iDreamPost

Andries Gous: మ్యాచ్ ఓడినా.. మనసులు గెలిచిన USA ప్లేయర్! నీ పోరాటం అద్భుతం..

సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో ఓడిపోయినప్పటికీ.. తన అసమాన బ్యాటింగ్ తో, పోరాటంతో అభిమానులు మనసులు గెలుచుకున్నాడు అమెరికా ఓపెనర్ కమ్ వికెట్ కీపర్ ఆండ్రీస్ గౌస్.

సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో ఓడిపోయినప్పటికీ.. తన అసమాన బ్యాటింగ్ తో, పోరాటంతో అభిమానులు మనసులు గెలుచుకున్నాడు అమెరికా ఓపెనర్ కమ్ వికెట్ కీపర్ ఆండ్రీస్ గౌస్.

Andries Gous: మ్యాచ్ ఓడినా.. మనసులు గెలిచిన USA ప్లేయర్! నీ పోరాటం అద్భుతం..

టీ20 వరల్డ్ కప్ లో జరిగిన తొలి సూపర్ 8 మ్యాచ్ ప్రేక్షకులకు మస్త్ మజాను పంచింది. సౌతాఫ్రికా వర్సెస్ అమెరికా మధ్య జరిగిన మ్యాచ్ లో 195 పరుగుల టార్గెట్ ను పసికూన అమెరికా ముందు ఉంచింది సఫారీ టీమ్. పైగా ప్రోటీస్ టీమ్ కు భీకర బౌలింగ్ దళముంది. దాంతో మ్యాచ్ ఏకపక్షంగానే సాగుతుందని అందరూ అనుకున్నారు. కానీ అమెరికా పోరాడిన తీరు అద్భుతం. మరీ ముఖ్యంగా ఆ జట్టు ఓపెనర్ ఆండ్రీస్ గౌస్ సంచలన ఇన్నింగ్స్ తో ప్రేక్షకుల హృదయాలు కొల్లగొట్టాడు. ఒకవైపు సహచరుల నుంచి సహకారం అందకున్నా.. పటిష్టమైన దక్షిణాఫ్రికా బౌలింగ్ దళాన్ని గౌస్ ఎదుర్కొన్న తీరు అమోఘం, అద్భుతం.

సూపర్ 8లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్ లో సౌతాఫ్రికా జట్టు శుభారంభం చేసింది. అమెరికాను 18 పరుగుల తేడాతో ఓడించి.. టోర్నీలో ముందడుగువేసింది. అయితే దక్షిణాఫ్రికా మ్యాచ్ గెలిచినప్పటికీ.. ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాడు అమెరికా బ్యాటర్. తొలుత బ్యాటింగ్ చేసిన ప్రోటీస్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 194 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ 40 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సులతో 74 పరుగులు చేశాడు. అతడికి తోడు మార్క్రమ్(46), క్లాసెన్(36 నాటౌట్) రాణించడంతో భారీ స్కోర్ సాధించింది.

అనంతరం 195 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన అమెరికా గొప్పగా పోరాడింది. ఓపెనర్ స్టీవెన్ టేలర్ 14 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్స్ తో 24 పరుగులు చేసి.. ఉన్నంతసేపు ధాటిగా ఆడాడు. కానీ రబాడ అతడిని నాలుగో ఓవర్లో పెవిలియన్ కు పంపడంతో.. అమెరికా ఇన్నింగ్స్ గాడి తప్పింది. ఆ తర్వాత వరుసగా నితీశ్ కుమార్(8), ఆరోన్ జోన్స్(0), కోరీ అండర్సన్(12), జహంగీర్(3) తక్కువ పరుగులకే ఔట్ అవ్వడంతో.. ఒక దశలో అమెరికా 12 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 76 పరుగులు చేసింది. దాంతో ఆ జట్టు దారుణంగా ఓడిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ ఒకవైపు వికెట్లు పడుతున్నా.. తన పోరాటాన్ని మాత్రం కొనసాగించాడు ఆండ్రీస్ గౌస్.

అప్పటి వరకు ఏకపక్షమే అనుకున్న మ్యాచ్ ను ఒక్కసారిగా తమవైపు తిప్పుకున్నారు. హర్మీత్ సింగ్ తో కలిసి మ్యాచ్ గమనాన్నే మార్చేశాడు గౌస్. 4 ఓవర్లలో వీరిద్దరు ఏకంగా 64 పరుగులు పిండుకున్నారు. దాంతో 2 ఓవర్లలో అమెరికా విజయానికి 28 పరుగులు అవసరం అయ్యాయి. ఈ గణాంకాలు చూస్తే.. అమెరికా సంచలనం సృష్టిస్తుందా? అన్న అనుమానం అందరిలో కలిగింది. కానీ 19వ ఓవర్లో హర్మీత్ సింగ్ (38)ని ఔట్ చేయడమే కాకుండా.. ఆ ఓవర్లో కేవలం 2 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఇక చివరి ఓవర్లో నోకియా 7 రన్స్ ఇచ్చాడు. దాంతో 18 రన్స్ తేడాతో అమెరికా ఓడిపోయింది. చివరి వరకు క్రీజ్ లో నిలిచిన ఆండ్రీస్ గౌస్ 47 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 80 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అద్భుతంగా పోరాడినప్పటికీ.. మ్యాచ్ గెలవకపోయినా.. అభిమానుల మనసులు మాత్రం గెలిచాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి