చివరి బాల్‌ సిక్స్‌తో థ్రిల్లింగ్‌ విక్టరీ కొట్టిన ముంబై ఇండియన్స్‌

S Sanjana, WPL 2024: చివరి బాల్‌కు సిక్స్‌ కొట్టి మ్యాచ్‌ గెలిపిస్తే.. ఆ కిక్కే వేరు. అలాంటిది ఒక మెగా లీగ్‌ తొలి మ్యాచ్‌లోనే అలాంటి థ్రిల్లింగ్‌ విక్టరీ అందిస్తే.. అబ్బో ఆ సంతోషం మామూలుగా ఉండదు. ఆ మ్యాచ్‌ గురించి, ఆ సంతోషం గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

S Sanjana, WPL 2024: చివరి బాల్‌కు సిక్స్‌ కొట్టి మ్యాచ్‌ గెలిపిస్తే.. ఆ కిక్కే వేరు. అలాంటిది ఒక మెగా లీగ్‌ తొలి మ్యాచ్‌లోనే అలాంటి థ్రిల్లింగ్‌ విక్టరీ అందిస్తే.. అబ్బో ఆ సంతోషం మామూలుగా ఉండదు. ఆ మ్యాచ్‌ గురించి, ఆ సంతోషం గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2024లో ఆరంభం అదిరిపోయింది. చివరి వరకు నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన మ్యాచ్‌లో ఊహించని విధంగా.. చివరి బాల్‌కు సిక్స్‌తో మ్యాచ్‌ ముగిసింది. ఈ సూపర్‌ థ్రిల్లింగ్‌ మ్యాచ్‌కు బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం వేదకైంది. శుక్రవారం బాలీవుడ్‌ స్టార్ల ఆటాపాటతో అంగరంగ వైభవంగా ప్రారంభమైన డబ్ల్యూపీఎల్‌ 2024 సీజన్‌ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్లు తపలడ్డాయి. ఈ మ్యాచ్‌లో చివరి బాల్‌కు 5 పరుగులు కావాల్సిన దశలో అప్పుడే క్రీజ్‌లోకి వచ్చి.. ఒక్క బాల్‌ కూడా ఆడని బ్యాటర్‌ సజనా సూపర్‌ సిక్స్‌తో మ్యాచ్‌ గెలిపించి.. సంచలనం సృష్టించింది. తొలి మ్యాచ్‌లోనే ఇలాంటి థ్రిల్లింగ్‌ ఎండింగ్‌ లభించడంతో డబ్ల్యూపీఎల్‌కు సూపర్‌ స్టార్ట్‌ దక్కినట్లు అయింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. టాస్‌ గెలిచిన ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌.. ఢిల్లీ జట్టును తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు సబ్నిమ్‌ ఇస్మాయిల్‌ ఊహించని షాకిచ్చింది. ఢిల్లీ స్టార్‌ ఓపెనర్‌ షఫాలీ వర్మను క్లీన్‌ బౌల్డ్‌ చేసింది. దీంతో ఢిల్లీ కేవలం 3 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయింది. కానీ, కెప్టెన్‌ మెగ్ లానింగ్, వన్‌ డౌన్‌లో వచ్చిన ఆలిస్ క్యాప్సే మంచి భాగస్వామ్యం నమోదు చేసి.. ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. లానింగ్‌ 31 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ 11వ ఓవర్‌లో అవుట్‌ అయింది. ఆలిస్ క్యాప్సే మాత్రం.. ముంబై బౌలర్లపై ఎదురుదాడికి దిగి.. 53 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సులతో 75 పరుగులు చేసి అదరగొట్టింది. అలాగే టీమిండియా స్టార్‌ జెమిమా రోడ్రిగ్స్ 24 బంతుల్లోనే 5 ఫోర్లు, 2 సిక్సులతో 42 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్‌ ఆడింది. మరిజెన్నె కాప్‌ 16, సుథర్‌లాండ్‌ ఒక రన్‌ చేశారు. మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఢిల్లీ 171 పరుగుల మంచి స్కోరే చేసింది.

ఇక 172 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు ఇన్నింగ్స్‌ రెండో బంతికే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్‌ బ్యాటర్‌ హేలీ మ్యాథ్యూస్‌ డకౌట్‌ అయింది. కానీ, మరో ఓపెనర్‌ యాస్తికా భాటియా 57 పరుగులతో, కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 55 పరుగులతో ముంబైని విజయం వైపు నడిపించారు. మధ్యలో నాట్ స్కివర్-బ్రంట్ 19 పరుగులు చేసి అవుటైనా.. భాటియా 45 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సులతో 57, కౌర్‌ 34 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్‌తో 55 రన్స్‌ చేసి రాణించారు. వీరితో పాటు అమిలియా కేర్‌ 18 బంతుల్లో 3 ఫోర్లతో 24 పరుగులు చేసి పర్వాలేదనిపించింది. కానీ, చివరి రెండు బంతుల్లో 5 పరుగులు కావాల్సిన సమయంలో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ అవుట్‌ కావడంతో మ్యాచ్‌లో ఊహించని మలుపు చోటు చేసుకుంది. ఇక ఇన్నింగ్స్‌ చివరి బాల్‌కు 5 రన్స్‌ కావాలి. క్రీజ్‌లోకి కొత్త బ్యాటర్‌ ఎస్‌ సజనా వచ్చింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య చివరి బాల్‌ను లాంగ్‌ ఆన్‌ వైపు భారీ సిక్స్‌ బాది.. ముంబైకి సూపర్‌ థ్రిల్లింగ్‌ విక్టరీ అందించి.. సజనా ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిపోయింది. మొత్తంగా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసి ముంబై తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది. మరి ఈ మ్యాచ్‌లో చివరి బాల్‌కు సిక్స్‌ కొట్టి ముంబైని గెలిపించిన సజనాపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments