యాషెస్ సిరీస్.. ఓ టెస్ట్ సిరీస్ లా కాకుండా యుద్ధంలా సాగుతూ ఉంటుంది. ఇప్పుడే కాదు.. యాషెస్ మెుదలైనదగ్గర్నించి ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య సమరం సాగుతూనే ఉంది. ఇక ఈ సిరీస్ ను గెలుచుకోవాలని ఇరు జట్లు ప్రతిసారి హోరాహోరిగా తలపడుతూనే ఉంటాయి. ఇంతటి చరిత్ర కలిగింది కాబట్టే.. అభిమానులు ఈ సమరాన్ని చూడ్డానికి ఎంతో ఆసక్తిని కనబరుస్తుంటారు. అందుకు తగ్గట్లుగానే తాజా యాషెస్ సిరీస్ సాగుతోంది. ఇక ఈ సిరీస్ లో ఇప్పటికే రెండు మ్యాచ్ లు జరగ్గా.. రెండు మ్యాచ్ ల్లోనూ వివాదాస్పద సంఘటనలు జరిగాయి.
బెయిర్ స్టో రనౌట్.. అవుటా? కాదా? క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడిదే మిస్టరీ ప్రశ్న. ఈ రనౌట్ పై ఇప్పటికే పలు దేశాల దిగ్గజాలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. వారితో పాటుగా ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, ఆసీస్ సారథి ప్యాట్ కమ్మిన్స్ కూడా తమ స్పందన తెలియజేశారు. ఈ వివాదంలో ఆయా దేశాల ప్రధానులు కూడా తమ ఆటగాళ్లను వెనకేసుకురావడం విశేషం. ఇక బెయిర్ స్టోను అన్యాయంగా అవుట్ చేశారని, ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్దమని ఇంగ్లీష్ మీడియా పేర్కొంటూ.. ఆసీస్ ఆటగాళ్లపై విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే బెయిర్ స్టో అవుట్ పై ఆసీస్ లెజండరీ అంపైర్ సైమన్ టాఫెల్ స్పందించాడు. అసలు ఈ ఔట్ విషయంలో తప్పుఎవరిది అనే దానిపై క్లారిటీ ఇచ్చాడు.
ఈ విషయంపై సైమన్ టాఫెల్ మాట్లాడుతూ..”అంపైర్లు తీసుకున్న నిర్ణయాన్ని ఇంగ్లాండ్ కచ్చితంగా స్వీకరించాలి. ఆస్ట్రేలియా ఎలాంటి తప్పు చేయలేదు. ఈ విషయంలో అంపైర్ తీసుకున్న నిర్ణయం సరైనదే. కానీ అది ఇంగ్లాండ్ జట్టుకు నచ్చలేదు. ఇక రెండు టీమ్స్ బంతిని వదిలేసే వరకు బంతి డెడ్ కాదు. ఓవర్ పూర్తి అయ్యింది అనుకోవాలన్నా.. బంతి డెడ్ అనుకోవాలన్నా.. ఎప్పుడైనా రెండు జట్లు బంతిని వదిలేయాలి. అప్పుడే బాల్ డెడ్ అయినట్లు” అని సైమన్ టాఫెల్ స్పష్టం చేశాడు. ఏది ఏమైనప్పటికీ ఈ గొడవ యాషెస్ సిరీస్ లో మరింత హీట్ ను పెంచిందనే చెప్పాలి. కాగా.. ఇప్పటికే ఇంగ్లాండ్ ఈ సిరీస్ లో 0-2తో వెనకబడింది. దాంతో ఎలాగైనా మూడో టెస్ట్ లో గెలిచి సిరీస్ ఆసీస్ ఆధిక్యాన్ని తగ్గించాలని భావిస్తోంది. మరి బెయిర్ స్టో ఔట్ వివాదంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Now dont say Simon Taufel doesnt know the rules pic.twitter.com/h00EGTUwqq
— Ramkrishna Iyer (@KannanK51531500) July 3, 2023