క్రికెట్ మ్యాచ్ ల్లో ఎన్నో విచిత్రాలు జరుగుతుంటాయి. అయితే కొన్ని విచిత్రాలు మాత్రం ఫీల్డర్లు చేసిన పొరపాట్ల వల్లనో.. లేక అంపైర్లు గమనించకపోవడం వల్లనో జరుగుతుంటాయి. ఇక వీరిద్దరు చేసిన తప్పుల వల్ల ఒక్కోసారి మ్యాచ్ లు కూడా ఓడిపోయే పరిస్థితులు వస్తుంటాయి. తాజాగా తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. లైకా కోవై కింగ్స్ వర్సెస్ సేలం స్పార్టాన్స్ జట్ల మధ్య ఈ సన్నివేశం జరిగింది. బ్యాటర్ అవుట్ అయినా గానీ నాటౌట్ గానే ఉన్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో నవ్వులు పూయిస్తోంది.
తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో జరిగిన ఓ సంఘటన.. చూసిన వారందరిని నవ్వులు పూయిస్తోంది. ఫీల్డర్లు, అంపైర్లు చేసిన తప్పిదంతో ఓ బ్యాటర్ అదృష్టం కొద్ది బతికిపోయాడు. అసలేం జరిగింది అంటే.. తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో భాగంగా.. లైకా కోవై కింగ్స్ వర్సెస్ సేలం స్పార్టాన్స్ మధ్య మంగళవారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో కింగ్స్ బ్యాటర్ సుజోయ్ రనౌట్ అయ్యాడు. అయితే ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు ఈ రనౌట్ ను అప్పీల్ చేయలేదు. అదీకాక అంపైర్లు సైతం దీనిని సరిగ్గా గమనించలేదు. దాంతో అదృష్టం కలిసొచ్చి అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు సుజోయ్.
కాగా.. ఇన్నింగ్స్ మూడో ఓవర్ లో అభిషేక్ తన్వర్ విసిరిన బంతిని కవర్స్ వైపు ఆడాడు సుజోయ్. పరుగు తీయబోయే క్రమంలో ఫీల్డర్ బాల్ ను వికెట్లకు త్రో చేశాడు. ఈ క్రమంలోనే బాల్ తాకుతుందని సుజోయ్ గాల్లోకి ఎగిరాడు. అయితే ఆ బాల్ సరాసరి వికెట్లను తాకింది. అప్పటికి సుజోయ్ క్రీజ్ లో ఉన్నప్పటికీ కాళ్లు గాల్లో ఎగురుతున్నాయి. అది క్లియర్ అవుట్.. కానీ ఆటగాళ్లు అప్పీల్ చేయకపోవడం, అంపైర్లు సరిగ్గా గమనించకపోవడంతో.. సుజోయ్ బతికిపోయాడు. ఆ తర్వాత అతడు రెచ్చిపోయి ఆడాడు. 32 బంతుల్లో 6 ఫోర్లతో 44 పరుగులు చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్ జట్టు 199 పరుగులు చేసింది. అనంతరం 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సేలం జట్టు 120 పరుగులకే ఆలౌట్ అయ్యింది.