iDreamPost
android-app
ios-app

విండీస్‌పై ఘనవిజయం! రికార్డుల మోత మోగిపోయింది

  • Published Jul 15, 2023 | 11:19 AM Updated Updated Jul 15, 2023 | 11:19 AM
  • Published Jul 15, 2023 | 11:19 AMUpdated Jul 15, 2023 | 11:19 AM
విండీస్‌పై ఘనవిజయం! రికార్డుల మోత మోగిపోయింది

వెస్టిండీస్‌పై తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో పసికూనగా మారిన విండీస్‌పై ఇన్నింగ్స్‌ 141 పరుగుల తేడాతో గెలిచింది. ఈ భారీ విజయంతో పలు రికార్డులను కొల్లగొట్టిన టీమిండియా ఒక అరుదైన రికార్డును ఖాతాలో వేసుకుంది. భారత క్రికెట్‌ చరిత్రలో ఆసియా బయట ఆడిన మ్యాచ్‌ల్లో ఇదే అతి పెద్ద విజయంగా నిలిచింది. 2016లో వెస్టిండీస్‌పైనే నార్త్‌ సౌండ్‌లో ఇన్నింగ్స్‌ 92 పరుగులతో టీమిండియా విజయం సాధించింది. ఇప్పుడా రికార్డును బద్దలుకొడుతూ.. ఆసియా ఖండం బయట అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఇన్నింగ్స్‌ తేడాతో ఇప్పటి వరకు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, జింబాబ్వేల్లో గెలిచింది. తాజాగా వెస్టిండీస్‌పై సాధించిన విజయంతో రెండో సారి విండీస్‌పై ఇన్నింగ్స్‌ తేడా గెలిచింది.

ఓవరాల్‌గా టీమిండియాకు టెస్టుల్లో అతిపెద్ద విజయం కూడా వెస్టిండీస్‌పైనే ఉండటం విశేషం. రాజ్‌కోట్‌ వేదికగా 2018లో ఇండియా ఇన్నింగ్స్‌ 272 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇండియా బయట అతి పెద్ద విజయంగా 2007లో బంగ్లాదేశ్‌పై ఇన్నింగ్స్‌ 239 పరుగుల తేడాతో గెలిచింది. మొత్తం మీద తాజాగా వెస్టిండీస్‌పై సాధించిన ఇన్నింగ్స్‌ 141 పరుగల విజయం.. భారత క్రికెట్‌ చరిత్రలోనే 11వ అతి పెద్ద టెస్ట్‌ మ్యాచ్‌ విజయంగా నిలిచింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ 150 పరుగులకు ఆలౌట్‌ అయింది. టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌, వరల్డ్‌ నంబర్‌ వన్‌ టెస్ట్‌ బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ స్పిన్‌ మ్యాజిక్‌ ముందు విండీస్‌ బ్యాటర్లు నిలువలేకపోయారు. విండీస్‌ ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో అశ్విన్‌ 5 వికెట్లతో చెలరేగాడు. జడేజా 3, సిరాజ్‌, శార్దుల్‌ చెరో వికెట్‌ తీసుకున్నారు. ఇక భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు రోహిత్‌ శర్మ(103), డెబ్యూ క్రికెటర్‌ యశస్వి జైస్వాల్‌(171) సెంచరీలతో చెలరేగడంతో భారీ స్కోర్‌ సాధించింది. విరాట్‌ కోహ్లీ సైతం 76 పరుగులతో రాణించడంతో 421 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసి.. రెండో ఇన్నింగ్స్‌లో విండీస్‌ను 130కు ఆలౌట్‌ చేసి.. మూడో రోజే మ్యాచ్‌ను ముగించింది. విండీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్‌ 7 వికెట్లతో సత్తా చాటి మొత్తం 12 వికెట్లు సాధించాడు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు జైస్వాల్‌ అందుకున్నాడు. మరి ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆసియా బయట అతిపెద్ద విజయం నమోదు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: గ్రౌండ్‌లో డ్యాన్స్‌ ఇరగదీసిన కోహ్లీ! వైరల్‌ వీడియో