్స్ లో భారత్ తరఫున మహాద్భుతం చేసేందుకు అడుగు దూరంలోనే ఉంది. ఆమె 25 మీటర్ పిస్టల్ ఈవెంట్ లో కూడా పాల్గొంటుంది. దానిలో కూడా పతకం సాధిస్తే.. ఒకే ఒలింపిక్స్ లో మూడు పతకాలు సాధించిన భారత అథ్లెట్ గా మను భాకర్ తన పేరును సువర్ణాక్షరాలతో లిఖిస్తుంది. మరి.. మను భాకర్ కు మీ శుభాకాంక్షలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.