ఇంజమామ్​ ఉల్ హక్​ను తలపించిన విండీస్ బాహుబలి.. అచ్చం అదే తరహాలో..!

  • Author singhj Published - 03:52 PM, Fri - 18 August 23
  • Author singhj Published - 03:52 PM, Fri - 18 August 23
ఇంజమామ్​ ఉల్ హక్​ను తలపించిన విండీస్ బాహుబలి.. అచ్చం అదే తరహాలో..!

క్రికెట్​లో బ్యాట్స్​మెన్ రనౌట్ అవడం సర్వసాధారణమే. తోటి బ్యాటర్​తో సమన్వయ లోపం వల్ల ఎక్కువగా రనౌట్ అవుతుంటారు. లేనిపోని రన్ కోసం పరిగెత్తి ఔటై ఆటగాళ్లు పెవిలియన్​కు చేరడమూ చూస్తూనే ఉంటాం. ఒక్కోసారి ఫీల్డర్ల అద్భుతమైన త్రోలకు కూడా బ్యాట్స్​మెన్ వెనుదిరగాల్సి వస్తుంది. రనౌట్​ల వల్ల మ్యాచ్ ఫలితాలు తారుమారైన సందర్భాలు కోకొల్లలు. ఫిట్​నెస్ ఎంతో కీలకమైన క్రికెట్​లో కొందరు ఆటగాళ్లు బద్దకం కారణంగా ఔటవ్వడం చూసే ఉంటారు. అందులో ముఖ్యంగా పాకిస్థాన్ లెజెండ్ ఇంజమామ్ ఉల్ హక్ గురించి చెప్పుకోవాలి.

పాక్ దిగ్గజ బ్యాట్స్​మెన్​లో ఒకరైన ఇంజమామ్​ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే వికెట్ల మధ్య పరుగులు తీయడంలో మాత్రం ఆయన చాలా ఇబ్బంది పడేవాడు. ఎక్కువగా ఫోర్లు కొట్టడం మీదే దృష్టి సారించేవాడు. వేరే బ్యాట్స్​మెన్​తో పోటీపడి పరిగెత్తలేక ఇంజమామ్ అవుటైన సందర్భాలు ఉన్నాయి. అదే సమయంలో అతడి బద్దకం కారణంగా ఇతర బ్యాట్స్​మెన్ పెవిలియన్​కు చేరిన సందర్భాలూ ఉన్నాయి. అలాంటి ఇంజమామ్​ను గుర్తుచేశాడు వెస్టిండీస్ క్రికెటర్ రఖీమ్ కార్న్​వాల్. వరల్డ్ క్రికెట్​లో భారీకాయుడైన కార్న్​వాల్​కు ఫిట్​నెస్ పెద్ద సమస్యగా మారింది.

దాదాపుగా 6 అడుగుల ఆరు అంగుళాల ఎత్తు ఉండే కార్న్​వాల్.. 140కి పైగా కిలోల బరువు ఉంటాడు. మరోసారి ఫిట్​నెస్ దెబ్బకు అతడు బలైపోయాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్​లో భాగంగా సెయింట్ లూసియాతో జరిగిన మ్యాచ్​లో బార్బడోస్​ రాయల్స్​కు ఆడుతున్న కార్న్​వాల్ రనౌట్​గా వెనుదిరిగాడు. అతడు కొట్టిన ఒక షాట్​ను ఫీల్డర్ అందుకోలేకపోవడంతో నాన్​స్ట్రైక్​లో ఉన్న కైల్ మైర్స్ రన్ కోసం పరిగెత్తాడు. అవతలి ఎండ్​లో ఉన్న మైర్స్ కీపర్​ సైడ్ చేరుకున్నాడు. కానీ కార్న్​వాల్ వేగంగా పరిగెత్తలేకపోయాడు. ఫీల్డర్ డైరెక్ట్ త్రో చేయడంతో అతడు రనౌట్​గా వెనుదిరిగాడు. ఈ రనౌట్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో పాపం.. కార్న్​వాల్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అతడ్ని ఇంజమామ్​తో పోలుస్తున్నారు.

Show comments