iDreamPost
android-app
ios-app

ఒలింపిక్స్‌లో మనకెందుకు మెడల్స్ రావు! కాసేపు సిగ్గు విడిచి మాట్లాడుకుందాం రండి!

  • Published Aug 09, 2024 | 4:10 PM Updated Updated Aug 09, 2024 | 4:42 PM

Why Doesn't India Win More Medals in the Olympics?: మనకు ఫ్రీడమ్‌ వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా.. ఒలింపిక్స్‌లో మన స్థాయికి తగ్గట్లు మనం ఎందుకు మెడల్స్‌ సాధించలేకపోతున్నాం.. అందుకు గల కారణాలేంటో ఇప్పుడు కాస్త వివరంగా తెలుసుకుందాం..

Why Doesn't India Win More Medals in the Olympics?: మనకు ఫ్రీడమ్‌ వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా.. ఒలింపిక్స్‌లో మన స్థాయికి తగ్గట్లు మనం ఎందుకు మెడల్స్‌ సాధించలేకపోతున్నాం.. అందుకు గల కారణాలేంటో ఇప్పుడు కాస్త వివరంగా తెలుసుకుందాం..

  • Published Aug 09, 2024 | 4:10 PMUpdated Aug 09, 2024 | 4:42 PM
ఒలింపిక్స్‌లో మనకెందుకు మెడల్స్ రావు! కాసేపు సిగ్గు విడిచి మాట్లాడుకుందాం రండి!

ఎంతో ఘన చరిత్ర కలిగిన హాకీ జట్టు పారిస్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం నెగ్గితే దేశం మొత్తం సంబురాలు చేసుకుంటున్నాం.. అలాగే జావెలిన్‌ త్రోలో నీరజ్‌ చోప్రా రజతం(సిల్వర్‌), షూటింగ్‌లో మను మెడల్స్‌ గెలిస్తే సంబరపడిపోతున్నాం.. కానీ, ఇదే పారిస్‌ ఒలింపిక్స్‌లో అమెరికా, చైనా ఏకంగా 100కి పైగా మెడల్స్‌ గెలిచేశాయి. అదేంటి.. మనం అమెరికా, చైనా కంటే ఏం తక్కువ? మనకు 5 మెడల్స్‌ ఏంటి? వాళ్లకు 100కి పైగా మెడల్స్‌ ఏంటి? ఆర్థికంగా కాస్త వెనుక బడినా.. జనాభా పరంగా, టాలెంట్‌ పరంగా, యువత పరంగా మనమే కదా ముందుంది.. అయినా కూడా పతకాలలో మరీ ఇంత తేడా ఎందుకు? కోట్ల మంది జనాభా ఉన్నా.. ఒలింపిక్స్‌లో ఇండియాకు ఎందుకు ఎక్కువ మెడల్స్‌ రావడంలేదు? ఈ ప్రశ్న గత కొన్నేళ్లుగా మేధవులా నుంచి సామన్యుల వరకు.. దాదాపు అందరి నోటా వినిపిస్తూనే ఉంది.

ఇండియాకు ఒకటి రెండు మెడల్స్‌ మాత్రమే ఇచ్చాయి.. చైనా అమెరికా లాంటి దేశాలకు వందల సంఖ్యలో మెడల్స్‌ వచ్చాయని.. ఉదయాన్నే పేపర్‌లోనో, టీవీలోనో చూసి.. మనకెందుకు రాట్లేదని విసుక్కుంటూ.. కొద్ది సేపు ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ ఉంటాం. అదే సమయానికి ఇంట్లో నుంచి మన అమ్మాయో, అబ్బాయో ఆడుకునేందుకు వెళ్తుంటే.. కళ్లు పెద్దవి చేసి, గొంతులో కోపం నింపి.. ‘ఏయ్‌.. ఎక్కడికి వెళ్లేది? పోయి హోంవర్క్‌ చేసుకో పో..!’ అంటూ గద్దిస్తాం.. వేలు, లక్షలు పోసి.. కనీసం ఓ ఆరగురు కలిసి ఆడుకునే ఆర గుంట స్థలం కూడా లేని స్కూల్స్‌కి పిల్లల్ని పంపిస్తాం.. ఇంకేలా వస్తాయి మనకు మెడల్స్‌. ఇప్పుడే కాదు.. మనం మారకుంటే.. మరో పాతికేళ్లకు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే.. ఇప్పుడు భుజాలపై బ్యాగుల బరువు మోస్తున్న పిల్లలే కదా.. పాతికేళ్ల తర్వాత కార్పొరేట్‌ కూలీలుగా మారేది. అప్పుడు కూడా.. ఒకటి రెండు మెడల్స్‌తోనే సరిపెట్టుకోవాలి. దేశానికి స్వతంత్రం వచ్చి 77 ఏళ్లు అయినా.. దేశ జనాభా 145 కోట్లు దాటినా.. లార్జెస్ట్‌ ఎకానమీ కలిగిన ఐదో అతిపెద్ద దేశంగా ఉన్నా కూడా.. ఇండియాకు ఒలింపిక్స్‌లో ఎక్కువ మెడల్స్‌ ఎందుకు రావడం లేదో.. అందుకు గల కారణాలేంటో ఇప్పుడు కాస్త పచ్చిగా మాట్లాడుకుందాం..

ముందుగా తల్లిదండ్రులు..

నా కొడుకు చదువుకొని.. పెద్ద ఉద్యోగం చేయాలి. నా కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి.. చాలా మంది తల్లిదండ్రులు ఇలానే ఆలోచిస్తున్నారు. చిన్నతనం నుంచే చదువు చదువు అంటూ.. పిల్లల బలమైన భుజాలపై మోయలేనంత బరువు పెట్టి.. బందీఖానాల్లాంటి బడులకు పంపుతున్నారు. జీవితం అంటే బాగా చదివి, మంచి ఉద్యోగం తెచ్చుకోవడం అని అనుకుంటున్నారు. నా కొడుకుని ఇంజనీర్‌ చేస్తా.. నా కూతుర్ని డాక్టర్‌ చేస్తా అని అంటున్నారే కానీ.. నా కొడుకునో కూతుర్నో అథ్లెట్‌ చేస్తా.. రన్నింగ్‌లో ట్రైనింగ్‌ ఇప్పించి హుస్సేన్‌ బోల్ట్‌ రికార్డు బ్రేక్‌ చేయిస్తా అనే మాట​ ఎవరి నోటి నుంచి అయినా వినిపిస్తుందా? ఎంసెట్‌లో ర్యాంక్‌ ఎంత? ఏ కాలేజీలో చేర్పించాలి? ఏ కోర్స్‌ నేర్పించాలి? ఎంత సేపటికీ ఇదే గోల తప్పించి.. స్పోర్ట్స్‌ వైపు ప్రొత్సహించే పేరెంట్స్‌ ఎంత మంది ఉన్నారో.. మనకు మనమే ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి.

ఒలింపిక్‌లో మెడల్‌ కొట్టిన నీరజ్‌ చోప్రా, మను భాకర్ల ఫొటోలను మన వాట్సాప్‌ స్టేటస్‌లో పెట్టడంతో పాటు.. మన పిల్లలకి కూడా స్పోర్ట్స్‌లో పాల్గొనే సపోర్ట్‌ అందించాలి. అప్పుడే కదా వాళ్లను కూడా అభినందిస్తూ ఇతరులు వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టేది. అయినా.. ఉద్యోగం పురుష లక్షణం అనే దిక్కుమాలిక మాట మనలో అణువణువునా నాటుకుపోయింది. దాని నుంచి ఇప్పుడిప్పుడే కాస్త బయటపడుతున్నా.. కార్పొరేట్‌ చదువుల వైపు, కార్పొరేట్‌ ఉద్యోగాల వైపే ఎక్కువ మంది పరుగులు తీస్తున్నారు. చాలా మందిని వారి తల్లిదండ్రులే అలా పరుగులు పెట్టిస్తున్నారు. ఉదయం ట్యూషన్‌.. ఆ తర్వాత స్కూల్‌.. మళ్లీ సాయంత్రం ట్యూషన్‌.. దీంతో పిల్లల స్కూల్‌ లైఫ్‌ అయిపోతుంది. ఇంటర్మీడియట్‌ రెండేళ్లు అయితే.. భట్టీ చదువులతో ఎలా గడిచిపోతాయో కూడా తెలియదు. ఆ తర్వాత ఇంజనీరింగ్‌.. సాఫ్ట్‌వేర్‌ జాబ్‌. ఇదే ప్యాట్రన్‌లో బతికేస్తున్నాం. చదువు కూడా ముఖ్యమే.. కానీ, చదువు ఒక్కటే ముఖ్యం అనుకంటే.. ఇలా ఒకటి రెండు మెడల్స్‌తోనే సరిపెట్టుకోవాలి. దేశానికి ఇంజనీర్లు, డాక్టర్లు, శాస్త్రవేత్తలు, పోలీసులు, సైనికులు, లాయర్లు వీళ్లంతా అవసరమే.. కానీ, వారితో పాటు దేశ కీర్తి ప్రతిష్టలను పెంచే క్రీడాకారులు కూడా అవసరమే అనే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించినప్పుడే ఇండియా కూడా ఒలింపిక్స్‌ను శాసిస్తుంది.

వాట్‌ ఎబౌట్‌ గర్నమెంట్‌?

అత్యధిక జనాభా కలిగిన మన దేశంలో అందరి ఆర్థిక స్థోమత ఒకలా ఉండదు. కనీసం పిల్లలకు సరైన తిండి కూడా పెట్టలేని తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వాళ్లు.. పిల్లల చదువు, పౌష్టికాహారం కోసమే రెక్కలు ముక్కలు చేసుకుంటూ ఉంటారు. దానికి తోడు ఈ ఆటలు, వాటికి ట్రైనింగ్‌ అంటే కష్టమే. కానీ, మట్టిలోని మాణిక్యాలను వెలికి తీయాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వానిదే. ఒలింపిక్స్‌లో ఇండియా పతకాల పంట పండించాలంటే.. ప్రభుత్వం పిల్లలను, యువతను స్పోర్ట్స్‌ వైపు ప్రొత్సహించాలి. స్కూలింగ్‌ నుంచే టాలెంట్‌ను వెతికి పట్టుకోవాలి. వారికి మంచి ట్రైనింగ్‌ ఇప్పించాలి. ప్రతి దశలోనూ వారికి అండగా నిలవాలి.. అలా చేయాలంటే.. డబ్బు కావాలి. అందుకోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి. కానీ మన దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నామమాత్రంగానే కేంద్ర బడ్జెట్‌లో స్పోర్ట్స్‌ కోసం నిధులు కేటాయిస్తున్నారు.

ఎంకరేజ్‌మెంట్‌ ఉండదు, ఎక్విప్‌మెంట్లు అసలే ఉండవు

యువత అత్యధికంగా ఉండే మన దేశంలో చాలా మంది ‍క్రీడల్లో ఇంట్రెస్ట్‌ చూపిస్తారు. దేశానికి ఆడాలని కలలు కంటారు. వారు ఎంచుకున్న గేమ్‌లో మంచి ప్రతిభ కలిగి ఉంటారు. కానీ, ఏం లాభం వారి ప్రతిభ గ్రామాలు, మండలాల స్థాయిలో ఆగిపోతుంది. అందుకు కారణం.. సరైన స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ లేకపోవడమే. స్కూల్‌ స్థాయి నుంచే పిల్లలో ఉండే క్రీడా నైపుణ్యాన్ని వెతికి పట్టుకుంటే మెరికల్లాని అథ్లెట్లను తయారు చేయవచ్చు. అందుకోసం ‘ఖేలో ఇండియా’ లాంటి కార్యక్రమాలు ఇప్పుడిప్పుడే కాస్త దోహదం చేస్తున్నా.. ఇంకా పటిష్టమైన వ్యవస్థ అవసరం. మొత్తం అన్ని రకాల ఒలింపిక్స్ కలిసి 70కి పైగా ఆటలు ఉన్నాయి. వాటిలో 90 శాతానికి పైగా క్రీడలకు మన దేశంలో ఆదరణ లేదు. కారణం.. వాటిని ఎవరు ఆడరు. వాటిని ప్రభుత్వమే ప్రచారం చేసి అవగాహన కల్పించి.. యువతను వాటిని ఆడే దిశగా ప్రొత్సహించాలి. విద్యార్థులను స్పోర్ట్స్‌ వైపు ఎంకరేజ్‌ చేసే విషయంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలే ముందున్నాయి. ప్రైవేట్‌ స్కూల్స్‌ ఎంతసేపటికీ ర్యాంకుల వెంట పడుతున్నాయి.

ఇప్పటి వరకు అంతర్జాతీయ స్థాయిలో రాణించిన ఎంతో మంది క్రీడాకారులు తమ సొంత కష్టంతోనే పై కొచ్చిన వారు ఉన్నారు. ప్రభుత్వం నుంచి వారికి అందిన మద్దతు చాలా తక్కువ. కానీ, అందరు అలా రాలేరు. ఆర్థికంగా, ట్రైనింగ్‌ పరంగా వారికి ప్రభుత్వమే అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి. దేశవ్యాప్తంగా వివిధ రకాల క్రీడలకు సంబంధించిన ట్రైనింగ్‌ సెంటర్లను, కోచింగ్‌ అకాడమీలను ప్రారంభించాలి, ఉచితంగా క్రీడా కారులను ట్రైన్‌ చేయాలి.. కానీ అవన్నీ జరుగుతున్నాయా అంటే? కచ్చితంగా జరగడం లేదు. జరిగినా.. నామమాత్రంగానే జరుగుతున్నాయి.

క్రీడల్లో రాజకీయ జోక్యం..

ఆదరణ, ప్రొత్సాహం లేకపోయినా.. కొంతమంది క్రీడాకారులు తమ సొంత కష్టంతో.. అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర స్థాయి వరకు వచ్చినా.. క్రీడల్లో రాజకీయ జోక్యం వల్ల కొంతమంది అద్భుతమైన క్రీడాకారులు వెలుగులోకి రాకుండా చీకటిలోనే ఉండిపోతున్నారు. అలాగే స్పోర్ట్స్‌ కోసం కేటాయించే నిధులు.. ఏ అవినీతి లేకుండా, పారదర్శకంగా క్రీడల అభివృద్ధి కోసం, క్రీడాకారుల నైపుణ్యాభివృద్ధి కోసం ఖర్చు పెడితే కూడా మంచి ఫలితాలు ఉంటాయి. కానీ, అది జరగడం లేదు. ఇక సామాన్యుల నుంచి పెద్ద పెద్ద మీడియా సంస్థల వరకు కొన్ని క్రీడలకు, కొంతమంది క్రీడాకారులను మాత్రం హైప్‌ చేయకుండా.. దేశానికి ఆడే ప్రతి క్రీడాకారుడిని ఒకే విధంగా గౌరవించి, ఆదరించినా కూడా చాలా మంది అన్ని రకాల క్రీడల వైపు అడుగులేసే అవకాశం ఉంది.

పైగా స్పోర్ట్‌ అంటే ఒక్క క్రికెట్‌ మాత్రమే అనే ధోరణి కూడా కాస్త తగ్గితే మంచిది. క్రికెట్‌తో పాటు మిగతా క్రీడలను కూడా ఆదరించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఏ ఆటకైన ఆదరణ చాలా ముఖ్యం. క్రేజ్‌ ఉన్న గేమ్‌నే కెరీర్‌గా ఎంచుకునేందుకు పిల్లలు, విద్యార్థులు ఇష్టపడతారు. మరి ఇప్పటికైనా.. తల్లిదండ్రులుగా మనం మారి పిల్లలను చదువుతో పాటు స్పోర్ట్స్‌ వైపు ప్రొత్సహిస్తూ.. క్రీడల్లోనూ ట్రైనింగ్‌, కోచింగ్‌ ఇచే విద్యాసంస్థల్లోనే పిల్లలను జాయిన్‌ చేస్తే, అలాగే పిల్లలను ఉత్తములగా తీర్చిదిద్దే గురువులు చదవుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమని చెబితే, మంచి ఉద్యోగమే కాదు.. దేశానికి మెడల్‌ తేవడం అంతకన్న గొప్ప విషయం అని యువత నమ్మితే, దేశ ప్రతిష్టను పెంచేందుకు క్రీడలకు పెద్ద ఎత్తున నిధులు ప్రభుత్వం కేటాయిస్తూ.. యువతను ప్రొత్సహిస్తేనే.. కొన్నేళ్ల తర్వాత ఇండియా కూడా ఒలింపిక్స్‌లో పదుల సంఖ్యలో మెడల్స్‌ కొడుతుంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.