iDreamPost
android-app
ios-app

ఇంగ్లాండ్ పై విజయం.. ప్రత్యర్థి జట్లకు వార్నింగ్ ఇచ్చిన కివీస్!

  • Author Soma Sekhar Published - 07:53 AM, Fri - 6 October 23
  • Author Soma Sekhar Published - 07:53 AM, Fri - 6 October 23
ఇంగ్లాండ్ పై విజయం.. ప్రత్యర్థి జట్లకు వార్నింగ్ ఇచ్చిన కివీస్!

ఓ వైపు డిఫెండింగ్ ఛాంపియన్.. మరోవైపు గతేడాది వరల్డ్ కప్ ఫైనల్ లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే జట్టు. ప్రపంచ కప్ తొలి మ్యాచ్ లోనే ఈ రెండు జట్లు తలపడుతుండటంతో.. ప్రేక్షకులకు కూడా ఫుల్ మజా ఉంటుందని భావించారు. అందుకు తగ్గట్లుగానే సాగింది ఈ మ్యాచ్. అద్భుతమై ఆటతీరుతో వరల్డ్ కప్ లో తమపై ఉన్న అంచనాలను అమాంత పెంచుకోవడమే కాకుండా.. ప్రపంచ కప్ లో పాల్గొనే ప్రత్యర్థి జట్లకు హెచ్చరికలు పంపింది. దీంతో కివీస్ ఓ అనామక జట్టు కాదని, పటిష్టమైన జట్టని ఈ మ్యాచ్ ద్వారా తెలియపరిచింది. మరో 13.4 ఓవర్లు మిగిలుండగానే మ్యాచ్ ను ముగించింది కివీస్.

వరల్డ్ కప్ 2023 ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా ప్రారంభం అయ్యింది. అయితే తొలి మ్యాచ్ అభిమానులను అలరించిందనే చెప్పాలి. కివీస్ తన అద్భుత ఆటతీరుతో డిఫెండింగ్ ఛాంపియన్ ను 9 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది న్యూజిలాండ్. టాస్ గెలిచిన కివీస్ తొలుత బౌలింగ్ ను ఎంచుకోగా.. తమ కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టారు బౌలర్లు. కట్టుదిట్టంగా బంతులు సంధిస్తూ.. ఇంగ్లాండ్ బ్యాటర్లను ఇబ్బందులు పెట్టారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. జట్టులో రూట్(77), బట్లర్(43) పరుగులతో రాణించారు. కివీస్ బౌలర్ల ధాటికి మిగతా బ్యాటర్లు తక్కువ పరుగులకే పెవిలియన్ కు క్యూ కట్టారు.

అనంతరం 283 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ కేవలం 36.2 ఓవర్లలోనే ఒకే ఒక్క వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని దంచికొట్టింది. సామ్ కర్రన్ తొలి ఓవర్ లోనే ఓపెనర్ యంగ్(0)ను అవుట్ చేయడంతో.. కివీస్ పై ఒత్తిడి పెరిగింది. కానీ కాన్వే-రచిన్ రవీంద్ర జోడీ ఇంగ్లాండ్ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా.. విరుచుకుపడ్డారు. కాన్వే 121 బంతుల్లో 19 ఫోర్లు, 3 సిక్స్ లతో అజేయంగా 152 పరుగులు చేయగా.. రచిన్ రవీంద్ర 96 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 123 పరుగులతో నాటౌట్ గా నిలిచి కివీస్ కు భారీ విజయాన్ని అందించారు.

కాగా.. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఏ దశలోనూ మ్యాచ్ లో ఆధిపత్యం చెలాయించలేకపోయింది. కాన్వే-రచిన్ జోడీ రెండో వికెట్ కు 273 పరుగుల రికార్డ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పి.. గప్టిల్-విల్ యంగ్ పేరిట ఉన్న 203 పరుగుల రికార్డ్ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేశారు. ఈ మ్యాచ్ లో కివీస్ తన అద్భుతమైన ఆటతీరుతో వరల్డ్ కప్ టీమ్స్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. తమను తక్కువ అంచానా వేస్తే.. దారుణంగా దెబ్బతింటారని నిరూపించింది. మరి వరల్డ్ కప్ లో కివీస్ టీమ్ డేంజరస్ అని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.