IND vs PAK: పాక్ పై భారత్ ఘన విజయం! అల్లాడించిన టీమిండియా బౌలర్స్..

IND vs PAK: పాక్ పై భారత్ ఘన విజయం! అల్లాడించిన టీమిండియా బౌలర్స్..

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా జరిగిన హై ఓల్టేజ్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై టీమిండియా ఘన విజయం సాధించింది. చివరి ఓవర్ వరకు నరాలు తెగే ఉత్కంఠతతో జరిగిన పోరులో చివరికి భారత్ పైచేయి సాధించింది. ఆ వివరాల్లోకి వెళితే..

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా జరిగిన హై ఓల్టేజ్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై టీమిండియా ఘన విజయం సాధించింది. చివరి ఓవర్ వరకు నరాలు తెగే ఉత్కంఠతతో జరిగిన పోరులో చివరికి భారత్ పైచేయి సాధించింది. ఆ వివరాల్లోకి వెళితే..

టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా విజయాల జోరును కొనసాగిస్తోంది. తొలి మ్యాచ్ లో ఐర్లాండ్ ను 8 వికెట్ల తేడాతో మట్టికరిపించిన భారత్.. అదే ఊపును దాయాది పాక్ పై కూడా చూపించింది. ప్రపంచం మెుత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ కు వరుణుడు అడ్డుపడటంతో.. మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం అయ్యింది. కానీ చివరి ఓవర్ వరకు ఉత్కంఠంగా సాగిన పోరులో టీమిండియా 6 పరుగుల స్వల్ప తేడాతో థ్రిల్లింగ్ విక్టరీని నమోదు చేసింది. బ్యాటింగ్ లో విఫలం అయిన టీమిండియా ఆటగాళ్లు.. బౌలింగ్ లో మాత్రం రెచ్చిపోయారు.

ప్రపంచం మెుత్తం వేయి కళ్లతో ఎదురుచూసిన ఇండియా-పాక్ మ్యాచ్.. ప్రేక్షకులకు ఫుల్ కిక్కిచ్చింది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అవుతుందేమోనని అభిమానులు భయపడ్డారు. కానీ వరుణుడు కాస్త కనికరించడంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం అయ్యింది. ఇక ఈ పోరులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. పాక్ బౌలర్ల ధాటికి 19 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలింది. పిచ్ బ్యాటింగ్ కు సహకరించకపోవడంతో.. రెచ్చిపోయిన పాక్ బౌలర్లు భారత బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. దాంతో వచ్చిన వారు వచ్చినట్లే పెవిలియన్ చేరారు. పాక్ పై తన విశ్వరూపం చూపిస్తాడు అనుకున్న విరాట్ కోహ్లీ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి తొలి వికెట్ గా వెనుదిరిగాడు.

ఆ తర్వాత రోహిత్(13), అక్షర్ పటేల్ (20), సూర్య(7), దూబే(3),  పాండ్యా(7), జడేజా(0) దారుణంగా విఫలం అయ్యారు. భారత్ 119 పరుగులు చేసిందంటే అది రిషబ్ పంత్ కారణంగానే. ఒక వైపు వికెట్లు పడుతున్నా.. పంత్ 31 బంతుల్లో 6 ఫోర్లలో 42 రన్స్ చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. పాక్ బౌలర్లలో నసీమ్ షా, హారీస్ రౌఫ్ తలా 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం 120 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు టీమిండియా బౌలర్లు. 13 పరుగులు చేసిన బాబర్ అజామ్ ఔట్ చేసి టీమిండియాకు బ్రేక్ త్రూ అందించాడు జస్ప్రీత్ బుమ్రా. అయితే ఆ తర్వాత మహ్మద్ రిజ్వాన్(31)తో కలిసి ఉస్మాన్ ఖాన్(13), ఫకర్ జామన్(13) విజయం వైపుగా పాక్ ను తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలోనే ఉస్మాన్ ను అక్షర్ పటేల్ ఔట్ చేయగా.. ఫకర్ జమాన్ ను పాండ్యా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత పాక్ వెంటవెంటనే వికెట్లను కోల్పోయింది. ఈ క్రమంలోనే చివరి ఓవర్లో పాక్ విజయానికి 17 పరుగులు అవసరం కాగా.. అద్భుతమైన బౌలింగ్ వేసిన అర్షదీప్ 11 రన్స్ ఇచ్చి.. ఓ వికెట్ తీశాడు. దాంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి పాక్ 113 రన్స్ చేసి.. 6 పరుగుల స్వల్ప తేడాతో ఓడిపోయింది. టీమిండియా బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా అల్లాడించాడు. 4 ఓవర్లలో కేవలం 14 పరుగులు ఇచ్చి 3 కీలక వికట్లు తీసుకున్నాడు. మిగతావారిలో పాండ్యా 2, అర్షదీప్, అక్షర్ పటేల్ తలా ఓ వికెట్ తీసుకున్నారు. ఇక ఈ విజయంతో టోర్నీలో టీమిండియా ముందుకు సాగడంతో పాటుగా.. పాక్ పై మరోసారి తమదే పైచేయి అని నిరూపించుకుంది. మరి పాక్ పై భారత్ విజయం సాధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments