iDreamPost
android-app
ios-app

ఆ ఒక్క నో బాల్‌ పడకపోయి ఉంటే.. పాక్‌ చేతిలో పరాజయం తప్పేది!

  • Published Jul 24, 2023 | 8:13 AMUpdated Jul 24, 2023 | 8:13 AM
  • Published Jul 24, 2023 | 8:13 AMUpdated Jul 24, 2023 | 8:13 AM
ఆ ఒక్క నో బాల్‌ పడకపోయి ఉంటే.. పాక్‌ చేతిలో పరాజయం తప్పేది!

తొలి సారి అంతర్జాతీయ టోర్నీలో ఆడిన యంగ్‌ టీమిండియా అంచనాలకు మించి రాణించింది. యశ్‌ ధుల్‌ కెప్టెన్సీలోని భారత-ఏ జట్టు ఏసీసీ ఆధ్వర్యంలో జరిగిన ఎమర్జింగ్‌ టీమ్స్‌ ఆసియా కప్‌ 2023లో ఫైనల్‌ వరకు అద్భుతంగా దూసుకెళ్లింది. కానీ, ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ చేతిలో ఓటమి పాలై నిరాశపర్చింది. ఆదివారం జరిగిన ఫైనల్లో టీమిండియా 128 పరుగుల భారీ తేడాతో పరాజయం పొందింది. టోర్నీ మొత్తం అద్భుతంగా ఆడిన యువ క్రికెటర్లు ఫైనల్లో ఒత్తిడిని తట్టుకోలేక చేతులెత్తేశారు. అయితే ఈ ఓటమికి ఓ నోబాల్‌ ప్రధాన కారణంగా నిలిచి టీమిండియా ఓటమిని శాసించింది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్‌ చేసేందుకు నిర్ణయించింది. కానీ, ఆ నిర్ణయం తప్పని కొద్ది సేపటికే అర్థమైంది. టాస్‌ ఓడినా తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్‌కు ఓపెనర్లు మంచి ఆరంభం అందించారు. అలాగే వారికి అదృష్టం కూడా కలిసి వచ్చింది. భారత పేసర్‌ రాజవర్దనే హంగార్గేకర్‌ వేసిన నో బాల్‌తో పాక్‌కు ఊపిరిపోశాడు. పాక్‌ ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్‌ చివరి బంతికి పాక్‌ ఓపెనర్‌ సైమ్‌ అయ్యూబ్‌ క్యాచ్‌ అవుట్‌ అయ్యాడు. కానీ అది నోబాల్‌ అని అంపైర్‌ ప్రకటించడంతో బతికిపోయాడు. అప్పటికీ అతను కేవలం 16 పరుగులు మాత్రమే చేశాడు. వచ్చిన ఈ అవకాశాన్ని రెండో చేతులతో ఒడిసిపట్టుకున్న అయ్యూబ్‌.. వెనక్కి తిరిగి చూడకుండా పాక్‌ ఇన్నింగ్స్‌ను పరుగులు పెట్టించాడు.

తాను హాఫ్‌ సెంచరీతో చెలరేగి.. మరో ఓపెనర్‌ సిహిబ్జాదా ఫర్హాన్‌తో కలిసి తొలి వికెట్‌కు 121 పరుగులు జోడించి, పాక్‌కు మంచి స్టార్ట్‌ ఇచ్చాడు. ఈ భారీ పార్టనర్‌షిప్‌ తర్వాత మిగతా పాక్‌ బ్యాటర్లు సైతం ఆకాశమే హద్దుగా చెలరేగారు. నిర్ణీత 50 ఓవర్లలో 352 పరుగులు భారీ స్కోర్‌ను టీమిండియా ముందు ఉంచారు. ఛేజింగ్‌కు దిగిన భారత కుర్రాళ్లు 40 ఓవర్లలో 224 పరుగులకు ఆలౌట్‌ అయి ఓడిపోయారు. అయితే ఈ మ్యాచ్‌ 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా ఓటమిని గుర్తు చేసింది. అప్పుడు కూడా పాకిస్థాన్‌ ఆటగాడు ఫకర్‌ జమాన్‌.. జస్ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌లో అవుటైనా అది నో బాల్‌ కావడంతో తప్పించుకున్నాడు. సెంచరీతో చెలరేగి టీమిండియా ఓటమిని శాసించాడు. ఇప్పుడు కూడా పాక్‌ దాదాపు అదే రితీలో మ్యాచ్‌ గెలిచి.. ఎమర్జింగ్‌ ఆసియా కప్‌ 2023 ఎగరేసుకుపోయింది.

ఫైనల్లో భారత కుర్రాళ్లు ఓడినా.. వారి టాలెంట్‌ను మాత్రం మెచ్చుకోవాల్సింది. ఇప్పటి వరకు వారికి అంతర్జాతీయ టోర్నీలో ఆడిన అనుభవం లేదు. అయినా ఫైనల్‌ వరకు అద్భుతంగా ఆడారు. ప్రస్తుతం ఉన్న ఈ టీమ్‌ను చూస్తుంటే భారత క్రికెట్‌ భవిష్యత్తుగా ఢోకా లేదనే విషయం అర్థమవుతుంది. ఇప్పుడు ఎదురైన ఈ ఓటమితో మానసికంగా ఈ యంగ్‌ టీమిండియా మరింత బలోపేతమై.. భవిష్యత్తులో ఇలాంటి మ్యాచ్‌లు ఎదురైనప్పుడు ఏమాత్రం ఒత్తిడి లేకుండా ఆడుతుందని క్రికెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: భారత కెప్టెన్‌కు భారీ జరిమానా విధించిన ఐసీసీ! 3 డీమెరిట్‌ పాయింట్లు కూడా..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి