సమస్యలతో సావాసం చేసి.. కష్టాలతో కబుర్లు చెప్పుకునే జీవితం నుంచి టీమిండియాలో స్టార్ బౌలర్ గా ఎదిగి.. ఓ యోధుడు తన పోరాటాన్ని సాగిస్తున్నాడు. ఆ వారియర్ పేరే మహ్మద్ షమీ. ఆత్మహత్య చేసుకునే స్థాయి నుంచి వరల్డ్ కప్ హీరోగా ఎదిగిన అతడి జీవిత ప్రయాణం ఓసారి పరిశీలిద్దాం.
సమస్యలతో సావాసం చేసి.. కష్టాలతో కబుర్లు చెప్పుకునే జీవితం నుంచి టీమిండియాలో స్టార్ బౌలర్ గా ఎదిగి.. ఓ యోధుడు తన పోరాటాన్ని సాగిస్తున్నాడు. ఆ వారియర్ పేరే మహ్మద్ షమీ. ఆత్మహత్య చేసుకునే స్థాయి నుంచి వరల్డ్ కప్ హీరోగా ఎదిగిన అతడి జీవిత ప్రయాణం ఓసారి పరిశీలిద్దాం.
అవమానాలు, ఆరోపణలు ఆపై మ్యాచ్ ఫిక్సింగ్ లాంటి మోయలేని నింద. ఇన్ని సమస్యలతో ఆ క్రికెటర్ జీవితం కమ్ముకుపోయింది. ఇక అతడి ముందుంది అంతా శూన్యమే. అయితే ఆ కారుమబ్బులను చీల్చుకుంటూ అతడు మళ్లీ పుడతాడని విధితో సహా ఎవ్వరూ ఊహించి ఉండరు. ఇలాంటివన్నీ సినిమాల్లోనే సాధ్యం. కానీ ఇది మగధీర సినిమా కాదు.. నిజ జీవితంలో ఓ పోరాట యోధుడు సాగించిన.. సాగిస్తున్న ఓ సమరం. చావు అంచులదాకా వెళ్లోచ్చిన ఆ వారియర్ పేరే మహ్మద్ షమీ. సమస్యలతో సావాసం చేసి.. కష్టాలతో కబుర్లు చెప్పుకునే జీవితం నుంచి టీమిండియాలో స్టార్ బౌలర్ గా ఎదిగిన అతడి జీవితం అద్భుతం, ఆచరణీయం. చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్యలు చేసుకునే ఈ రోజుల్లో షమీ ఈదిన కష్టాల కడలి గురించి తెలిస్తే కచ్చితంగా కళ్లు చెమర్చుతాయి. మరి అలాంటి షమీ బయోగ్రఫీలో ఇంకెన్ని విషాదాలు దాగున్నాయో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1990 సెప్టెంబర్ 03 ఉత్తర్ ప్రదేశ్ లోని అమ్రోహానిలో ఓ రైతు కుటుంబంలో జన్మించాడు మహ్మద్ షమీ. తండ్రి తౌసిఫ్ అలీ వ్యవసాయం చేసుకునే వాడు. కానీ అతడిలో ఓ ఫాస్ట్ బౌలర్ ఉన్నాడు. అయితే ఆ ఫాస్ట్ బౌలర్ ను కష్టాలు క్లీన్ బౌల్డ్ చేయడంతో.. బాల్ వదిలేసి నాగలి పట్టుకున్నాడు. ఇక తన కలను తన కొడుకుతో ఫుల్ ఫిల్ చేసుకోవాలను కున్నాడు షమీ తండ్రి. ఆ వైపుగా అతడిని అడుగులు వేయించాడు. ఈ క్రమంలో 15 ఏళ్ల వయసులోనే నెట్స్ లో బౌలింగ్ చేస్తున్న అతడిని చూసి సీనియర్ కోచ్ బద్రుద్దీన్ సిద్దిక్ తప్పకుండా గొప్ప బౌలర్ అవుతాడని తొలి చూపులోనే పసిగట్టాడు. షమీకి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకుని, అతడిని యూపీ ట్రయల్స్ కు సిద్దం చేశాడు. తన శిక్షణ కాలంలో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదంటే.. అతడిలో ఉన్న పట్టుదల ఎలాంటిదో మనం అర్ధం చేసుకోవచ్చు.
అయితే అండర్-19 ట్రయల్స్ సమయంలో పాలిటిక్స్ కారణంగా అతడిని జట్టులోకి ఎంపిక చేయలేదు. రాజకీయాలకు షమీ జీవితం బలికాకూడదని అతడిని కోల్ కత్తాకు పంపమని తల్లిదండ్రులకు సూచించాడు బద్రుద్దీన్ సిద్దిక్. ఈ సంఘటన మహ్మద్ షమీ జీవితాన్నే మార్చేసింది. అక్కడ తన బౌలింగ్ టెక్నిక్స్ తో అందరిని మంత్ర ముగ్దులను చేశాడు. దీంతో బెంగాల్ అండర్-22 జట్టుకు ఎంపికైయ్యాడు. ఇక్కడే క్లబ్ క్రికెట్ ఆడటం మెుదలుపెట్టాడు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజం, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కంట్లో పడ్డాడు. ఈడెన్ గార్డెన్స్ దాదాకు బౌలింగ్ చేసేవాడు. ఇది షమీ కెరీర్ లో మరో మలుపు. అతడి బౌలింగ్ కు ఫిదా అయిన దాదా స్టేట్ సెలక్టర్లకు సిఫార్సు చేశాడు. ఆ తర్వాత వెంటనే 2010-11 రంజీ ట్రోఫీకి బెంగాల్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇక అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు ఈ స్పీడ్ స్టర్.
2013లో తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ప్రారంభించాడు షమీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు టీమిండియాలో నిలకడైన బౌలర్ గా పేరుగాంచాడు షమీ. ప్రశాంతంగా సాగిపోతున్న షమీ కెరీర్ లోకి హసిన్ జహాన్ వచ్చింది. 2014లో వీరిద్దరు పెళ్లితో ఒక్కటైయ్యారు. ఆ నెక్ట్స్ ఇయరే షమీ తండ్రిగా ప్రమోషన్ పొందాడు. ఈ దంపతులకు ఓ కూతురు పుట్టింది. ఈ సంతోషంతో మరింత రెచ్చిపోయి ఆడాడు షమీ. 2018 వరకు షమీ జీవితం సునామీ వచ్చే ముందు ఉన్నంత ప్రశాంతంగా ఉంది. కానీ సునామీ తన జీవితంలోనే రాబోతుందనే విషయాన్ని మాత్రం కనుగొనలేకపోయాడు. 2018లో షమీ భార్య హసిన్ జహాన్ గృహ హింస కేసుతో పాటుగా, మ్యాచ్ ఫిక్సింగ్, ఇతర మహిళలో వివాహేతర సంబంధాలు ఉన్నాయంటూ సంచలన ఆరోపణలు చేసింది. ఈ సంఘటన షమీ జీవితాన్ని అధఃపాతాళంలోకి నెట్టేసింది. ఇవన్నీ కావన్నట్లు గాయాలు, ప్రమాదం అతడిని మరింత మానసిక క్షోభకు గురిచేశాయి.
ఈ సమయంలో షమీ ఆత్మహత్య చేసుకోవానుకున్నాడు. అదీకాక.. జహాన్ చేసిన ఆరోపణల ఫలితంగా అతడిని బీసీసీఐ జాతీయ కాంట్రక్ట్ లను నిలిపివేసింది. ఈ కేసులో షమీపై అలీపూర్ కోర్టు అరెస్ట్ వారెంట్ ను కూడా జారీ చేసింది. ఇది ఇండియన్ క్రికెట్ లోనే సంచలనం సృష్టించిన సంఘటన. దీంతో షమీ కెరీర్ దాదాపుగా ముగిసిందని అందరూ భావించారు. కానీ.. ఇన్ని నిప్పుకణికలు మీద పడ్డప్పటికీ.. అందులోంచి మేలిమి బంగారంలా బయటకి వచ్చాడు షమీ. తన భార్య తనపై చేసిన ఆరోపణలను నిరూపించలేకపోవడంతో.. కేసు నీరుగారిపోయింది. కోల్ కత్తా కోర్టు హసిన్ కు నెలకు 1.30 లక్షల రూపాయల భరణం చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఈ కష్టాలను భరిస్తూనే టీమిండియాలోకి ఎప్పుడెప్పుడు రీ ఎంట్రీ ఇద్దామా అని షమీ ఎదురుచూసేవాడు.
ఈ క్రమంలోనే దాదాపు 2 సంవత్సరాలు సహచర ఆటగాళ్లకు కేవలం డ్రింక్స్ ఇవ్వడానికే పరిమితం అయ్యాడు. ఇన్ని కష్టాలు వెంటాడుతున్నప్పుడే తన తండ్రి చనిపోవడం, తానే ఆయన సమాధిని తవ్వడం లాంటి గుండెలు పగిలే విషాదాలు షమీ జీవితంలో కోకొల్లలుగా ఉన్నాయి. ఇంత జరుగుతున్నా.. తన జీవిత లక్ష్యాన్ని మాత్రం వదలకుండా బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాడు. అతడి కృషి, పట్టుదల, మెుక్కవోని దీక్షతో టీమిండియాలోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు. నిలకడైన బౌలింగ్ తో వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు ఈ యూపీ స్పీడ్ స్టర్. తన పదునైన పేస్ ఎటాక్ తో ప్రత్యర్థులకు వణుకుపుట్టిస్తూ.. వరల్డ్ కప్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా చరిత్ర సృష్టించాడు.
ఇక ఈ మెగాటోర్నీలో షమీ నెలకొల్పిన రికార్డులు నభూతో నభవిష్యతి. వరల్డ్ కప్ చరిత్రలో అతి తక్కువ మ్యాచ్ ల్లో 50 వికెట్లు సాధించడం దగ్గర నుంచి 5 వికెట్ల హాల్స్ ను 4 సార్లు తీసి.. 48 సంవత్సరాల వరల్డ్ కప్ చరిత్రనే తిరగరాసిన ఘనుడు ఈ పడిలేచిన కెరటం. టీమిండియా సెమీఫైనల్లో కివీస్ ను చిత్తుచేసిందంటే దానికి ప్రధాన కారణం ఈ పేస్ ఘనుడే. ఈ మ్యాచ్ లో 7 వికెట్లు తీసి.. భారత జట్టును సగర్వంగా వరల్డ్ ఫైనల్లోకి అడుగుపెట్టేలా చేశాడు. జవగళ్ శ్రీనాథ్, జహీర్ ఖాన్ లాంటి దిగ్గజాల రికార్డులను బ్రేక్ చేసి.. ఓ సైనికుడిలా ఈ వరల్డ్ కప్ లో ముందుకుసాగుతున్నాడు. ఇదంతా ఒకెత్తు అయితే.. తనపై చేసిన మ్యాచ్ ఫిక్స్ంగ్ ఆరోపణలప్పుడు షమీ మాట్లాడిన మాటలు ఇప్పటికీ గుర్తే.. దేశం కోసం చావనైనా చస్తాను గానీ.. ఫిక్సింగ్ లాంటి పనులు నా జీవితంలో చేయను అని చెప్పుకొచ్చాడు. దేశద్రోహిగా తనపై ముద్ర వేసినప్పటికీ.. ఎన్నో అవమానాలను, చీత్కారాలను ఎదుర్కొని ఆత్మహత్య చేసుకునే స్థాయి నుంచి ఛాంపియన్ బౌలర్ గా ఎదిగిన పడిలేచిన కెరటం.. షమీ ది రియల్ హీరోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
🌟 🌟🌟🌟🌟🌟🌟 Seven Star SHAMI 💥#Shami @MdShami11 @BCCI @ICC @cricketworldcup pic.twitter.com/tgF5QZGeMI
— Suhail Raza Khan (@suhailbly) November 16, 2023