ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచ్ ల్లో సంచలనాలు నమోదు అవుతున్నాయి. ఇక తాజాగా హరారే వేదికగా జరిగిన వెస్టిండీస్-నెదర్లాండ్స్ మ్యాచ్ సూపర్ థ్రిల్లర్ ను తలపించింది. భారీ స్కోర్లు నమోదు అయిన ఈ మ్యాచ్ సూపర్ ఓవర్ దాక వెళ్లింది. ఇక సూపర్ ఓవర్ లో విండీస్ దారుణ ప్రదర్శన చేయడంతో.. నెదర్లాండ్స్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. దాంతో వరల్డ్ కప్ లోకి వచ్చేందుకు మార్గాన్ని సుగమనం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్ లో డచ్ ఆటగాడు ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. మరి ఆ రికార్డు ఏంటి? ఆ ఆటగాడు ఎవరు? ఇప్పుడు తెలుసుకుందాం.
వెస్టిండీస్-నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో డచ్ టీమ్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. సూపర్ ఓవర్ దాక వెళ్లిన ఈ మ్యాచ్ లో అద్భుతమైన ఆటతీరుతో క్రీడాభిమానుల హృదయాలను కొల్లగొట్టింది నెదర్లాండ్స్ జట్టు. ఇక ఈ మ్యాచ్ లో ఓ ప్రపంచ రికార్డు నమోదు చేశాడు డచ్ ఆటగాడు. వివరాల్లోకి వెళితే.. సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్.. మెుత్తం 30 రన్స్ పిండుకుంది. డచ్ ఆల్ రౌండర్ వాన్ బీక్ ఈ ఓవర్లో 4, 6, 4, 6, 6, 4 బాదాడు. దాంతో సూపర్ ఓవర్ లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా వాన్ బీక్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. జేసన్ హోల్డర్ వేసిన ఈ ఓవర్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు వాన్ బీక్. టీ20, వన్డే ఫార్మాట్ లో ఇదే అత్యధిక సూపర్ ఓవర్ స్కోర్. ఇప్పటి వరకు సూపర్ ఓవర్ లో ఇన్ని పరుగులు ఎవరూ చేయలేదు. మరో విశేషం ఏంటంటే? సూపర్ ఓవర్ వేసిన వాన్ బీక్ 8 పరుగులకే రెండు వికెట్లు తీశాడు.
ఈ రికార్డుతో పాటుగా సూపర్ ఓవర్ లో అత్యధిక రన్స్ చేసిన జట్టుగా డచ్ టీమ్ నిలిచింది. ఈ ఘనత గతంలో విండీస్ పేరిట ఉండేది. విండీస్ టీమ్ గతంలో సూపర్ ఓవర్ లో 25 పరుగులు రాబట్టింది. ఈ రికార్డును ప్రస్తుతం నెదర్లాండ్స్ టీమ్ బద్దలు కొట్టింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 374 పరుగుల భారీ స్కోర్ చేసింది. విండీస్ బ్యాటర్లలో నికోలస్ పూరన్ 65 బంతుల్లో 104* పరుగులతో చెలరేగగా.. బ్రండన్ కింగ్ 76, చార్లెస్ 54 పరుగులతో రాణించారు. అనంతరం 375 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ టీమ్.. నిర్ణీత ఓవర్లలో సరిగ్గా 374 పరుగులే చేసింది. దాంతో మ్యాచ్ టై అయ్యింది. డచ్ టీమ్ లో బెజవాడ కుర్రాడు తేజ నిడమనూరు (111) సెంచరీతో కదం తొక్కాడు.
Logan van Beek putting the super in Super Over against Jason Holder last evening 🔥🔥🔥 pic.twitter.com/XrHa1ED4yA
— Cricbuzz (@cricbuzz) June 27, 2023