చెత్త బౌలర్‌ నుంచి నెం.1 బౌలర్‌గా.. సిరాజ్‌ జర్నీ ఓ వండర్‌!

ఆటో డ్రైవర్‌ కొడుకు నుంచి ఆసియా కప్‌ ఫైనల్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు విన్నర్‌ వరకు సిరాజ్‌ ప్రస్థానం ఎంతో మంది యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలుస్తుంది. ఈ మొత్తం జర్నీలో సిరాజ్‌ తనను తాను మల్చుకున్న తీరు అద్భుతమనే చెప్పాలి. దాని కోసం అతను నెట్స్‌లో చిందించిన చెమట గురించి మనకు తెలియకపోవచ్చు కానీ.. అతని విజయం తాలుకు సువాసన మాత్రం ప్రస్తుతం దేశం మొత్తం వ్యాపించింది. ఆసియా కప్‌ 2023లో భాగంగా శ్రీలంకతో జరిగిన ఫైనల్‌లో సిరాజ్‌ అద్భుతమైన స్పెల్‌ టీమిండియాకు కప్పు అందించింది. 7 ఓవర్లలో కేవలం 21 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఆ 21 రన్స్‌లో కూడా కోహ్లీ అనవసరపు త్రోతో 4 పరుగులు యాడ్‌ అయ్యాయి. పైగా ఒకే ఓవర్‌లో 4 వికెట్లు పడగొట్టి సంచలన సృష్టించాడు.

దీంతో సిరాజ్ పేరు క్రికెట్‌ లోకంలో మారుమోగిపోతుంది. అందరూ సిరాజ్‌ సూపర్‌ డూపర్‌ అంటూ మెచ్చుకుంటున్నారు. కానీ, ఈ అభినందనలు, ప్రశంసలు సిరాజ్‌కు అంత తేలిగ్గా దక్కలేదు. టీమిండియాలోకి అడుగుపెట్టిన ఆరంభ మ్యాచ్‌తోనే సిరాజ్‌కు ఘోర అవమానం ఎదురైంది. 2019 జనవరి 15న అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌తో వన్డే క్రికెట్‌లోకి అడుగుపెట్టిన సిరాజ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆ మ్యాచ్‌లో సిరాజ్‌ 10 ఓవర్ల కోటా పూర్తి చేసుకుని 76 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక్కటంటే ఒక్క వికెట్‌ కూడా తీయలేదు. దీంతో.. ఇతనో చెత్త బౌలర్‌ అంటూ సిరాజ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. కానీ, అప్పటి టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సిరాజ్‌కు మద్దతుగా నిలబడ్డాడు. సిరాజ్‌ను నమ్మాడు.. దాని ఫలితమే ఇప్పుడు టీమిండియాకు ఒక మ్యాచ్‌ విన్నర్‌ను అందించింది.

ఆస్ట్రేలియాతో జరిగిన ఆ మ్యాచ్‌లో సిరాజ్‌ భారీగా పరుగులు సమర్పించుకున్నా.. కోహ్లీ సెంచరీతో ఆ మ్యాచ్‌ గెలిపించాడు. ధోని కూడా హాఫ్‌ సెంచరీతో మంచి ఇన్నింగ్స్‌ ఆడాడు. తొలి మ్యాచ్‌తో ఎదురైన ఘోర అవమానంతో సిరాజ్‌ కుంగిపోలేదు. మరింత పట్టుదలగా తన బౌలింగ్‌పై దృష్టిపెట్టి.. అంచెలంచెలుగా ఎదిగాడు. ముఖ్యంగా తన బౌలింగ్‌ వేరియేషన్స్‌లో మార్పులు చేసుకుంటూ.. ఇన్‌ స్వింగర్‌, అవుట్‌ స్వింగర్‌, స్లోవర్‌ బాల్స్‌ ఇలా చాలా వెరైటీస్‌తో అత్యుత్తమ బౌలర్‌గా ఎదిగాడు. ఈ మధ్య కాలంలో సిరాజ్‌ వన్డే క్రికెట్‌లో ప్రపంచ నంబర్‌ వన్‌ బౌలర్‌గా ఉన్నాడు. ప్రస్తుతం సిరాజ్‌.. వన్డేల్లో ప్రపంచ నంబర్‌ 9 బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ఇలా.. తొలి మ్యాచ్‌తోనే కెరీర్‌ ముగిసిపోయే ప్రదర్శన ఇచ్చినా.. ఆ తర్వాత అద్భుత బౌలర్‌గా మారాడు. అందుకే సిరాజ్‌ జర్నీ.. యువ క్రికెటర్లు స్ఫూర్తి. మరి సిరాజ్‌ కెరీర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: VIDEO: బాహుబలినే బాదేశాడ్రా స్వామి! ఒకే ఓవర్‌లో..

Show comments