వరుస సెంచరీలు! కట్‌ చేస్తే.. టోర్నీ నుంచి ఔట్‌! పాపం పృథ్వీ షా

టీమిండియా యువ క్రికెటర్‌ పృథ్వీ షాను దురదృష్టం దారుణంగా వెంటాడుతోంది. 17 ఏళ్ల వయసులోనే టీమిండియాలోకి ఉప్పెనలా దూసుకొచ్చిన ఈ కుర్రాడు.. తొలి టెస్టులోనే సెంచరీతో జూనియర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌గా పేరుతెచ్చుకున్నాడు. కానీ, ఎక్కువ కాలం టీమ్‌లో నిలువలేకపోయాడు. ఆ తర్వాత భారత జట్టుకు యువ క్రికెటర్ల నుంచి పోటీ ఊహించని స్థాయిలో పెరిగింది. ప్రతి మ్యాచ్‌లో రాణిస్తే తప్ప జట్టులో చోటు దక్కని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పోటీని తట్టుకోలేక.. వర్క్‌లోడ్‌ మేనేజ్‌మెంట్‌ పేరుతో బీసీసీఐ రెండు టీమ్‌లతో మ్యాచ్‌లు ఆడిస్తుంది.

అయితే.. ప్రస్తుతం పృథ్వీ షా వయసు కేవలం 23 ఏళ్లే కావడంతో తిరిగి జట్టులోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. టీమిండియాలో చోటు కోల్పోయిన తర్వాత దేశవాళీ క్రికెట్‌లో విశేషంగా రాణించినా.. పృథ్వీ షాకు జాతీయ జట్టులో మళ్లీ చోటు దక్కలేదు. అప్పటికే టీమ్‌లో ఉన్న యువ క్రికెటర్లు, సీనియర్లు నిలకడగా రాణిస్తుండటం షాకు అవకాశాలు లేకుండా చేసింది. దేశవాళీ క్రికెట్‌లో రాణించిన పృథ్వీ షా.. ఐపీఎల్‌లో మాత్రం నిరాశపర్చడం కూడా టీమిండియాలో చోటు దక్కకపోవడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. యువ క్రికెటర్లను ముఖ్యంగా టీ20లకే ఎక్కువ ఎంపిక చేస్తున్న తరుణంలో షా.. టీ20ల్లో విఫలం అయ్యాడు.

ఇక వన్డే, టెస్టు జట్టులోకి వచ్చేందుకు ఫోకస్‌ పెట్టిన షా.. అందుకోసం ఇంగ్లండ్‌లో జరిగే కౌంటీ క్రికెట్‌ను వేదికగా ఎంచుకున్నాడు. ఇంగ్లండ్‌ దేశవాళీ వన్డే కప్‌లో ఆడేందుకు తొలిసారి వెళ్లిన షా.. నార్తాంప్టన్‌షైర్‌ జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లో నిరాశపర్చినా.. రెండో మ్యాచ్‌లో చరిత్ర సృష్టించాడు. ఏకంగా 244 పరుగులతో దుమ్ములేపాడు. ఆ వెంటనే మరో మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టాడు. ఇలా వరుస సెంచరీలతో ఫామ్‌లోకి వచ్చిన పృథ్వీ షా.. టీమిండియాలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నట్లు కనిపించాడు. కానీ, ఇంతలోనే అతనికి మోకాలికి గాయమైంది. దీంతో అతను టోర్నీ నుంచి తప్పుకున్నాడు. దీంతో మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో ఇలాంటి గాయాలు ఏంటి? ఇంతకంటే దురదృష్టం ఉండదంటూ క్రికెట్‌ అభిమానులు బాధను వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ప్రాక్టీస్ ప్రారంభించిన బుమ్రా.. పేసు గుర్రాన్ని ఎదుర్కోలేక వణికిన బ్యాటర్లు!

Show comments