iDreamPost
android-app
ios-app

West Indies: దేశానికి ఆడేందు​కు నో చెప్పిన ముగ్గురు స్టార్‌ క్రికెటర్లు! మండిపడుతున్న ఫ్యాన్స్‌

  • Published Dec 11, 2023 | 7:43 AM Updated Updated Dec 11, 2023 | 12:05 PM

జాతీయ జట్టుకు ఆడాలని ఎంతో మంది క్రికెటర్లు కలలు కంటుంటే.. కొంతమంది ఆటగాళ్లు మాత్రం పిలిచి దేశానికి ఆడాలని కోరినా.. మేం ఆడం అంటూ తెగేసి చెబుతున్నారు. మరి ఆ క్రికెటర్లు ఎవరు? ఎందుకు అలా అన్నారో ఇప్పుడు చూద్దాం..

జాతీయ జట్టుకు ఆడాలని ఎంతో మంది క్రికెటర్లు కలలు కంటుంటే.. కొంతమంది ఆటగాళ్లు మాత్రం పిలిచి దేశానికి ఆడాలని కోరినా.. మేం ఆడం అంటూ తెగేసి చెబుతున్నారు. మరి ఆ క్రికెటర్లు ఎవరు? ఎందుకు అలా అన్నారో ఇప్పుడు చూద్దాం..

  • Published Dec 11, 2023 | 7:43 AMUpdated Dec 11, 2023 | 12:05 PM
West Indies: దేశానికి ఆడేందు​కు నో చెప్పిన ముగ్గురు స్టార్‌ క్రికెటర్లు! మండిపడుతున్న ఫ్యాన్స్‌

క్రికెట్‌ను కెరీర్‌గా మల్చుకున్న ఏ ఆటగాడి లక్ష్యమైనా.. జాతీయ జట్టుకు ఆడి, దేశానికి ప్రాతినిథ్యం వహించాలని అనుకుంటాడు. జాతీయ జట్టు జెర్సీని ధరించి గర్వంగా ఫీల్‌ అవుతాడు. దేశానికి ఆడేందుకు ఎలాంటి త్యాగానికై సిద్ధమవుతారు. కానీ, వెస్టిండీస్‌ క్రికెటర్ల విషయంలో ఇది భిన్నంగా ఉంటుంది. దేశానికి ఆడాలని పిలిచి చోటిస్తుంటే.. మేం ఆడం అంటూ తెగేసి చెబుతున్నారు. అద్భుతమైన ఆటగాళ్లు ఉన్న కరేబియన్‌ టీమ్‌.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎందుకు రోజు రోజుకు తీసికట్టుగా మారుతుందంటే.. ఇలా ఆటగాళ్లు వారి దేశానికి ఆడకుండా ఫ్రాంచైజ్‌ క్రికెట్‌కే ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడం వల్లే. తాజాగా నికోలస్‌ పూరన్‌, జెసన్‌ హోల్డర్‌, కైల్‌ మేయర్స్‌.. వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు సెంట్రల్‌ కాంట్రాక్ట్‌కు నో చెప్పారు.

వెస్టిండీస్‌ తరఫున వన్డేలు, టెస్టులు ఆడేందుకు వారు సిద్ధంగా లేరు. విండీస్‌ తరఫున కేవలం టీ20 క్రికెట్‌ మాత్రమే ఆడుతామంటే తెగేసి చెప్పేశారు. సెంట్రల్‌ కాంట్రాక్ట్‌లో ఉంటే వెస్టిండీస్‌ ఇతర దేశాలతో ఆడే టెస్ట్‌, వన్డే సిరీస్‌లకు అందుబాటులో ఉండాలి. సెంట్రల్‌ కాంట్రాక్ట్‌లో లేకుంటే.. అందుబాటులో ఉండాల్సిన అవసరం లేదు.. హాయిగా వివిధ దేశాల్లో జరిగే టీ20 లీగ్స్‌లో ఆడుకోవచ్చు. వెస్టిండీస్‌ క్రికెటర్లు ఇలా దేశానికి కంటే డబ్బుకే ఎక్కువ విలువ ఇస్తున్నారంటూ ఆ దేశ క్రికెట్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో ఏ మూల జరిగే ఫ్రాంచైజ్‌ లీగ్‌ చూసిన.. వెస్టిండీస్‌ క్రికెటర్లకు మంచి డిమాండ్‌ ఉంటుంది. ఐపీఎల్‌లో కూడా ప్రతి టీమ్‌లో కరేబియన్‌ స్టార్‌ ప్లేయర్లు ఉంటారు.

westindies cricketers take worest decision

అసలు ఫ్రాంచైజ్‌ క్రికెట్‌లో వారిదే హవా. కానీ, అంతర్జాతీయ క్రికెట్‌లోకి వస్తే మాత్రం వెస్టిండీస్‌ ఒక సాధారణ జట్టు. ఎందుకంటే ఫ్రాంచైజ్‌ క్రికెట్‌లో స్టార్‌ ఆటగాళ్లు.. వెస్టిండీస్‌ తరఫున ఆడటం లేదు. సునీల్‌ నరైన్‌, పొలార్డ్‌, ఆండ్రూ రస్సెల్‌ ఈ పరంపరను మొదలు పెట్టారు. ఇప్పుడు వారి బాటలో పూరన్‌, మేయర్స్‌, హోల్డర్‌లు సాగుతున్నారు. వీరంత ఫ్రాంచైజ్‌ క్రికెట్‌ను కాదని వారి దేశానికి ఆడితే.. వెస్టిండీస్‌ను ఓడించడం ప్రపంచంలో ఏ జట్టుకు కూడా అంత ఈజీ కాదు. వెస్టిండీస్‌ అంటే.. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను గడగడలాడించిన జట్టు. వరుసగా తొలి రెండు ప్రపంచ కప్‌లను గెలిచింది. కానీ, ప్రస్తుతం ఓ పసికూన. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌ కప్‌ 2023కు కనీసం అర్హత కూడా సాధించలేకపోయింది. వెస్టిండీస్‌ లేకుండా జరిగిన మొదటి వరల్డ్‌ కప్‌ ఇదే.

అయితే.. ఆటగాళ్లు ఇలా ఫ్రాంచైజ్‌ క్రికెట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం వారి ఆర్థిక పరిస్థితులే.. వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డుకు ఆర్థిక వనరులు తక్కువ.. అందుకే ఆ దేశ క్రికెటర్లుకు సరిగా వేతనాలు కూడా చెల్లించలేని పరిస్థితి. ఆ జట్టు కనీసం కిట్‌ స్పాన్సర్‌ కూడా లేరంటేనే అర్థం చేసుకోవచ్చు వారి పరిస్థితి. అందుకే తమ ఒంట్లో సత్తా ఉన్న టైమ్‌లో ఓ నాలుగు రాళ్లు వెనుక వేసుకోడానికి వెస్టిండీస్‌ క్రికెటర్లు ఫ్రాంచైజ్‌ క్రికెట్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. ఫ్రాంచైజ్‌ క్రికెట్‌ను కాదని, వెస్టిండీస్‌ తరఫున ఆడుకుంటూ వెళ్తే.. రిటైర్మెంట్‌ తర్వాత తమ చేతికి చిప్పే వస్తుందని అభిప్రాయపడుతున్నారు. తమకూ కుటుంబాలు ఉన్నాయని వాళ్లను పోషించుకోవడానికి.. వెస్టిండీస్‌ను కాదని టీ20 లీగ్స్‌ ఆడుకోవాల్సి వస్తుందని అంటున్నారు. పైగా చాలా మంది క్రికెటర్లకు వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డుతో విభేదాలు సైతం వారిని జాతీయ జట్టుకు దూరం అయ్యేందుకు కారణం అయ్యాయి. మరి పూరన్‌, మేయర్స్‌, హోల్డర్‌ వెస్టిండీస్‌ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ వద్దనడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.