టీమిండియాను ఓడించిన జట్టుదే వరల్డ్ కప్: వెటరన్ క్రికెటర్

  • Author singhj Published - 01:41 PM, Tue - 26 September 23
  • Author singhj Published - 01:41 PM, Tue - 26 September 23
టీమిండియాను ఓడించిన జట్టుదే వరల్డ్ కప్: వెటరన్ క్రికెటర్

వన్డే ప్రపంచ కప్ మహాసంగ్రామానికి మరికొన్ని రోజుల్లో తెరలేవనుంది. భారత్ ఆతిథ్యం ఇస్తున్న మెగా టోర్నీలో విజేతగా నిలవాలని అన్ని టీమ్స్ అనుకుంటున్నాయి. ఫుల్ ప్రిపరేషన్ మోడ్​లోకి వెళ్లిపోయిన జట్లు.. తమ బలాబలాలపై ఫోకస్ పెడుతున్నాయి. ఏ జట్టుపై ఎలా గెలవాలా అంటూ వ్యూహాలు రచిస్తున్నాయి. మరోవైపు ఈసారి ప్రపంచ కప్​ను ఎవరు గెలుచుకుంటారనే దానిపై రకరకాల ప్రెడిక్షన్స్ వినిపిస్తున్నాయి. దీనిపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్వదేశంలో జరుగుతున్న వరల్డ్ కప్​లో టీమిండియా విజేతగా నిలిచే అవకాశం ఉందన్నాడు.

ఈమధ్య కాలంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా ఇప్పుడు భారత జట్టు కనిపిస్తోంది. ఆసియా కప్​లో ప్రత్యర్థి జట్లను ఓడిస్తూ ఫైనల్​కు చేరుకున్న టీమిండియా.. ఆ టోర్నీ ఫైనల్లో లంకను చిత్తుచిత్తుగా ఓడించి విజేతగా అవతరించింది. ఆసియా కప్ తర్వాత ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్​ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే గెలుచుకుంది భారత్. మన జట్టులోని బౌలర్లు, బ్యాటర్లు భీకర ఫామ్​లో ఉన్నారు. రిజర్వ్ బెంచ్ కూడా మునుపటి కంటే ఎంతో స్ట్రాంగ్​గా ఉంది. దీంతో ఈ వరల్డ్ కప్​లో భారత్ ఫేవరెట్ అని చాలా మంది మాజీలు అంటున్నారు.

స్వదేశంలో టోర్నీ జరుగుతుండటం టీమిండియాకు మరింత కలిసొచ్చే అంశమని మాజీ క్రికెటర్లు చెబుతున్నారు. వెటరన్ క్రికెటర్ మైకేల్ వాన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. భారత్ కప్ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని అన్నాడు. ఇతర జట్టు ప్రపంచ కప్ నెగ్గాలంటే టీమిండియాను ఓడించక తప్పదన్నాడు. ‘నాకు పూర్తిగా స్పష్టత వచ్చేసింది. ఏ టీమ్ అయితే భారత్​ను ఓడిస్తుందో వాళ్లే ప్రపంచ కప్ నెగ్గుతారు. సొంత పిచ్​ల మీద టీమిండియా బ్యాటింగ్ తీరు అద్భుతంగా ఉంది. అదే విధంగా భారత బౌలింగ్ లైనప్ కూడా అత్యుత్తమంగా ఉంది. ఆ జట్టు దగ్గర చాలా బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. వాళ్లను ఏదైనా ఆపగలదంటే అది ఒత్తిడి మాత్రమే’ అని వాన్ చెప్పుకొచ్చాడు.

Show comments