iDreamPost
android-app
ios-app

ఆసియా కప్‌: టీమిండియాతో ఫైనల్‌! శ్రీలంకకు భారీ షాక్‌

  • Author Soma Sekhar Published - 03:26 PM, Fri - 15 September 23
  • Author Soma Sekhar Published - 03:26 PM, Fri - 15 September 23
ఆసియా కప్‌: టీమిండియాతో ఫైనల్‌! శ్రీలంకకు భారీ షాక్‌

ఆసియా కప్ లో భాగంగా పాక్ తో తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో శ్రీలంక అద్భుత విజయం సాధించింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో అసాధారణ పోరాటంతో 2 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. దీంతో పాక్ ను మట్టికరిపించి ఆసియా కప్ ఫైనల్ కు దూసుకెళ్లింది శ్రీలంక. అయితే ఫైనల్ కు వెళ్లిన గెలుపు జోష్ లో ఉన్న శ్రీలంకకు భారీ షాక్ తగిలేలా ఉందని సమాచారం. పాక్ తో మ్యాచ్ సందర్భంగా లంక స్టార్ స్పిన్నర్ గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో టీమిండియాతో ఫైనల్ మ్యాచ్ కు అతడు అందుబాటులోకి వస్తాడా? రాడా? అన్నది అనుమానంగా మారింది.

ఆసియా కప్ 2023 ఫైనల్లోకి అడుగుపెట్టిన శ్రీలంకకు భారీ షాక్ తగిలింది. పాక్ తో మ్యాచ్ సందర్భంగా గాయపడ్డాడు లంక స్టార్ స్పిన్నర్ మహేష్ తీక్షణ. ఫీల్డింగ్ చేస్తున్న సందర్భంగా కుడి తొడ కండరాలు పట్టేశాయి. అయినప్పటికీ ఆ నొప్పితోనే తన స్పెల్ ను పూర్తి చేశాడు తీక్షణ. అయితే అతడి గాయం తీవ్రమైనట్లు తెలుస్తోంది. తొడ కండరాలు పట్టేయడంతో.. అతడు నొప్పితో ఇబ్బంది పడుతున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డ్ గురువారం రాత్రి వెల్లడించింది. దీంతో సెప్టెంబర్ 17న టీమిండియాతో జరగబోయే ఫైనల్ మ్యాచ్ కు మహేష్ తీక్షణ అందుబాటులోకి వచ్చే అవకాశాలు తక్కువనే చెప్పాలి.

మహేష్ తీక్షణకు గాయం కావడంతో శ్రీలంకకు గట్టి షాక్ తగిలిందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత కొంతకాలంగా శ్రీలంక స్పిన్ బౌలింగ్ దళానికి వెన్నముకగా నిలుస్తూ వస్తున్నాడు మహేష్ తీక్షణ. ఇలాంటి సమయంలో స్టార్ స్పిన్నర్ గాయపడటం లంక జట్టులో ఆందోళన రేకెత్తిస్తోంది. ఇక 2021లో ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అడుగుపెట్టిన ఈ ఆఫ్ స్పిన్నర్ ఇప్పటి వరకు 27 వన్డేల్లో 44 వికెట్లు తీశాడు. తాజాగా జరుగుతున్న ఆసియా కప్ లో 8 వికెట్లతో సత్తాచాటాడు. స్పిన్ కు అనుకూలిస్తున్న కొలంబో పిచ్ మీదే ఫైనల్ జరగడం, ఈ మ్యాచ్ కు అతడు దూరం కావడం శ్రీలంకకు భారీ నష్టం తెస్తుందని క్రీడా పండితులు చెప్పుకొస్తున్నారు.