iDreamPost

ప్రాక్టీస్ ప్రారంభించిన బుమ్రా.. పేసు గుర్రాన్ని ఎదుర్కోలేక వణికిన బ్యాటర్లు!

  • Author singhj Published - 07:41 PM, Wed - 16 August 23
  • Author singhj Published - 07:41 PM, Wed - 16 August 23
ప్రాక్టీస్ ప్రారంభించిన బుమ్రా.. పేసు గుర్రాన్ని ఎదుర్కోలేక వణికిన బ్యాటర్లు!

కరీబియన్ దీవుల పర్యటనను భారత జట్టు పేలవంగా ముగించింది. వెస్టిండీస్​తో జరిగిన ఐదు టీ20ల సిరీస్​ చివరి మ్యాచ్​లో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్​లో పరాభవంతో సిరీస్​ను విండీస్​ టీమ్​కు అప్పగించింది. జట్టులో స్టార్ బ్యాటర్లు, బౌలర్లు, ఆల్​రౌండర్లకు కొదవ లేకున్నా భారత్ సిరీస్ ఓడటంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. టీ20 వరల్డ్ కప్​తో పాటు వన్డే ప్రపంచ కప్​కు క్వాలిఫై కాలేకపోయిన వెస్టిండీస్ చేతిలో ఓటమిని టీమిండియా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ పరాభవానికి టీమ్ మేనేజ్​మెంట్​, ప్లేయర్ల ఫెయిల్యూర్​తో పాటు కెప్టెన్ హార్దిక్ పాండ్యాను టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగుతున్నారు. కాగా, విండీస్ టూర్ ముగియడంతో 3 మ్యాచ్​ల టీ20 సిరీస్​ ఆడేందుకు భారత జట్టు ఐర్లాండ్​కు చేరుకుంది.

ఐర్లాండ్​లో ఆగస్టు 18, 20, 23 తేదీల్లో జరిగే ఈ సిరీస్​ కోసం టీమిండియా ప్లేయర్లు ముమ్మరంగా సాధన చేస్తున్నారు. చిన్న టీమే కదా అని తేలిగ్గా తీసుకోకుండా నెట్స్​లో కఠోరంగా శ్రమిస్తున్నారు. ఈ సిరీస్​లో భారత్​కు సారథ్యం వహించనున్న పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా తగ్గేదేలే అనేలా నెట్స్​లో చెమటోడ్చుతున్నాడు. అతడికి సంబంధించిన ఓ వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో బుమ్రా పదునైన బంతులు వేస్తూ కనిపించాడు. బీసీసీఐ షేర్ చేసిన వీడియోను చూస్తుంటే.. రీఎంట్రీ ఇస్తున్న బుమ్రా మునుపటి వేగాన్ని, లయను అందిపుచ్చుకున్నట్లే కనిపిస్తున్నాడు. ప్రాక్టీస్​లో భాగంగా బ్యాట్స్​మెన్​కు నిప్పులు చెరిగే బంతులను సంధించాడతడు. పేసు గుర్రం బౌలింగ్​ను ఎదుర్కోలేక బ్యాటర్లు వణికిపోయారు. బుమ్రా పేస్​కు వారి దగ్గర జవాబే లేకుండా పోయింది.

దాదాపుగా ఒక సంవత్సర కాలంగా బంతి పట్టని బుమ్రా తిరిగి రిథమ్​ను అందుకోవడంతో బీసీసీఐ సంతోషం వ్యక్తం చేస్తూ దీనికి సంబంధించిన వీడియోను ఫ్యాన్స్​తో పంచుకుంది. బుమ్రా బౌలింగ్​ వీడియోతో పాటు రిషబ్ పంత్ బ్యాటింగ్ వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది. రోడ్డు ప్రమాదంలో గాయపడి క్రికెట్​కు దూరమైన పంత్​.. ఒక మ్యాచ్​లో బ్యాటింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్​చల్​ చేస్తోంది. గాయాల కారణంగా జట్టుకు దూరమైన కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్​ల ప్రాక్టీస్ వీడియోలు కూడా కొన్ని రోజుల కింద ఇలాగే వైరల్ అయ్యాయి. వీళ్లందరూ వన్డే వరల్డ్ కప్​ నాటికి తిరిగి టీమిండియాలో చేరితే మన జట్టును ఆపడం ఎవరికీ సాధ్యం కాదని ఫ్యాన్స్ అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి