యువీ 6 సిక్సుల తర్వాత.. బ్రాడ్‌ భారత్‌పై ప్రతీకారం తీర్చుకున్నాడని తెలుసా?

2007 టీ20 వరల్డ్‌ కప్‌ అనగానే చాలా మంది ఇండియన్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌కు గుర్తుకు వచ్చే బెస్ట్‌ మూమెంట్‌.. డాషింగ్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ కొట్టిన ఆరు సిక్సులు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు సీనియర్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రూ ఫ్లింటాఫ్‌ నోటి దూలతో యువరాజ్‌తో గొడవ పెట్టుకున్నాడు. దీంతో యువీకి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఫ్లింటాఫ్‌పై కోపాన్ని తన బ్యాటింగ్‌లో చూపించాడు యువీ. పాపం.. యువీ కోపానికి ఆ గొడవతో ఏ మాత్రం సంబంధంలేన అప్పటి యువ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ బలయ్యాడు.

ఫ్లింటాఫ్‌తో గొడవ తర్వాత తీవ్ర కోపంతో ఊగిపోతున్న యువీ.. తర్వాతి ఓవర్‌లో బంతిని కసితీరా బాదాడు. ఏకంగా ఆరు బంతుల్లో ఆరు సిక్సులు బాది.. ఫ్లింటాఫ్‌కు, ఇంగ్లండ్‌ దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చాడు. ఈ గొడవలో బ్రాడ్‌ బలైపోయాడు. అప్పుడే తన కెరీర్‌ ఆరంభం దశలో ఉన్న బ్రాడ్‌.. ఆ షాక్‌ నుంచి బయటపడేందకు కాస్త టైమ్‌ తీసుకున్నాడు. అతని కెరీర్‌లో పెద్ద మచ్చగా మిగిలిపోయింది ఆ మ్యాచ్‌. బ్రాడ్‌ పేరు వింటే చాలు యువీ బాధితుడంటూ ఇండియన్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌ గుర్తు చేసుకుంటూ ఉంటారు. బ్రాడ్‌కు అదో పీడకల మ్యాచ్‌ అయినా.. ఆ తర్వాత అతను కోలుకున్న తీరు మాత్రం నిజంగా స్ఫూర్తిదాయకమనే చెప్పాలి.

గోడకు కొట్టిన బంతిలా పుంజుకున్న బ్రాడ్‌.. ఇంగ్లండ్‌ క్రికెట్‌ చరిత్రలోనే నంబర్‌ 2 బౌలర్‌గా ఎదిగాడు. అయితే.. 2007లో యువరాజ్‌ సింగ్‌ ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టడంతో ఎదురైన అవమానానికి బ్రాడ్‌ చాలా త్వరగానే బదులు తీర్చుకున్నాడు. 2011 జూలైలో ఇండియా-ఇంగ్లండ్‌ మధ్య నాటింగ్‌హామ్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో బ్రాడ్‌ టీమిండియాపై నిప్పులు చెరిగాడు. యువీ చేతుల్లో పడిన దెబ్బకు ప్రతీకారం తీర్చుకుంటూ భారత్‌పై హ్యాట్రిక్‌తో చెలరేగాడు. తన కెరీర్‌పై మయాని మచ్చను వేసిన టీమ్‌పై హ్యాట్రిక్‌, అది కూడా టెస్టుల్లో, అందులోనా చాలా తక్కువ టైమ్‌లో రివెంజ్‌ తీర్చుకున్నాడు.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో అప్పటి టీమిండియా కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనిని ఇన్నింగ్స్‌ 88వ ఓవర్‌ మూడో బంతికి అవుట్‌ చేసి బ్రాడ్‌.. ఆ మరుసటి బంతుల్లో హర్భజన్‌ సింగ్‌, ప్రవీణ్‌ కుమార్‌లను అవుట్‌ చేసి హ్యాట్రిక్‌ సాధించాడు. ఈ ఫీట్‌తో యువీ చేసిన డ్యామేజ్‌ను బ్రాడ్‌ కాస్త కవర్‌ చేసుకున్నాడనే చెప్పాలి. ఇక ఆ మ్యాచ్‌లో బ్రాడ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలవడం విశేషం. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 221 పరుగులకే ఆలౌట్‌ కాగా.. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 288 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది.

భారత్‌ ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో బ్రాడ్ ఏకంగా 6 వికెట్లతో సత్తా చాటాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో చెలరేగిన ఇంగ్లండ్‌ బ్యాటర్లు భారీ స్కోర్‌ చేశారు. 544 చేసి భారీ లీడ్‌ సాధించి, ఇండియాను రెండో ఇన్నింగ్స్‌లో 158 పరుగులకే కుప్పకూల్చి.. 319 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్‌ గెలిచింది. ఈ మ్యాచ్‌లో బ్రాడ్‌ మొత్తం 8 వికెట్లు పడగొట్టాడు. కాగా, స్టువర్ట్‌ బ్రాడ్‌ తాజాగా తన అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. మరి టీమిండియాపై బ్రాడ్‌ తీర్చుకున్న ప్రతీకారంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: టీమిండియా క్రికెటర్లకు అహంకారం ఎక్కువైంది: మాజీ కెప్టెన్‌

Show comments