iDreamPost

కోహ్లీలా ఆడే మొనగాడు ఈ ప్రపంచంలోనే మరొకడు లేడు: పాక్‌ స్టార్‌ క్రికెటర్‌

  • Published Sep 01, 2023 | 8:29 AMUpdated Sep 01, 2023 | 8:29 AM
  • Published Sep 01, 2023 | 8:29 AMUpdated Sep 01, 2023 | 8:29 AM
కోహ్లీలా ఆడే మొనగాడు ఈ ప్రపంచంలోనే మరొకడు లేడు: పాక్‌ స్టార్‌ క్రికెటర్‌

క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన మినీ వరల్డ్‌ కప్‌గా భావించే ఆసియా కప్‌ 2023 అట్టహాసంగా ప్రారంభం అయిపోయింది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు కూడా జరిగిపోయాయి. ఇక ఈ టోర్నీకే హైలెట్‌గా నిలిచే సూపర్‌ డూపర్‌ ఫైట్‌ అయిన ఇండియా వర్సెస్‌ పాకిస్థాన్‌ మ్యాచ్‌కు రంగం సిద్ధమైపోయింది. శ్రీలంకలోని పల్లెకలె వేదికగా భారత్‌-పాక్‌ జట్లు రేపు(శనివారం) తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు ఉండే క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అయితే.. ఈ మ్యాచ్‌కు ముందు భారత్‌-పాక్‌ ఆటగాళ్ల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో మాటల యుద్ధం జరుగుతుందేమోనని క్రికెట్‌ అభిమానులు భావిస్తే.. అందుకు భిన్నంగా పాక్‌ ఆటగాళ్ల నుంచి విరాట్‌ కోహ్లీపై పొగడ్తల వర్షం కురుస్తోంది. గతంలో పాకిస్థాన్‌ ఆటగాళ్లు మ్యాచ్‌కి ముందు కవ్వింపు కామెంట్లకు పాల్పడే వారు. సచిన్‌ను ఫస్ట్‌ బాల్‌కే అవుట్‌ చేస్తాం, గంగూలీని గాయపరుస్తాం అంటూ హెచ్చులకు పోయేవారు. కానీ, ఇప్పుడు పాకిస్థాన్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ షాదాబ్‌ ఖాన్‌ అందుకు పూర్తి భిన్నంగా.. విరాట్‌ కోహ్లీ లాంటి ప్లేయర్‌ ప్రపంచంలో లేడంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

గతేడాది ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 వరల్డ్‌ కప్ 2022లో భాగంగా.. భారత్‌-పాక్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ ఆడిన 82 పరుగుల ఇన్నింగ్స్‌ అతని టీ20 కెరీర్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌గా నిలిచిపోయింది. 8 బంతుల్లో 28 పరుగులు కావాల్సిన దశలో హరీస్‌ రౌఫ్‌ బౌలింగ్‌లో రెండు సిక్సులు బాది మ్యాచ్‌ను భారత్‌ వైపు తిప్పడమే కాకుండా చివరి వరకు క్రీజ్‌లో ఉండి మ్యాచ్‌ను గెలిపించాడు. ఆ ఇన్నింగ్స్‌ గురించి షాదాబ్‌ మాట్లాడుతూ.. ‘అదో నమ్మశక్యం కాని ఇన్నింగ్స్‌. కోహ్లీ మా నుంచి మ్యాచ్‌ను లాక్కుని ఇండియాను గెలిపించాడు. బహుషా అలాంటి ఇన్నింగ్స్‌ కోహ్లీ తప్పితే ప్రపంచంలో మరే ఆటగాడు కూడా ఆడలేడు. కోహ్లీ.. ఎలాంటి సిచ్చువేషన్‌లోనైనా ఇలాంటి బ్యాటింగ్‌ చేయగలడు. అది కోహ్లీ బ్యూటీ’ అని అన్నాడు. మరి మ్యాచ్‌కి ముందు పాక్‌ ఆటగాడి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలయిజేయండి.

ఇదీ చదవండి: భారత రత్న అందుకున్న నువ్వు ఇలా చేస్తావా? సచిన్‌పై MLA ఫైర్‌

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి