Michael Bevan: మైఖేల్ బెవాన్.. అతనో విధ్వంసం! ఆస్ట్రేలియా జైత్రయాత్ర వెనుక అసలైన హీరో!

Michael Bevan, Australia: ప్రపంచ క్రికెట్‌ను గడగడలాడించిన ఆస్ట్రేలియా అనే భీకర జట్టులో.. ఓ భయంకరమైన ఫినిషర్‌ ఉండేవాడు. నిజానికి అతనే ఆసీస్‌ బలం. అతను లేకుంటే.. ఆసీస్‌ ఓ సాధారణ జట్టు. కంగారుల జట్టును ఒక ఛాంపియన్‌లా మార్చిన మైఖేల్‌ బెవాన్‌ అనే వీరుడి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Michael Bevan, Australia: ప్రపంచ క్రికెట్‌ను గడగడలాడించిన ఆస్ట్రేలియా అనే భీకర జట్టులో.. ఓ భయంకరమైన ఫినిషర్‌ ఉండేవాడు. నిజానికి అతనే ఆసీస్‌ బలం. అతను లేకుంటే.. ఆసీస్‌ ఓ సాధారణ జట్టు. కంగారుల జట్టును ఒక ఛాంపియన్‌లా మార్చిన మైఖేల్‌ బెవాన్‌ అనే వీరుడి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ప్రపంచ క్రికెట్‌ను ఒంటి చేత్తో కొన్ని దశాబ్దాల పాటు శాసించిన జట్టు ఏదైనా ఉందా అంటే.. అది ఆస్ట్రేలియానే. వరల్డ్స్‌ కప్స్‌ ప్రారంభమైన తొలి దశలో వెస్టిండీస్‌ ఆధిపత్యం చెలాయించినా.. ఆ తర్వాత.. ఆస్ట్రేలియా శకం మొదలైంది. వరుసగా మూడు ప్రపంచ కప్‌లతో పాటు అత్యధిక వన్డే వరల్డ్‌ కప్‌లు గెలిచిన ఏకైన జట్టు ఆస్ట్రేలియానే. భీకర బ్యాటింగ్‌, పదునైన బౌలింగ్‌, మెరుపు ఫీల్డింగ్‌.. ఇలాంటి వజ్రాయుధాలు ఆస్ట్రేలియన్ల సొంతం. ప్రపంచంలో ఏ మూలన క్రికెట్‌ ఆడినా కంగారులదే ఆధిపత్యం. 1999 నుంచి 2007.. ఇది ఆస్ట్రేలియా కనుసైగతో క్రికెట్‌ను శాసించిన కాలం. క్రికెట్‌ సామ్రాజ్యానికి రారాజు. స్టీవా, మార్క్‌ వా, రికీ పాంటింగ్‌, మ్యాథ్యూ హేడెన్‌, ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌, ఆండ్రూ సైమండ్స్‌, షేన్‌ వార్న్‌, మెక్‌గ్రాత్‌, బ్రెట్‌ లీ లాంటి హేమాహేమీలతో నిండిన ఆ జట్టును చూస్తే.. ప్రపంచంలో ప్రతి జట్టు వణికిపోయేది. అయితే.. కొన్నిసార్లు భీకరమైన ఆసీస్‌ బ్యాటింగ్‌ లైనప్‌ సైతం పేకమేడలా కూలిపోయేది. వచ్చిన వారు వచ్చినట్లే.. తోకముడిచే వారు. కానీ.. ఒక్కడు మాత్రం అడ్డుగా నిలబడిపోయేవాడు. జట్టు మొత్తం ఓటమిని అంగీకరించి.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో కూలబడినా.. ఆ ఒక్కడు మాత్రం ఓటమిని ఒప్పుకునేవాడు కాదు. ఒంటరి పోరాటం చేస్తూ.. ఓటమి కోరల్లో చిక్కుకున్న జట్టును బయటికి లాగి మరీ.. విజయం అందించేవాడు.

అసలు ఆస్ట్రేలియా అన్నేళ్ల పాటు క్రికెట్‌లో తిరుగులేని శక్తిగా నిలిచిందంటే కారణం.. ఆ పోరాట యోధుడే. స్టీవా, మార్క్‌ వా, రికీ పాంటింగ్‌, మ్యాథ్యూ హేడెన్‌, ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌, ఆండ్రూ సైమండ్స్‌ లాంటి స్టార్లు దాదాపు అన్ని జట్లలోనూ ఉన్నారు. కానీ.. 90వ దశకంలో ఆస్ట్రేలియాకి, మిగతా జట్లకు ఉన్న తేడా.. ‘మైఖేల్‌ బెవాన్‌’. ఈ ఒక్కడు ఆస్ట్రేలియాలో ఉండటంతోనే కంగారుల జట్టు ప్రపంచ ఛాంపియన్‌గా, ఎదురులేని శక్తిగా నిలబడింది. కేవలం వరల్డ్‌ కప్‌ గెలిస్తేనే ఒక టీమ్‌ ఛాంపియన్‌ కాదు.. చివరి నిమిషం వరకు ఓటమిని ఒప్పుకోకపోవడమే.. అసలైన ఛాంపియన్‌ టీమ్‌ లక్షణం. అలాంటి మైండ్‌సెట్‌తో ఓటమిని ఒప్పుకోని పోరాట యోధుడే ఈ మైఖేల్‌ బెవాన్‌. మిగతా టీమ్స్‌లా మ్యాచ్‌ మధ్యలోనే ఓటమిని అంగీకరించి.. భుజాలు వాల్చేయడం, ఎలాగో ఓడిపోతున్నాం అని నిరసంగా ఫీల్డింగ్‌ చేయడం, తొలి ఐదు వికెట్లు పడితే.. మిగతా వాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టేయడం ఆస్ట్రేలియా జట్టులో కనిపించేది కాదు. ఎందుకంటే ఆ టీమ్‌లో మైఖేల్‌ బెవాన్ ఉండేవాడు.

అప్పట్లో ప్రపంచంలోనే భీకరమైన బౌలింగ్‌ ఎటాక్‌ కలిగి వెస్టిండీస్‌పై 173 పరుగులు చేసి గెలవడం అంటే దాదాపు అసాధ్యం. అలాంటి టైమ్‌లో ఆస్ట్రేలియా-వెస్టిండీస్‌ మధ్య జరిగింది. బెన్సన్ అండ్‌ హెడ్జెస్ వరల్డ్ సిరీస్‌లో భాగంగా.. 1996 జనవరి 1న సిడ్నీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో విండీస్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి.. 172 పరుగులు మాత్రమే చేసింది. అది మీకు చిన్న స్కోర్‌గా కనిపించవచ్చు. కానీ, వెస్టిండీస్‌ బౌలర్లను ఎదుర్కొని ఆ టార్గెట్‌ను ఛేజ్‌ చేయాలంటే.. వామ్మో అనాల్సిందే. కర్ట్లీ ఆంబ్రోస్, కోర్ట్నీ వాల్ష్, ఒట్టిస్ గిబ్సన్‌తో కూడిన భీకరమైన బౌలింగ్‌ ఎటాన్‌ను ఎదుర్కొని 173 కొట్టడమంటే మాటలు కాదు. అనుకున్నట్లే ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ లైనప్‌ను అతలాకుతలం చేశారు విండీస్‌ బౌలర్లు. కేవలం 38 పరుగులకే ఆస్ట్రేలియా 6 వికెట్లు కోల్పోయింది. 74 రన్స్‌కి 7వ వికెట్‌ పడింది. ఇలాంటి పరిస్థితిలో ప్రపంచంలో మరే జట్టు విజయంపై ఆశలు పెట్టుకోదు. అవుటై పెవిలియన్‌లో కూర్చున్న ఆసీస్‌ బ్యాటర్లకు కూడా గెలుపుపై హోప్‌ లేదు.

కానీ.. క్రీజ్‌లో ఉన్న బెవాన్ మాత్రం ఓటమిని ఒప్పుకోలేదు. అతను ఒప్పుకోలేదంటే.. ఎలాంటి బౌలర్లు అయినా తలొంచాల్సిందే. అప్పటి వరకు ఆసీస్‌ బ్యాటర్లను వణికించిన విండీస్‌ బౌలర్లను.. ఇక బెవాన్‌ భయపెట్టడం మొదలుపెట్టాడు. సందు దొరికితే ఫోర్‌ బాదేస్తూ.. చివరికి మిగిలిన మూడు వికెట్లతోనే ఆస్ట్రేలియాను విజయం వైపు నడిపించాడు. ఒకవైపు బెవాన్‌ ఒంటరిపోరాటం చేస్తుండగా.. విండీస్‌ బౌలర్లు ఇద్దరు టెయిలెండర్లను పెవిలియన్‌ చేర్చారు. దీంతో 167 పరుగుల వద్ద ఆస్ట్రేలియా 9వ వికెట్‌ కోల్పోయింది. ఇక విండీస్‌కు ఒక్క వికెట్‌ మాత్రమే కావాలి.. కానీ ఆసీస్‌కు 6 పరుగులు అవసరం. ఈ మ్యాచ్‌ ఆస్ట్రేలియా గెలిస్తే.. అది చరిత్రే అని చాలా మంది భావించారు. ఎందుకంటే చివరి బాల్‌కు 4 పరుగులు కావాలి. 74 పరుగులతో బెవాన్‌ స్ట్రైక్‌లో ఉన్నాడు. నరాలు తెగే ఉత్కంఠ మధ్య.. తీవ్ర ఒత్తిడిని తట్టుకుంటూ.. లాస్ట్‌ బాల్‌కు స్ట్రేయిట్‌ బౌండరీ బాది.. ఆస్ట్రేలియాకు నమ్మశక్యం కానీ అద్భుత విజయాన్ని అందించాడు బెవాన్‌. ఆ మ్యాచ్‌లో పాంటింగ్‌, మార్క్‌ వా, మార్క్‌ టేలర్‌, మైఖేల్‌ స్లాటర్‌ లాంటి స్టార్లు తక్కువ స్కోర్‌కే అవుటైనా.. ఒక్క మైఖేల్‌ బెవాన్‌ మాత్రం 78 పరుగులతో నాటౌట్‌గా నిలిచి.. ఆసీస్‌ను గెలిపించాడు. అప్పట్లో చాలా టీమ్స్‌లో ఇలా చివర్లో ఆడే ఆటగాడు లేకపోవడమే.. ఆసీస్‌ను ఒక స్పెషల్‌ టీమ్‌ నిలబెట్టింది.

ఆ మ్యాచ్‌ అనే కాదు.. నరాలు తెగే ఉత్కంఠ మధ్య ఎన్నో మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియాను గెలిపించాడు బెవాన్‌. 2000వ సంవత్సరంలో ఆసియా ఎలెవన్‌-రెస్ట్‌ ఆఫ్‌ ది వరల్డ్‌కు మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ బెవాన్‌.. 185 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఆడిన ఇన్నింగ్స్‌ కూడా అతని స్థాయి, సామర్థ్యం ఏంటో చెబుతుంది. నిజానికి క్రికెట్‌ టీమ్‌లో ఫినిషర్‌ అనే పదం అతని నుంచే పుట్టింది. అసలు క్రికెట్‌ వరల్డ్‌కి ఫినిషర్‌ అనే పదాన్ని పరిచయం చేసిందే అతను అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మ్యాచ్‌ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా.. సగం జట్టు పెవిలియన్‌ చేరినా, రిక్వైర్డ్‌ రన్‌రేట్‌ తలకు మించిన భారమైనా.. ఓటమిని ఒప్పుకోకుండా పోరాడే వాడు బెవాన్‌. అతని పోరాట పటిమ.. ఆస్ట్రేలియాకు ఎన్నో ఓటములు తప్పించి.. మరెన్నో విజయాలు అందించింది. టాపార్డర్‌లో ఆస్ట్రేలియా లాంటి బ్యాటింగ్‌ లైనప్‌ చాలా జట్లకు ఉంది. మిడిల్డార్‌, లోయర్‌ ఆర్డర్‌లో బెవాన్‌లా ఆడే ఫినిషర్ మాత్రం.. అప్పట్లో దాదాపు ఏ టీమ్‌కు లేడు. అదే అన్ని టీమ్స్‌లో ఆసీస్‌ను ప్రత్యేకంగా నిలిపింంది.

క్రికెట్‌ చరిత్రలోనే ఒక స్పెషల్‌ ప్లేయర్‌గా నిలిచిపోయేలా ఇంత చేసినా.. బెవాన్‌కు రావాల్సినంత గుర్తింపు రాలేదన్నది మాత్రం వాస్తవం. 196 వన్డే ఇన్నింగ్స్‌లు ఆడిన బెవాన్‌.. 67 మ్యాచ్‌ల్లో అసలు అవుటే కాలేదు. బెవాన్‌ క్రీజ్‌లో ఉన్నాడంటే ఆస్ట్రేలియా విజయం ఖాయం. అంత టాలెంట్‌ ఉండి.. కెరీర్‌ మొత్తం లోయర్డార్‌లో ఆడటం వల్ల ఒక మంచి ఆటగాడిగా మిగిలిపోయాడు కానీ.. టాపార్డర్‌లో ఆడి ఉంటే ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ ప్లేయర్‌గా, లెజెండరీ ప్లేయర్‌గా గుర్తింపు పొందేవాడు. వన్డేల్లో ఇప్పటికీ మైఖేల్‌ బెవాన్‌ను కొట్టే బ్యాటర్‌ ఆస్ట్రేలియాలో పుట్టలేదు. వన్డేల్లో అత్యధిక బ్యాటింగ్‌ యావరేజ్‌ ఉన్న బ్యాటర్‌ మైఖేల్‌ బెవానే.

1994 నుంచి 2004 వరకు వన్డేలు ఆడిన బెవాన్‌.. తన కెరీర్‌లో మొత్తం 232 వన్డేలు ఆడాడు. 196 ఇన్నింగ్స్‌ల్లో 53.58 యావరేజ్‌తో 6912 పరుగులు చేశాడు. అందులో 46 హాఫ్‌ సెంచరీలు, 6 సెంచరీలు ఉన్నాయి. బెవాన్‌ అత్యధిక స్కోర్‌ 108(నాటౌట్‌). ఏకంగా 67 సార్లు నాటౌట్‌గా నిలిచాడు. వన్డేల్లో అత్యధిక మ్యాచ్‌ల్లో నాటౌట్‌గా నిలిచిన రెండో బ్యాటర్‌ అతనే. అయితే.. వన్డేల్లో అద్భుత బ్యాటర్‌గా కొనసాగిన బెవాన్‌.. టెస్టుల్లో మాత్రం అంతగా రాణించలేకపోయాడు. 18 టెస్టుల్లో 785 పరుగులు మాత్రమే చేశాడు. మైఖేల్‌ బెవాన్‌ అనే ఓ వజ్రాయుధం ఆస్ట్రేలియా జట్టుకు దొరకడం వారి అదృష్టం. ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపుతిప్పే మ్యాచ్‌ విన్నర్లు ఎంతమంది ఉన్నా.. బెవాన్‌ లాంటి వెన్నుముకలా నిలబడే ఆటగాడు లేకుంటే.. ఆస్ట్రేలియా సైతం ఒక సాధారణ జట్టుగానే ఉండిపోయేది. ఫినిషర్‌ అనే పదం పుట్టుకకు కారణమైన బెవాన్‌ లాంటి పోరాట యోధుడిని చరిత్ర మర్చిపోయినా.. నైన్టీస్‌ క్రికెట్‌ అభిమానుల గుండెల్లో బెవాన్‌ ఎప్పటికీ ఒక సూపర్‌ స్టార్‌గా ఉండిపోతాడు. మరి ఈ పోరాట యోధుడి ఆటను మీరు చూపి ఉంటే.. అతని గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments