ఫస్ట్‌ సెంచరీ వీరుడు.. ఫస్ట్‌ సిరీస్‌ గెలిపించిన భారత కెప్టెన్‌! ఎవరో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో టీమిండియా ఓ అగ్రశ్రేణి జట్టు. ప్రపంచ క్రికెట్‌ను శాసించే క్రికెట్‌ బోర్డు బీసీసీఐ. ఈ వైభవం ఓవర్‌నైట్‌లో వచ్చింది కాదు. కొన్ని ఏళ్లుగా గొప్ప గొప్ప క్రికెటర్లు.. మైదానల్లో తమ చెమటను చిందించి.. దేశప్రతిష్టతను అంచెలంచెలుగా పెంచారు. ఇప్పుడు టీమిండియా వరల్డ్‌ కప్‌ టీమ్‌గా ఉందంటే.. దాని వెనుక ఎందరో క్రికెటర్ల కృష్టి ఉంది. అలాంటి చాలా మంది క్రికెటర్లు ఈ తరం వారికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ, వారి సేవలను.. వారి జయంతి, వర్ధంతి సందర్భంగా గుర్తుచేసుకోవడం మన కనీస బాధ్యత. అందులో భాగంగా.. నేడు లాలా అమర్‌నాథ్‌ జయంతి సందర్భంగా ఆయన సాధించిన గొప్ప విజయాలు.. టీమిండియాకు అందించిన సేవల గురించి తెలుసుకుందాం..

లాలా అమర్‌నాథ్‌.. పూర్తి పేరు నానిక్ అమర్‌నాథ్ భరద్వాజ్. భారతదేశానికి స్వతంత్రం రాకముందే.. ఇండియన్‌ క్రికెట్‌కి హీరో ఆయన. 1911 సెప్టెంబర్‌ 11న పంజాబ్‌లో జన్మించారు. 1933 డిసెంబర్‌ 15న ముంబైలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశారు. తన తొలి మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగారు. విశేషం ఏంటంటే.. అమర్‌నాథ్‌ చేసిన సెంచరీనే.. టీమిండియాకు భారత్‌లో తొలి టెస్ట్‌ సెంచరీ. టీమిండియా సెంచరీల పంట ఆయనతోనే మొదలైంది. భారత్‌ తరఫున అమర్‌నాథ్‌ ఆడింది తక్కువ టెస్టులే అయినా.. ఆయన ప్రభావం ఇండియన్‌ క్రికెట్‌పై అప్పట్లో చాలా ఉండేది.

జట్టులోకి వచ్చిన తర్వాత.. కొన్ని రోజులకు అప్పటి టీమిండియా కెప్టెన్‌ మహారాజ్‌ కుమార్‌ ఆఫ్‌ విజయనగరంతో గొడవ.. జట్టు నుంచి ఉద్వాసన, తర్వాత కొన్ని రోజులకు జట్టులోకి ఎంట్రీ.. మళ్లీ టీమ్‌ మేనేజ్‌మెంట్‌తో గొడవ ఇలా నిత్య పోరాటంగా సాగింది అమర్‌నాథ్‌ కెరీర్‌. కానీ అతని పోరాటం చాలా వరకు ఆత్మగౌరవం కోసం సాగింది. ప్రత్యర్థి జట్లకు ఒకలా.. టీమిండియాకు ఒకలా సౌకార్యాలు కల్పిస్తూ.. టీమిండియా ఆటగాళ్లను సెకండ్‌ క్లాస్‌ మనుషుల్లా ట్రీట్‌ చేస్తుంటే.. తట్టుకోలేక ఏకంగా బోర్డుతోనే కయ్యానికి దిగిన డేరింగ్‌ డాషింగ్‌ క్రికెటర్‌ అమర్‌నాథ్‌.

టీమిండియా తరఫున మొత్తం 24 టెస్టులు ఆడిన అమర్‌నాథ్‌.. 40 ఇన్నింగ్స్‌ల్లో 878 పరుగులు చేశారు. అందులో ఒక సెంచరీ, 4 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. కానీ, ఫస్ట్ క్లాస్‌ క్రికెట్‌లో మాత్రం అమర్‌నాథ్‌కు అద్భుతమైన రికార్డ్‌ ఉంది. 186 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన అమర్‌నాథ్‌.. 286 ఇన్నింగ్స్‌ల్లో 41.37 సగటుతో 10426 పరుగులు చేశారు. అందులో 31 సెంచరీలు, 39 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. టీమిండియా తరఫున తొలి సెంచరీ చేసిన ప్లేయర్‌గా నిలిచిన అమర్‌నాథ్‌. టీమిండియాకు తొలి టెస్ట్‌ సిరీస్‌ విజయం అందించిన కెప్టెన్‌గా కూడా కీర్తిగడించారు.

1952-53 మధ్య కాలంలో పాకిస్థాన్‌తో టీమిండియా 5 టెస్టుల సిరీస్‌ ఆడింది. ఈ సిరీస్‌లో అమర్‌నాథ్‌ టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఆ సిరీస్‌లో భారత్‌.. పాక్‌ను 2-1తో చిత్తు చేసి.. తొలి టెస్ట్‌ సిరీస్‌ విజయాన్ని అందుకుంది. తొలి సెంచరీ చేసిన బ్యాటర్‌గా, తొలి టెస్ట్‌ సిరీస్‌ గెలిచిన కెప్టెన్‌గా లాలా అమర్‌నాథ్‌ ఇండియన్‌ క్రికెట్‌ హిస్టరీలో చిరస్థాయిగా నిలిచిపోతారు. 1983లో వరల్డ్‌ కప్‌ గెలిచిన టీమిండియాలో లాలా అమర్‌నాథ్‌ కుమారుడు మొహిందర్‌ అమర్‌నాథ్‌ కూడా సభ్యుడిగా ఉన్నారు. ఆయన తండ్రిని మించిన క్రికెటర్‌ అయ్యారు. లాలా మరో కుమారుడు సురీందర్‌ అమర్‌నాథ్‌ కూడా టీమిండియాకు ఆడారు. ఇండియన్‌ క్రికెట్‌కు ఎంతో చేసిన లాలా అమర్‌నాథ్‌ 2000వ ఏడాది ఆగస్టు 5న ‍న్యూఢిల్లీలో కన్నుమూశారు. మరి అమర్‌నాథ్‌ కెరీర్‌, ఆయన సాధించిన అద్భుత రికార్డులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఆసియా కప్‌ వల్ల భారీగా నష్టపోతున్నాం.. పరిహారం కావాలి!

Show comments