40 బంతుల్లోనే సెంచరీ..! ఆ తర్వాత కూడా ఆగని పూరన్‌ విధ్వంసం

అమెరికాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మొట్టమొదటి టీ20 టోర్నీ మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ 2023 టోర్నీ ఫైనల్‌ మ్యాచ్‌లో ఎంఐ న్యూయార్క్‌ కెప్టెన్‌ నికోలస్‌ పూరన్‌ విశ్వరూపం చూపించాడు. ఈ కరేబియన్‌ విధ్వంసం ముందు.. ప్రత్యర్థి బౌలర్లు నిలువలేకపోయారు. ఫోర్లు, సిక్సుల వర్షం కురిపిస్తూ.. సునామీ ఇన్నింగ్స్‌ ఆడాడు. తన బ్యాటింగ్‌ పవర్‌తో ఫైనల్‌లో తన టీమ్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. పూరన్‌ బాదుడికి గ్రౌండ్‌ చిన్నబోయింది. బౌండరీ లైన్‌ పూరన్‌ పక్కనే ఉందా అనే అనుమానం వచ్చేలా సాగింది ఊచకోత. బౌలర్‌ ఎవరైనా సరే పూరన్ ఇచ్చే ట్రీట్‌మెంట్‌ ఒకేలా ఉంది. 184 పరుగుల భారీ టార్గెట్‌ను ఎంఐ కేవలం 16 ఓవర్లలోనే ఊదేసిందంటే అర్థం చేసుకోండి పూరన్‌ ఏ రేంజ్‌లో కొట్టాడు.

సీటెల్ ఓర్కాస్ టీమ్‌ బౌలర్‌ హర్మీత్‌ సింగ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 15వ ఓవర్‌లో చివరి నాలుగు బంతుల్లో 4,6,6,6తో చెలరేగాడు పూరన్‌. అలాగే ఆండ్రూ టై వేసిన ఇన్నింగ్స్‌ 6వ ఓవర్‌లో కూడా మూడు సిక్సులతో 18 పరుగులు పిండుకున్నాడు. డివైన్‌ ప్రిటోరియస్‌ వేసిన ఇన్నింగ్స్‌ 3వ ఓవర్‌లో అయితే.. 6,6,4,6,4 తో విరుచుకుపడ్డాడు. క్రీజ్‌లోకి వచ్చిన క్షణం నుంచి పూరన్‌ బాదుడే పనిగా పెట్టుకున్నాడు. ఈ క్రమంలో 16 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ మార్క్‌ అదుకున్న పూరన్‌.. మరో 14 బంతులాడి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేవలం 40 బంతుల్లో సెంచరీ సాధించి, ఆ తర్వాత మరింత చెరేగిపోయాడు. మొత్తం మీద 55 బంతుల్లో 10 ఫోర్లు, 13 సిక్సులతో 137 పరుగులు చేసి.. సింగిల్‌ హ్యాండ్‌తో ఎంఐని ఛాంపియన్‌గా నిలిపాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ ఫైనల్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సీటెల్‌ ఓర్కాస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 183 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ 52 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సులతో 87 పరుగులు చేసి అదరగొట్టాడు. అలాగే శుభమ్ రంజనే(29), ప్రిటోరియస్‌ 7 బంతుల్లో 21 పరుగులతో రాణించారు. మిగతా బ్యాటర్లు విఫలం అయ్యారు. ఎంఐ బౌలర్లలో రషీద్‌ ఖాన్‌ సంచలన బౌలింగ్‌తో సీటెల్‌కు చుక్కలుచూపించాడు. 4 ఓవర్లు వేసిన రషీద్‌ కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. అలాగే ట్రెంట్‌ బౌల్ట్‌ సైతం 3 వికెట్లు పడగొట్టాడు.

ఇక 184 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన ఎంఐ ఒక్క పరుగులు కూడా చేయకుండానే ఓపెనర్‌ స్టీవెన్‌ టేలర్‌ వికెట్‌ కోల్పోయింది. ఇమద్‌ వసీమ్‌ టేలర్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేసి డకౌట్‌గా పెవిలియన్‌ చేర్చాడు. తొలి వికెట్‌ ఫస్ట్‌ ఓవర్‌లోనే తీసి సీటెల్‌ పైచేయి సాధించదునుకుంటే.. పూరన్‌ రూపంలో వచ్చిన సునామీ వారిని ముంచేసింది. మరో ఓపెనర్‌ జహంగీర్‌తో కలిసి పూరన్‌ రెండో వికెట్‌కు 62 పరుగులు జోడించాడు. అందులో జహంగీర్‌ చేసినవి కేవలం 10 పరుగులు మాత్రమే. అతను అవుటైన తర్వాత డెవాల్డ్‌ బ్రెవిస్‌ 20 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. చివర్లో టిమ్‌ డేవిడ్‌ 10 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌ను పూరన్‌ ఒంటి చేత్తో గెలిపించాడు అనడనే సబబు. మరి పూరన్‌ విధ్వంసకర బ్యాటింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments