iDreamPost
android-app
ios-app

ప్రపంచ క్రికెట్‌లో ఈ రికార్డ్‌ మరే క్రికెటర్‌కు లేదు! పృథ్వీ షా ఒక్కడే ఘనుడు

  • Published Aug 11, 2023 | 9:03 AM Updated Updated Aug 11, 2023 | 9:03 AM
  • Published Aug 11, 2023 | 9:03 AMUpdated Aug 11, 2023 | 9:03 AM
ప్రపంచ క్రికెట్‌లో ఈ రికార్డ్‌ మరే క్రికెటర్‌కు లేదు! పృథ్వీ షా ఒక్కడే ఘనుడు

టీమిండియా యువ క్రికెటర్‌ పృథ్వీ షా తాజాగా ఇంగ్లండ్‌ కౌంటీ క్రికెట్‌లో భాగంగా మెట్రో బ్యాంక్‌ వన్డే కప్‌లో ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో నార్తంప్టన్‌షైర్‌ జట్టుకు ఆడుతూ… సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా డబుల్‌ సెంచరీతో చెలరేగాడు. ఈ సంచలన ఇన్నింగ్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన పృథ్వీ షా.. ఓ అరుదైన ప్రపంచ రికార్డును సృష్టించాడు. రెండు దేశాల్లో లిస్ట్-ఏ క్రికెట్‌ ఆడి డబుల్‌ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా షా కొత్త చరిత్ర లిఖించాడు. ప్రపంచ క్రికెట్‌లో ఇలాంటి రికార్డు ఉన్న మరో ప్లేయర్‌ లేడు.

నార్తంప్టన్‌షైర్‌-సోమర్‌సెట్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో నార్తంప్టన్‌షైర్‌కు ఆడుతూ.. షా కేవలం 153 బంతుల్లోనే 28 ఫోర్లు, 11 సిక్సులతో 244 పరుగులతో విరుచుకుపడ్డాడు. సోమర్‌సెట్‌ బౌలర్లను చీల్చిచెండాడుతూ.. బౌండరీల వర్షం కురిపించాడు. పృథ్వీ షా ఊచకోతతో నార్తంప్టన్‌షైర్‌ 415 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. అలాగే సోమర్‌సెట్‌ను 87 పరుగుల తేడాతో ఓడించి ఘన విజయం సాధించింది. ఈ ఇన్నింగ్స్‌తో పాటు 2020-21 మన దేశవాళీ క్రికెట్‌లో భాగంగా జరిగే విజయ్ హజారే ట్రోఫీ‌లో ముంబై తరఫున ఆడుతూ.. పృథ్వీ షా 227 పరుగుల భారీ స్కోర్ చేసిన విషయం తెలిసిందే. ఇలా రెండు డబుల్‌ సెంచరీలతో లిస్ట్-ఏ క్రికెట్‌లో రెండు దేశాల్లో డబుల్‌ సెంచరీ చేసిన ఏకైక ప్లేయర్‌గా షా నిలిచాడు.

ఇక ఈ ఇన్నింగ్స్‌తో పృథ్వీ షా వరల్డ్‌ కప్‌ కోసం భారత జట్టులో స్థానంలో కోసం పోటీలోకి వచ్చాడనే ప్రచారం జరుగుతోంది. నిజానికి 2018లోనే పృథ్వీ షా భారత జట్టులోకి వచ్చాడు. తొలి టెస్టులోనే సెంచరీతో భవిష్యత్తు టీమిండియా స్టార్‌గా, జూనియర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌గా పేరుతెచ్చుకున్నాడు. 5 టెస్టులు, 6 వన్డేలు, ఒక టీ20 మ్యాచ్‌ తర్వాత టీమిండియాలో స్థానం కోల్పోయాడు. 2021లో టీమిండియా తరపున చివరి మ్యాచ్‌ ఆడాడు. ఆ తర్వాత మళ్లీ జట్టులోకి తిరిగి రాలేదు. కానీ, ఇప్పుడు మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. టీమిండియాలోకి వచ్చే విషయం అటుంచితే.. పృథ్వీ షా సాధించిన అరుదైన ఘనతపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: టీమిండియా సెలక్షన్ కమిటీపై రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!