వీడియో: విరాట్‌ కోహ్లీ సెంచరీని అడ్డుకున్న బాహుబలి

వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. పటిష్టమైన భారత్‌కు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయిన కరేబియన్‌ టీమ్‌.. మూడు రోజులకే చాపచుట్టేసింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ను అశ్విన్‌, జడేజాలు 150 పరుగులకే కుప్పకూలిస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్లు.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఇద్దరూ సెంచరీలతో సత్తాచాటి తొలి వికెట్‌కు 229 పరుగుల రికార్డు భాగస్వామ్య నెలకొల్పారు. ఇక వీరి సూపర్‌ స్టార్ట్‌ను స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ కొనసాగించాడు. రోహిత్‌ శర్మ 103 పరుగులు చేసి అవుటైన తర్వాత.. గిల్‌(6) నిరాశపర్చినా.. కోహ్లీ, యశస్వికి అండగా నిలబడ్డాడు. ఇద్దరూ కలిసి రెండో రోజు ఆటను ముగించారు. ఇక మూడో రోజు కూడా తన జోరు కొనసాగించిన జైస్వాల్‌.. 171 పరుగులతో తన అరంగేట్రం మ్యాచ్‌లోనే అదరగొట్టాడు.

మూడో రోజు కోహ్లీ సెంచరీ మ్యాచ్‌కు హైలెట్‌గా నిలుస్తుందని అంతా భావిస్తే.. వెస్టిండీస్‌ ‘బాహుబలి’ రహ్కీమ్‌ కార్న్‌వాల్‌ ఇండియన్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఆశలపై నీళ్లు చల్లాడు. ప్రపంచ క్రికెట్‌లోనే అత్యుత్తమ బ్యాటర్‌గా ఉన్న విరాట్‌ కోహ్లీ.. విండీస్‌ బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా, పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలించకపోయినా, తన స్టైల్‌ను మార్చి నిదానంగా బ్యాటింగ్‌ చేస్తుంటే.. తన సాధారణ స్పిన్‌తో కింగ్‌ కోహ్లీనే బోల్తా కొట్టించాడు. ఈ మ్యాచ్‌లో కార్న్‌వాల్‌ చేసిన అద్భుతం ఏదైనా ఉందంటే.. అది కోహ్లీ వికెట్‌ తీసుకోవడమే. మ్యాచ్‌ మొత్తానికి యశస్వి ఇన్నింగ్స్‌, అశ్విన్‌ స్పిన్‌ మ్యాజిక్‌ హైలెట్‌గా నిలిస్తే.. విండీస్‌కు మాత్రం కార్న్‌వాల్‌ కోహ్లీ వికెట్‌ తీసుకోవడం హైలెట్‌గా నిలిచింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ను భారత బౌలర్లు 150 పరుగులకే కుప్పకూల్చారు. అశ్విన్‌ 5, జడేజా 3 వికెట్లతో సత్తా చాటారు. సిరాజ్‌, శార్దుల్‌ చెరో వికెట్‌ తీసుకున్నారు. ఇక తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్‌ శర్మ(103), యశస్వి జైస్వాల్‌(171) అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కు ఇద్దరు కలిసి 229 పరుగులు జోడించడంతో టీమిండియా భారీ స్కోర్‌ చేసింది. కోహ్లీ 76 రన్స్‌తో రాణించాడు. 5 వికెట్ల నష్టానికి 421 పరుగులు చేసి టీమిండియా ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసి విండీస్‌ను రెండో ఇన్నింగ్స్‌ను ఆహ్వానించింది. మరోసారి అశ్విన్‌ స్పిన్‌ మ్యాజిక్‌ ప్రదర్శించాడు. ఈ సారి విండీస్‌ 130 రన్స్‌కే చాపచుట్టేసింది. దీంతో భారత్‌ ఇన్నింగ్స్‌ 141 పరుగుల తేడా ఘనవిజయం సాధించింది. డెబ్యూ ప్లేయర్‌ యశస్వి జైస్వాల్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు లభించింది. మరి ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం, కోహ్లీని విండీస్‌ బాహుబలి కార్న్‌వాల్‌ అవుట్‌ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: విండీస్‌పై ఘనవిజయం! రికార్డుల మోత మోగిపోయింది

Show comments