క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్‌కు సర్వం సిద్ధమైంది. మరో ఐదు రోజుల్లో ఈ మెగా టోర్నమెంట్ ఆరంభం కానుంది. ఈసారి కప్‌ను ఎగరేసుకుపోవాలని అన్ని జట్లు కృతనిశ్చయంతో ఉన్నాయి. ఇలాంటి టైమ్‌లో టోర్నీ డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంకకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టులోని ఇద్దరు కీలక ప్లేయర్లకు కరోనా సోకిందని వార్తలు వస్తున్నాయి. ఆవిష్క ఫెర్నాండోతో పాటు కుశాల్ పెరీరాకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని క్రికెట్ వర్గాల సమాచారం. ఇప్పటికే లంక స్టార్ ప్లేయర్ వనిందు హసరంగ గాయంతో టోర్నీలో ఆడేదీ లేనిదీ అనుమానంగా మారింది.
గాయంతో బాధపడుతున్న హసరంగ ఆసియా కప్‌కు దూరమవ్వడంతో ఆందోళనలో ఉన్న శ్రీలంక మేనేజ్మెంట్కు.. ఇద్దరు కీలక ఆటగాళ్లు కరోనా బారిన పడటంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు గణనీయ స్థాయిలో తగ్గాయి. అయితే లంక ఓపెనర్ ఆవిష్క ఫెర్నాండోతో పాటు వికెట్ కీపర్ కుశాల్ పెరీరాకు కరోనా లక్షణాలు కనిపించడం కలకలం రేపింది. టీమ్ మేనేజ్మెంట్ నిర్వహించిన పరీక్షల్లో వీళ్లిద్దరికీ కొవిడ్ పాజిటివ్‌గా తేలిందట. దీంతో అప్రమత్తమైన జట్టు యాజమాన్యం.. మిగతా ప్లేయర్లు కరోనా బారిన పడకుండా జాగ్రత్త చర్యలు తీసుకుందని తెలుస్తోంది.
ఇక, ప్రతిష్టాత్మక ఆసియా కప్ ఆగస్టు 30వ తేదీ నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు జరగనుంది. ఈసారి టోర్నమెంట్ హైబ్రిడ్ మోడల్లో జరగనుంది. వాస్తవానికి ఆసియా కప్ పాకిస్థాన్‌లోనే జరగాల్సి ఉంది. కానీ భారత్ అభ్యంతరం చెప్పడంతో హైబ్రిడ్ మోడల్ ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. దీంతో పాక్‌లో 4 మ్యాచులు, లంకలో 9 మ్యాచులు నిర్వహించనున్నారు. టీమిండియా ఆడే మ్యాచులన్నీ లంకలోనే జరగనున్నాయి. ఈ టోర్నీలో మొదటి మ్యాచ్ పాకిస్థాన్, నేపాల్ జట్ల మధ్య జరగనుంది. అయితే లంక టీమ్ ఆగస్టు 31న బంగ్లాదేశ్‌తో తమ ఫస్ట్ మ్యాచ్ ఆడనుంది. అప్పటివరకు ఆవిష్క ఫెర్నాండో, కుశాల్ పెరీరా కోలుకోవాలని ఆ టీమ్ ఆశిస్తోంది. ఒకవేళ కోలుకోకపోతే మాత్రం వారి స్థానంలో ఇతర ఆటగాళ్లను తీసుకోవాల్సి ఉంటుంది.
Tough blow for Sri Lanka as two Sri Lankan batsmen tested positive for Covid-19.#srilanka #kusalperera #bigbreaking #cricketnews #breakingnews #kusalperera #avishkafernando #covid19 #cricketgyan pic.twitter.com/0ktauUBcRo
— Cricket Gyan (@cricketgyann) August 25, 2023