iDreamPost
android-app
ios-app

అమెరికాలో తొలి టీ20 కప్పు కొట్టిన ముంబై ఇండియన్స్‌.. సెంచరీతో గెలిపించిన కెప్టెన్‌!

  • Author singhj Updated - 10:20 AM, Mon - 31 July 23
  • Author singhj Updated - 10:20 AM, Mon - 31 July 23
అమెరికాలో తొలి టీ20 కప్పు కొట్టిన ముంబై ఇండియన్స్‌.. సెంచరీతో గెలిపించిన కెప్టెన్‌!

ముంబై ఇండియన్స్.. క్రికెట్ ఫ్యాన్స్​కు పరిచయం అక్కర్లేని పేరు. ఇండియన్ ప్రీమియర్​ లీగ్​లో అత్యంత ఫ్యాన్ బేస్ ఉన్న టీమ్స్​లో ఇదొకటి. ఇప్పటివరకు ఐదు ఐపీఎల్ టైటిల్స్​ను ఒడిసిపట్టిన ముంబై జట్టు గ్రౌండ్​లోకి దిగిందంటే చాలు.. ప్రత్యర్థి జట్లకు వణుకు పుట్టాల్సిందే. కెప్టెన్ రోహిత్ శర్మ ఈ టీమ్​ను సమర్థంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. ఐపీఎల్​లో అదరగొడుతూ వస్తున్న ముంబై ఇండియన్స్ మేజర్ లీగ్ క్రికెట్​ టోర్నీలోనూ తన ప్రస్థానాన్ని ఘనంగా ఆరంభించింది. అమెరికాలో జరుగుతున్న ఎంఎల్​ఎసీ 2023 తొలి ఎడిషన్​లో ముంబై ఇండియన్స్ న్యూయార్క్ జట్టు విజేతగా నిలిచింది.

మేజర్ క్రికెట్​ లీగ్​లో భాగంగా ఆదివారం తెల్లవారుజామున (భారత కాలమానం ప్రకారం) సీటెల్ ఆర్కాస్ టీమ్​తో జరిగిన ఫైనల్లో 7 వికెట్ల తేడాతో గెలిచి చాంపియన్స్​గా ఆవిర్భవించింది ముంబై. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​కు దిగింది సీటెల్. ఆ టీమ్​లో న్యూమన్ అన్వర్ (9) త్వరగానే పెవిలియన్​కు చేరినా.. మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ (87) సూపర్బ్ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే అతడికి మిగిలిన బ్యాటర్ల నుంచి పెద్దగా సహకారం అందలేదు. డికాక్ తర్వాత శుభమ్ రంజనే (29), డ్వేన్ ప్రిటోరియస్ (21) రాణించడంతో సీటెల్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 183 రన్స్ చేసింది.

భారీ లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్ న్యూయార్క్​కు శుభారంభం దక్కలేదు. ఆ జట్టు ఓపెనర్ స్టీవెన్ టేలర్ (0) గోల్డెన్​ డక్​గా వెనుదిరిగాడు. మరో ఓపెనర్ షయాన్ జహంగీర్ (10) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. అయితే జట్టు కెప్టెన్ నికోలస్ పూరన్ (55 బంతుల్లో 137) సెంచరీతో వీరవిహారం చేసి జట్టుకు కప్​ అందించాడు. పూరన్​ ఇన్నింగ్స్​లో ఫోర్ల (10) కంటే సిక్సులే (13) ఎక్కువగా ఉన్నాయి. దీన్ని బట్టే అతడి బ్యాటింగ్ విధ్వంసం ఏ విధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. తొలి ఎంఎల్​సీ ట్రోఫీని ముంబై గెలవడంతో ఆ జట్టు ఫ్యాన్స్​లో సంతోషంలో మునిగిపోయారు.