iDreamPost
android-app
ios-app

సౌతాఫ్రికా బౌలర్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన స్టోయినిస్!

  • Author Soma Sekhar Published - 02:14 PM, Thu - 31 August 23
  • Author Soma Sekhar Published - 02:14 PM, Thu - 31 August 23
సౌతాఫ్రికా బౌలర్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన స్టోయినిస్!

క్రికెట్ లో గెలుపోటములే కాదు.. అంతకు మించి ఉంటాయి. సాధారణంగా క్రికెట్ మ్యాచ్ జరిగేటప్పుడు మైదానంలో ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. బ్యాటర్ ని బౌలర్ కవ్విస్తే.. అతడు బ్యాట్ తోనే సమాధానం ఇస్తాడు. ఇక బౌలర్ ను బ్యాటర్ కవ్విస్తే.. అతడు తన బంతితో ఆన్సర్ ఇస్తాడు. ఇలా చర్యకు ప్రతి చర్యలు జరుగుతూనే ఉంటాయి మ్యాచ్ ల్లో. కాగా.. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది ఆస్ట్రేలియా టీమ్. ప్రోటీస్ జట్టుతో మూడు టీ20లు, ఐదు వన్డే మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది ఆసీస్. ఈ నేపథ్యంలోనే డర్బన్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో 111 పరుగుల తేడాతో ఆసీస్ విజయం సాధించింది. కాగా.. ఈ మ్యాచ్ లో ఓ ఆసక్తికర దృశ్యం చోటు చేసుకుంది. ప్రోటీస్ బౌలర్ రియాక్షన్ కు ఆ తర్వాత దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు ఆసీస్ ఆల్ రౌండర్ స్టోయినిస్.

మూడు టీ20లు, ఐదు వన్డే మ్యాచ్ ల సిరీస్ కోసం దక్షిణాఫ్రికా గడ్డపై అడుగుపెట్టింది ఆస్ట్రేలియా. అందులో భాగంగా డర్బన్ వేదికగా జరిగిన తొలి టీ20లో 111 పరుగుల భారీ తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించి..బోణీ కొట్టింది. ఇక ఈ మ్యాచ్ లో ఓ ఇంట్రెస్టింగ్ సన్నివేశం చోటుచేసుకుంది. ఆసీస్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. ఇన్నింగ్స్ 6వ ఓవర్ వేయడానికి ప్రోటీస్ బౌలర్ విలియమ్స్ వచ్చాడు. ఈ ఓవర్ చివరి బంతికి మార్కస్ స్టోయినిస్ ను అవుట్ చేశాడు విలియమ్స్. ఈ క్రమంలోనే సెలబ్రేషన్స్ చేసుకుంటూ.. సెల్యూట్ కొట్టాడు.

ఆ తర్వాత ప్రోటిస్ జట్టు బ్యాటింగ్ దిగింది. తొలి ఓవర్ వేయడానికి వచ్చిన స్టోయినిస్.. అద్భుతమైన బంతితో ఓపెనర్ టెంబా బవుమాను బౌల్డ్ చేశాడు. అప్పుడు స్టోయినిస్ విలియమ్సన్ సెల్యూట్ కొట్టిన విధంగా సెల్యూట్ కొట్టి.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో నెటిజన్లు చర్యకు ప్రతి చర్య అంటే ఇదే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది.

కంగారూ బ్యాటర్లలో కెప్టెన్ మిచెల్ మార్ష్ తుపాన్ ఇన్నింగ్స్ తో చెలరేగాడు. క్రీజ్ లోకి వచ్చినప్పటి నుంచే దక్షిణాఫ్రికా బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. 49 బంతులు ఎదుర్కొన్న మార్ష్ 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 92 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడికి తోడు టిమ్ డేవిడ్ థండర్ ఇన్నింగ్స్ తో దుమ్మురేపాడు. కేవలం 28 బంతుల్లోనే 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 64 పరుగులు చేశాడు. సౌతాఫ్రికా బౌలర్లలో విలియమ్స్ మూడు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. మిగతా బౌలర్లలో జాన్సెన్, గెరాల్డ్, షమ్సీ తలా వికెట్ సాధించారు. అనంతరం 227 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రోటీస్ జట్టు ఆసీస్ బౌలర్ల ధాటికి కేవలం 115 రన్స్ కే కుప్పకూలింది. ఆసీస్ బౌలర్లలో భారత సంతతి ఆటగాడు తన్వీర్ సంగా 4 వికెట్లతో రాణించగా.. స్టోయినిస్ 3 వికెట్లు తీశాడు. సౌతాఫ్రికా బ్యాటర్లలో హెండ్రిక్స్ ఒక్కడే 56 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.