క్రికెట్ ఫ్యాన్స్‌కు పరిచయం అక్కర్లేని పేరు మహేంద్ర సింగ్ ధోని. జెంటిల్మన్ గేమ్ గురించి తెలియని వారు కూడా ఈ పేరు వినే ఉంటారు. తన ఆటతీరుతో, కెప్టెన్సీ స్కిల్స్‌తో క్రికెట్‌కు వన్నె తెచ్చిన లెజెండ్‌గా ధోనీని చెప్పుకోవచ్చు. అభిమానులు ముద్దుగా మిస్టర్ కూల్ అని పిలుచుకునే ఈ దిగ్గజ ప్లేయర్.. 2020లోనే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకొని మూడేళ్లు కావొస్తున్నా ధోని ఇమేజ్ ఇసుమంత కూడా మారలేదు. దీనికి ఐపీఎల్లో ఇంకా ఆడుతూ ఉండటం ఒక కారణమని చెప్పొచ్చు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతూ ప్రేక్షకులను ఫుల్‌గా ఎంటర్టైన్ చేస్తున్నాడు ధోని.
సీఎస్కే టీమ్‌ను అన్నీ తానై నడిపిస్తున్నాడు ఎంఎస్ ధోని. ఈ ఏడాది చెన్నై టైటిల్ గెలవడంలో అతడిది కీలక పాత్ర అని చెప్పొచ్చు. ఐపీఎల్ టైమ్‌లో గాయంతో ఇబ్బంది పడిన ధోని.. ఇటీవలే దానికి సర్జరీ చేయించుకున్నాడు. నెక్స్ట్ సీజన్ టైమ్‌కు ఫిట్‌గా ఉంటే అతడు తప్పకుండా మరోసారి క్రికెట్ ఫీల్డ్‌లోకి దిగే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. భారత జట్టుకు ఆడనప్పటికీ ఆదాయంలో ధోని దూసుకెళ్తున్నాడు. యాడ్స్‌లో నటిస్తూ రూ.కోట్లు ఆర్జిస్తున్నాడు. ధోని సంపాదన మొత్తం దాదాపు రూ.1,050 కోట్లకు పైనే ఉంటుందని సమాచారం. ఐపీఎల్లో సీఎస్కేకు ఆడటం ద్వారా అతడు ఏటా రూ.15 కోట్లు అందుకుంటున్నాడు.
ఐపీఎల్ రెమ్యూనరేషన్‌ను పక్కనబెడితే యాడ్స్ చేయడం ద్వారా కూడా ధోని బాగానే సంపాదిస్తున్నాడు. అలాంటి ధోని ఒకప్పుడు చాలా తక్కువ జీతానికి పనిచేశాడట. చెన్నై ఫ్రాంచైజీ ఓనర్, బీసీసీఐ మాజీ బాస్ ఎన్.శ్రీనివాసన్‌కు చెందిన ఇండియా సిమెంట్స్‌లో ధోని వర్క్ చేశాడట. ఆ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్) పోస్టుకు గానూ నెలకు రూ.43 వేలను ధోని అందుకునేవాడట. 2012లో ఇండియా సిమెంట్స్ నుంచి ధోనికి వచ్చిన అపాయింట్మెంట్ లెటర్‌ను ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. రిచెస్ట్ క్రికెటర్లలో ఒకడైన ధోని ఇంత తక్కువ జీతానికి ఎందుకు పనిచేయాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు.
ఇలాంటిది భారత క్రికెట్లోనే జరుగుతుందని లలిత్ మోడీ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. నెట్టింట వైరల్‌గా మారిన ఈ లెటర్ ద్వారా ధోని, శ్రీనివాసన్‌కు మధ్య అప్పట్లో పరస్పర విరుద్ధ ప్రయోజనాలు ఉండేవని నిరూపించాలని లలిత్ మోడీ అనుకుంటున్నారని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇకపోతే, స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో కొన్నేళ్ల పాటు సీఎస్కే టీమ్‌ను బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ధోని అపాయింట్మెంట్ లెటర్‌తో మరోమారు ప్రకంపనలు రేపారు లలిత్ మోడీ. ఈ అంశం ఎక్కడికి వెళ్తుందో చూడాలి. మరి.. ధోని అపాయింట్మెంట్ లెటర్ అంశంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.