iDreamPost
android-app
ios-app

పాకిస్థాన్‌కు సరైనోడు కోహ్లీ కాదు! రోహిత్‌ శర్మనే.. ఈ లెక్కలు చూడండి

  • Published Sep 01, 2023 | 2:27 PM Updated Updated Sep 01, 2023 | 2:27 PM
  • Published Sep 01, 2023 | 2:27 PMUpdated Sep 01, 2023 | 2:27 PM
పాకిస్థాన్‌కు సరైనోడు కోహ్లీ కాదు! రోహిత్‌ శర్మనే.. ఈ లెక్కలు చూడండి

ఆసియా కప్‌ 2023లో భాగంగా హైఓల్టేజ్‌ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఏ రెండు జట్లు ఆడితే.. క్రికెట్‌, ఆట స్థాయి దాటి యుద్ధంలా మారుతుందో.. ఆ రెండు జట్లు సమరానికి రె‘ఢీ’ అంటున్నాయి. ఇండియా-పాకిస్థాన్‌ జట్లు రేపు శ్రీలంకలోని పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో తలపడనున్నాయి. ఈ దాయాదుల పోరు కోసం క్రికెట్‌ ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మినీ యుద్ధాన్ని తలపించే భారత్‌-పాక్‌ మ్యాచ్‌ కోసం క్రికెట్‌ అభిమానుల్లో ఎలాంటి క్రేజ్‌ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పైగా ఈ రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదనే విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ, ఏసీసీ ఈవెంట్స్‌లో మాత్రమే భారత్‌-పాక్‌ జట్లు పోటీ పడుతున్నాయి. దీంతో ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ అంటే ఉండే క్రేజ్‌ మరింత పెరిగింది.

ఈ క్రమంలో ఆసియా కప్‌ నేపథ్యంలో శనివారం భారత్‌-పాక్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది. అయితే.. ఈ మ్యాచ్‌కి ముందు ఇరు జట్ల బలాబలాలపై తీవ్ర చర్చ జరుగుతోంది. పాకిస్థాన్‌ బౌలింగ్‌కు టీమిండియా బ్యాటింగ్‌ మధ్య జరిగే పోరుగా చాలా మంది ఈ ‍మ్యాచ్‌ను విశ్లేషిస్తున్నారు. పాకిస్థాన్‌కు బలమైన బౌలింగ్‌ ఎటాక్ ఉందని, దాన్ని ఎదుర్కొవడానికి టీమిండియా వద్ద కూడా హేమాహేమీ బ్యాటర్లు ఉన్నారంటూ క్రికెట్‌ అభిమానులు ఎవరి అంచనాలు వాళ్లు వేసుకుంటున్నారు. షాహీన్‌ షా అఫ్రిదీ, నసీమ్‌ షా, హరీస్‌ రౌఫ్‌ లాంటి బౌలర్లకు కోహ్లీ ఒక్కడే చాలాని భారత క్రికెట్‌ అభిమానులు అంటున్నారు.

మొన్నామధ్య భారత చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ సైతం పాక్‌ బౌలింగ్‌ ఎటాక్‌ను కోహ్లీ చూసుకుంటాడని చేసిన కామెంట్‌ ఏ రేంజ్‌లో వైరల్‌ అయింది అందరికీ తెలిసిందే. టీ20 వరల్డ్‌ కప్‌ 2022 సందర్భంగా కోహ్లీ ఆడిన 82 పరుగుల ఇన్నింగ్స్‌, హరీస్‌ రౌఫ్‌ బౌలింగ్‌లో కొట్టిన రెండు వరుస సిక్సర్లను ఉదాహరణగా చూపిస్తూ.. పాకిస్థాన్‌కు సరైన మొగుడు కోహ్లీనే అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కానీ, కొన్ని లెక్కలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. పాకిస్థాన్‌కు సరైనోడు కోహ్లీ కాదని, టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అని చెబుతున్నాయి.

ఆ లెక్కలేంటో ఇప్పుడు చూద్దాం.. భారత్‌-పాక్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లోల ఇప్పటి వరకు కోహ్లీ 48.72 సగటుతో 536 పరుగులు చేశాడు. అందులో రెండు సెంచరీలు, రెండు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. కానీ రోహిత్‌ శర్మ 51.42 సగటుతో 720 పరుగులు చేశాడు. అందులో 6 హాఫ్‌ సెంచరీలు, రెండు సెంచరీలు ఉన్నాయి. ఈ లెక్కన పాకిస్థాన్‌పై వన్డేల్లో రోహిత్‌ శర్మే మెరుగ్గా ఉన్నాడు. టీ20 వరల్డ్‌ కప్‌ 2021, 22లో రోహిత్‌ విఫలమైనంత మాత్రనా అతన్ని తక్కువగా అంచనా వేయాల్సిన అవసరం లేదు. వన్డేల విషయానికి వస్తే.. కోహ్లీ కంటే రోహిత్‌ శర్మనే పాకిస్థాన్‌కు సరైన మొగుడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: అతనికి అంత సీన్‌ లేదు.. రోహిత్‌ ఇరగదీస్తాడు: గంగూలీ